OTT Movies: నరమాంస భక్షకులు.. వీరి గురించి వింటేనే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదూ. అయితే, వారికి ఒక మనసు ఉంటుందని.. వాళ్ల జీవితాల్లోనూ ప్రేమ, ఆప్యాయతలు, త్యాగాలు ఉంటాయని మీకు తెలుసా? అదేంటీ మనుషులను తినేసే మనుషుల గురించి అంత గొప్పగా చెబుతున్నారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఇప్పుడు మీరు చదవబోయే సినిమా నేపథ్యం ఇది. నరమాంస భక్షకులు మనిషి మాంసానికి ఎలా అలవాటు పడతారు. దాని వల్ల వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటనే విషయాన్ని.. ‘బోన్స్ అండ్ ఆల్’ (Bones And All – 2022) మూవీలో చాలా బాగా చూపించారు.
ఇదీ కథ..
1980 దశకంలో అమెరికాలో జరిగిన కథగా ఈ మూవీ మొదలవుతుంది. మారెన్ ఇయర్లీ (టేలర్ రస్సెల్) అనే 18 ఏళ్ల అమ్మాయికి మనిషి మాంసం తినాలనే కోరిక పుడుతుంది. వాస్తవానికి ఆమె చాలా సాధారణ యువతిలా కనిపిస్తుంది. కానీ, మనుషులను చూస్తే కొరుక్కుని తినేయాలనే కసితో రగిలిపోతుంటుంది. కానీ, తనని తాను నియంత్రించుకుంటుంది. అయితే, ఈ విషయం ఆమె తండ్రి ఫ్రాంక్ (ఆండ్రీ హాలండ్)కు ముందే తెలుసు. ఈ అసాధారణ కోరికను దాచడానికి ఫ్రాంక్ ఆమెను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వారు వర్జీనియాలోని ఒక చిన్న పట్టణానికి చేరుకుంటారు. అయితే, ఒక రాత్రి మారెన్ తన స్నేహితురాలి ఇంటిలో తన కోరికను నియంత్రించకోలేక ఒక వ్యక్తిని తినేయబోతుంది. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి ఫ్రాంక్.. ఆమెకు ఒక క్యాసెట్ టేప్, కొంత డబ్బును ఇచ్చి ఆమె తల్లిని కనుక్కోమని చెబుతాడు. ఆ టేపులో ఆమె గతానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఉంటాయి.
తల్లి కోసం ప్రయాణం..
మారెన్ తన తల్లిని వెతుక్కుంటూ ఒంటరిగా ప్రయాణిస్తుంది. దారి మధ్యలో ఆమెకు లీ (టిమోతీ షాలమెట్) అనే యువకుడు పరిచయం అవుతాడు. లీ కూడా ఒక నరమాంస భక్షకుడని తెలిసి ఆశ్చర్యపోతుంది. అయితే, అతడు ఆమెలా భయపడుతూ కాకుండా చాలా స్వేచ్ఛగా జీవించడం చూసి.. ధైర్యం తెచ్చుకుంటుంది. అతడు తన ఆకలి తీర్చుకోవడం కోసం ఏ మాత్రం వెనకాడడు. మారెన్ అసలు విషయం చెప్పడంతో అతడు కూడా ఆమెకు తోడు వెళ్తాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దీంతో ఒక రోజు ఇద్దరూ ఆ పని కానిస్తారు. (అలాంటి సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడొద్దు).
సుల్లీ పరిచయంతో మలుపు తిరిగే కథ..
ఆ ప్రయాణంలోనే మారెన్‌కు సుల్లీ (మార్క్ రైలాన్స్) అనే వృద్ధుడు కూడా పరిచయమవుతాడు. అతడు కూడా మనుషులను తినే నరమాంస భక్షకుడు. అయితే, అతడు తన ప్రియుడు లీ కంటే భయాకరమైన వ్యక్తి. ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు. తన ఆకలిని తీర్చుకోడానికి ఎవరినైనా సరే చంపేసే రకం. ఎలాంటి నీతి నియమాలు పాటించడు. మనుషులను తినేందుకు భయపడుతున్న మారెన్‌కు సుల్లీ కొన్ని ఉచిత సలహాలు ఇస్తాడు. నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు అని ప్రోత్సాహిస్తాడు. ఈ సందర్భంగా ఆమెకు ‘బోన్స్ అండ్ ఆల్’ అనే సిద్ధాంతాన్ని పరిచయం చేస్తాడు. మనుషులను తినాలనే కోరిక నుంచి విముక్తి పొందాలంటే.. ఒక మనిషిని పూర్తిగా, ఎముకులతో సహా తినేయాలనేది ఆ సిద్ధాంతం చెబుతుంది. కానీ మారెన్ అలా చేయలేను అని అంటుంది. సుల్లీకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.
తల్లి గురించి తెలిసి షాక్.. చివరికి ప్రియుడు బలి
మారెన్ తల్లి (క్లో సెవిగ్నీ) కూడా నరమాంస భక్షకురాలని తెలిసి మారెన్ షాకవుతుంది. చివరికి ఆమె ఒక మెంటల్ హాస్పిటల్‌లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తుంది. ఆమె ఆకలిని నియంత్రించుకోలేక తనని తానే తినేందుకు ప్రయత్నించిందని తెలుసుకుని మారెన్‌కు నోటమాట రాదు. భవిష్యత్తులో తన పరిస్థితి కూడా అంతేనేమో అని మదన పడిపోతుంది. తల్లి ద్వారా మారెన్ మరిన్ని విషయాలపై అవగాహన తెచ్చుకుంటుంది. అదే సమయంలో లీ గతంలో చేసిన కొన్ని భయానక చర్యలను మారెన్‌కు చెబుతాడు. మరోవైపు సుల్లీ కూడా వారి జీవితంలోకి ప్రవేశిస్తాడు. దీంతో మారెన్ తీవ్ర ఒత్తిడికి గురవ్వుతుంది. సుల్లీ వల్ల కథ మరింత భయానకంగా మారుతుంది. చివరికి.. మారెన్ తన ప్రియుడినే తినేస్తుంది. అసలు ఆమె అలా ఎందుకు చేస్తుంది? చివరికి ఆమె సాధారణ మనిషిలా మారుతుందా లేదా అనేది తెలియాలంటే.. తప్పకుండా మీరు ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో రెంట్‌లో ఉంది. కానీ, ఈ మూవీని ఒంటరిగా చూడండి. హింసాత్మక, పెద్దలు మాత్రమే చూడగలిగే సీన్లు ఉంటాయి.