Chinese Action Thriller: యాక్షన్ సినిమాల్లో హీరో చేతికి కత్తి చిక్కిందంటే శత్రువులకు ఇక చుక్కలే. అందులోనూ అన్యాయానికి ఎదురుతిరిగే ఓ నిజాయితీపరుడైన పోలీస్ అధికారి కథ అయితే యాక్షన్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి కథతో వచ్చిన చైనీస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది బుచర్స్ బ్లేడ్’ (The Butcher’s Blade) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అవినీతి అధికారులు, అధికార దుర్వినియోగం, కత్తులతో సాగే పోరాటాలతో ఈ సినిమా యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
జు బ్యూయి ఓ కింది స్థాయి పోలీసు అధికారి. నిజాయితీగా పనిచేయడం తప్ప లోకంలో జరిగే రాజకీయాలు, కుట్రలు అతడికి పెద్దగా తెలియవు. అందుకే పోలీస్ శాఖలోని కొందరు తోటి ఉద్యోగులు అతడిని చిన్నచూపు చూస్తుంటారు. అయినా తన బాధ్యతలను మాత్రం వదులుకోడు. ఇలాంటి సమయంలో ప్రజలకు అందాల్సిన విపత్తు సహాయ నిధులు భారీ మొత్తంలో మాయమవుతాయి. అసలు నేరస్తులు తప్పించుకుని, ఆ దొంగతనం నేరాన్ని జు బ్యూయిపై నెట్టేస్తారు. దీంతో అతడు ఒక్కసారిగా నిందితుడిగా మారిపోతాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడి గురువు హువాంగ్ షినింగ్ అతడిని ఆదుకుంటాడు.
కానీ జు బ్యూయికి ఎదురైన సమస్య అక్కడితో ముగియదు. బతికి బయటపడాలంటే ధనవంతులు, పలుకుబడి ఉన్నవారికి రక్షణ కల్పించే ఓ రహస్య బృందంలో పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ అడుగుపెట్టిన తర్వాత వ్యవస్థలోని అసలు అవినీతి, అధికారుల కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఒకవైపు తన ప్రాణాలను కాపాడుకోవాలి.. మరోవైపు తన నిజాయితీని నిలబెట్టుకోవాలి. ఈ రెండింటి మధ్య నలిగిపోయే జు బ్యూయి చివరకు తిరుగుబాటు చేస్తాడు. తనను బలిపశువును చేసినవారి వెనుక ఉన్న అసలు కుట్రను ఎలా బయటపెట్టాడు? కత్తి పట్టి శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ.
లియు వెన్పు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జు బ్యూయిగా లియు ఫెంగ్‌చావో నటించగా, అతడి గురువు హువాంగ్ షినింగ్‌గా చున్యు షాన్‌షాన్ కనిపించారు. యువాన్ ఫుఫు, లియు చావో, లియు ఎన్షాంగ్, గావో వీమాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుమారు 90 నిమిషాల నిడివి ఉన్న ఈ చైనీస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 8, 2026న చైనాలో ఆన్‌లైన్‌లో విడుదలైంది. ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, తమిళం, హిందీ, చైనీస్ ఆడియోల్లో అందుబాటులో ఉంది. JioHotstarలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.