Tamil Horror Thriller on OTT : ప్రకృతి ఒడిలో నిర్మానుష్యంగా ఉన్న ఓ పాత స్కూల్ బిల్డింగ్… అక్కడికి వెళ్లిన ఓ కుటుంబానికి మొదటి రాత్రి నుంచే వింత అనుభవాలు ఎదురైతే ? తలుపులు వాటంతట అవే లాక్ అవ్వడం, కరెంట్ పోవడం, మొబైల్ ఫోన్లు హ్యాక్ అవ్వడం… అసలు అక్కడ ఏం జరుగుతోంది ? అది దెయ్యం పనా ? లేక మనుషులు చేసిన పాపాలకు ప్రకృతి ఇస్తున్న శిక్షా ? అదే ‘భూమిక’ (Boomika) కథ. మరి ఈ తమిళ థ్రిల్లర్ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఊటీలోని నీలగిరి అడవుల మధ్య చాలా కాలంగా మూతపడి ఉన్న ఓ పాత రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్ గౌతమ్ ఆ స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ పర్యావరణ అనుకూల విల్లాలు నిర్మించాలని ప్లాన్ చేస్తాడు. ప్రాజెక్ట్ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు తన భార్య సంయుక్త, నాలుగేళ్ల మూగ కొడుకు సిద్ధు, తన సోదరి అదితి, ఆర్కిటెక్ట్ గాయత్రితో కలిసి అక్కడికి వెళ్తాడు. సంయుక్త చైల్డ్ సైకాలజిస్ట్. మొదట ఆ పాత భవనాన్ని చూసి పెద్దగా భయపడదు. కానీ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.
తలుపులు తమంతట అవే లాక్ అవుతాయి. కరెంట్ పదేపదే పోతుంది. ఎక్కడి నుంచో వింత శబ్దాలు వినిపిస్తాయి. అంతేకాదు ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు కూడా ఎవరో హ్యాక్ చేసినట్టుగా వింతగా పని చేయడం మొదలు పెడతాయి. ఇదంతా చూసి కుటుంబ సభ్యులు భయపడిపోతారు. కానీ సంయుక్త మాత్రం ఈ సంఘటనల వెనుక ఏదో కారణం ఉందని అనుమానిస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ఆ భవనానికి సంబంధించిన కొన్ని పాత ఫోటోలు, ఓ డైరీ దొరుకుతాయి. అందులో భూమిక అనే గిరిజన బాలిక గురించి తెలుస్తుంది.
భూమిక సాధారణ బాలిక కాదు. ఆమెకు ఆటిజం ఉండేది. ఆమె కుటుంబం కూడా ఆ ప్రాంతంలో జరిగిన కొన్ని అన్యాయాల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్టు సంయుక్తకు అర్థమవుతుంది. దీంతో ఆ భవనంలో జరుగుతున్న వింతలకు, భూమికకు ఏదో సంబంధం ఉందని ఆమె భావిస్తుంది. నిజం తెలుసుకునే ప్రయత్నంలో సంయుక్తకు మరింత షాకింగ్ విషయం తెలుస్తుంది. విల్లా ప్రాజెక్ట్ కోసం అడవులను నాశనం చేయడమే కాకుండా, గతంలో అక్కడి నీటిని విషపూరిత రసాయనాలతో కలుషితం చేశారు.
ఆ నీటిని తాగిన గిరిజన ప్రజలు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధితుల్లో భూమిక కూడా ఒకరు. ఇంతకీ ఆ ఇంట్లో కనిపిస్తున్నది నిజంగా భూమిక ఆత్మేనా ? లేక ప్రకృతే మనుషులకు హెచ్చరికలు ఇస్తోందా ? గౌతమ్ ప్రాజెక్ట్ వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటి ? చివరకు ఆ కుటుంబం అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడిందా ? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన కథ.
Also Read : మనుషుల్ని చంపే పులిని పట్టుకోవడానికెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘భూమిక’ను రతీంద్రన్ ఆర్. ప్రసాద్ తెరకెక్కించారు. కార్తీక్ సుబ్బరాజ్ సమర్పించిన ఈ ఎకో-హారర్ థ్రిల్లర్ 2021 ఆగస్టు 23న Netflixలో నేరుగా విడుదలైంది. గుడ్ న్యూస్ ఏంటంటే… తెలుగు ఆడియోతోనూ అందుబాటులో ఉన్నాయి. సాధారణ దెయ్యం కథలకు భిన్నంగా ప్రకృతి పరిరక్షణను హారర్‌తో ముడిపెట్టిన సినిమాలు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.