Psychological Thriller Series on OTT : రాత్రి వేళల్లో కనిపిస్తున్న ఓ మిస్టీరియస్ అమ్మాయి… ఆ తర్వాత అడవిలో బయటపడిన ఓ యువతి మృతదేహం. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందని రచయిత్రి అలీషాకు అనిపిస్తుంది. కానీ ఆమె గతంలో ఎదుర్కొన్న మానసిక సమస్యలు మాత్రం ఆమె చూసేది నిజమా, భ్రమా అనే అనుమానాన్ని మరింత పెంచుతాయి. తన చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నట్టుగా అనిపించే సమయంలో, ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నం ఆమెను ఊహించని ప్రమాదంలోకి నెడుతుంది. ఇలా హారర్ కంటే మైండ్ గేమ్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉత్కంఠ రేపే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్రహ్మ్’ (Bhram). మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
అలీషా ఖన్నా ఓ రచయిత్రి. భర్త మరణం తర్వాత ఆమె తీవ్రమైన డిప్రెషన్ కు గురవుతుంది. దాదాపు ఆరు నెలలు మానసిక చికిత్స తీసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండేందుకు తన అక్క అంకిత, ఆమె భర్త పీటర్ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ ఇల్లు ఓ కొండ ప్రాంతానికి వెళ్తుంది. కొత్త వాతావరణంలో కొంతకాలం గడిపితే కోలుకోవచ్చని భావిస్తుంది. కానీ అక్కడికి వచ్చిన వెంటనే ఆమెకు విచిత్రమైన సీన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి .
అదే సమయంలో పోర్టర్ హిల్ లోని సెయింట్ ఆగస్టిన్ స్కూల్ కు చెందిన ఓ యువతి కనిపించకుండా పోతుంది. తర్వాత అడవిలో ఆమె మృతదేహం బయట పడుతుంది. ఈ సంఘటన అలీషాను మరింత కలవర పెడుతుంది. ఎందుకంటే ఆమెకు అప్పటికే ఓ మిస్టీరియస్ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. తాను చూసింది నిజమా, భ్రమా అనే విషయంలో అలీషాకే స్పష్టత ఉండదు. కానీ ఆ అమ్మాయి గురించి బయట పడుతున్న విషయాలు అలీషాకు కనిపిస్తున్న సీన్స్ కు ఏదో విధంగా సంబంధం ఉన్నట్టు అనిపిస్తాయి.
డాక్టర్ సైనీ అలీషాను పరీక్షించినప్పుడు ఆమె శరీరంపై కనిపించే కొన్ని గాయాల గుర్తులు హత్యకు గురైన అమ్మాయితో పోలి ఉండటం మరింత అనుమానాలను పెంచుతుంది. దీంతో ఆమెను ప్రముఖ హిప్నాటిస్ట్ డాక్టర్ రావు దగ్గరకు తీసుకెళ్తారు. హిప్నాసిస్ ద్వారా అలీషా గతాన్ని తవ్వే కొద్దీ చాలా కాలం క్రితం జరిగిన ఓ సంఘటన, అడవిలో తిరుగుతున్నట్లు చెప్పుకునే మిస్టీరియస్ శక్తి, ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఒకదానితో ఒకటి ముడిపడుతున్నట్టు తెలుస్తుంది.
అలీషా తనకు కనిపిస్తున్న దృశ్యాలను నమ్మాలా ? లేక తన మానసిక పరిస్థితినే అనుమానించాలా ? ఇరవై ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ఇప్పుడు జరుగుతున్న హత్యకు సంబంధం ఏంటి ? ఆమె వెతుకుతున్న నిజం బయటపడితే… గతం గురించి తెలిసే విషయం ఎంత భయంకరంగా ఉంటుంది ? ఈ ప్రశ్నల చుట్టూ సాగే సిరీసే ‘బ్రహ్మ్’ (Bhram). ఇందులో హారర్ కంటే మైండ్ గేమ్, సైకలాజికల్ మిస్టరీ ఎక్కువగా ఉంటుంది.
‘బ్రహ్మ్’ సిరీస్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ఆడియో అందుబాటులో ఉంది. హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఆడియోలు కూడా ఉన్నాయి. కల్కి కొచ్లిన్ (Kalki Koechlin), ఎజాజ్ ఖాన్ (Eijaz Khan), సంజయ్ సూరి (Sanjay Suri), భూమికా చావ్లా (Bhumika Chawla) కీలక పాత్రల్లో నటించారు.