Malayalam Survival Thriller on OTT : దట్టమైన అడవి పక్కనే ఓ గిరిజన గ్రామం… ఒకవైపు నరభక్షక పులి, మరోవైపు అడవి ఏనుగుల దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే? వాళ్ల సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? చివరికి ఆ పులిని వేటాడేందుకు ఓ ప్రొఫెషనల్ షార్ప్ షూటర్ రంగంలోకి దిగితే ? కానీ అడవిలోకి వెళ్లిన తర్వాత అసలు ప్రమాదం జంతువుల నుంచి కాదని అతనికి తెలిస్తే ? ఇలాఅ మనిషి-వన్యప్రాణుల సంఘర్షణకు సామాజిక సమస్యలను జోడించి తెరకెక్కించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘Lurk – Eyes on the Prey’ మూవీ. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనేది తెలుసుకుందాం.
కేరళలోని దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న ఓ కొండ ప్రాంత గిరిజన గ్రామంలో కథ మొదలవుతుంది. అడవికి దగ్గరగా జీవించే ఆ ప్రజలకు వన్యప్రాణులే నిత్య భయం. ముఖ్యంగా ఓ నరభక్షక పులి వరుసగా మనుషులపై దాడులు చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. అదే సమయంలో అడవి ఏనుగులు కూడా గ్రామంలోకి చొరబడి పంటలను నాశనం చేస్తుంటాయి. ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా పోతుంటాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం, అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతుంటారు.
కానీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో ప్రభుత్వం చివరకు రంగంలోకి దిగుతుంది. ఫారెస్ట్ మినిస్టర్, కలెక్టర్, అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుంటారు. అయితే నరభక్షక పులిని పట్టుకోవడం అంత సులభం కాదు. దీంతో ఆ పులిని అంతమొందించేందుకు జైరామ్ కళ్యాణ రామన్ అనే అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ షార్ప్‌షూటర్‌ను రంగంలోకి దింపుతారు. అడవిలో జంతువులను వేటాడటంలో నైపుణ్యం ఉన్న అతను పులి కోసం వేట మొదలు పెడతాడు. కానీ అడవిలోకి వెళ్లిన తర్వాత జైరామ్‌కు పరిస్థితి అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ గా ఉందని అర్థమవుతుంది.
పులి దాడుల వెనుక కేవలం వన్యప్రాణుల సమస్య మాత్రమే లేదని అతనికి అనుమానం మొదలవుతుంది. అడవిలో జరుగుతున్న అక్రమ స్మగ్లింగ్, రాజకీయ ప్రయోజనాలు, గిరిజనులపై జరుగుతున్న దోపిడీ వంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అంటే గ్రామస్తులు ఒకవైపు అడవి జంతువుల నుంచి తప్పించుకోవాలి. మరోవైపు తమ స్వార్థం కోసం అడవిని నాశనం చేస్తున్న మనుషులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అసలు నరభక్షక పులి ఎందుకు మనుషులపై దాడి చేస్తోంది? అడవిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు దీనికి సంబంధం ఏంటి? గిరిజనుల కష్టాలను ఉపయోగించుకుంటున్న అసలు వ్యక్తులు ఎవరు? చివరికి జైరామ్ పులిని వేటాడగలిగాడా? ఈ పోరాటంలో అసలైన వేటగాడు ఎవరు? అనేదే సినిమాలోని అసలు సస్పెన్స్.
Also Read : నగరాన్ని కమ్మేసే పొగమంచు… హీరోయిన్ల వరుస హత్యలు… అదృశ్య కిల్లర్ అరాచకం
సాయిజు కురుప్, మంజు పిళ్లై, ఎం.ఎ. నిషాద్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఎం.ఎ. నిషాద్ దర్శకత్వం వహించారు. మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణను కేవలం సర్వైవల్ థ్రిల్లర్‌గా కాకుండా, గిరిజనుల సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమ కార్యకలాపాలు వంటి సామాజిక అంశాలతో ముడిపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. ఆగస్టు 26 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు. మిస్టరీ, సర్వైవల్ థ్రిల్లర్‌తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చూడాలనుకుంటే ఈ మూవీ మీకోసమే.