Gentle Monster OTT: మనతో కలిసి జీవించే వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలుసని అనుకుంటాం. అయితే ఒక్కసారిగా అతడి గురించి ఊహించని నిజాలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ముఖ్యంగా ఎంతగానో ప్రేమించే భర్తపై తీవ్రమైన నేరారోపణలు వస్తే ఓ భార్య పరిస్థితి మరింత దీనంగా ఉంటుంది. అతడిని నమ్మాలా? అనుమానించాలా? కన్నబిడ్డ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలతో పిచ్చెక్కిస్తూ, ప్రేక్షకులను ఆలోచింపజేసే సైకలాజికల్ క్రైమ్ డ్రామా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జెంటిల్ మాన్‌స్టర్’ (Gentle Monster) లియా సెడౌక్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ఈ రోజు నుంచి చూసేయచ్చు. ఇది ఏ ఓటీటీలోకి వచ్చింది ? దీని కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.
లూసీ ఓ ప్రతిభావంతమైన పియానిస్ట్. ఫిల్మ్ మేకర్ అయిన భర్త ఫిలిప్ తీవ్ర మానసిక ఒత్తిడితో ఇబ్బందిపడుతుండటంతో, అతడు కోలుకోవాలనే ఉద్దేశంతో తమ చిన్న కొడుకు జానీతో కలిసి జర్మనీలోని బవేరియా గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంటికి మారుతుంది. నగరానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడుతుంది. కానీ వారి కొత్త జీవితం మొదలై కొద్దిరోజులు కూడా కాకముందే ఓ ఉదయం పోలీసులు ఇంటికి వస్తారు. ఫిలిప్‌పై పిల్లలకు సంబంధించిన లైంగిక వేధింపుల కంటెంట్‌ను కలిగి ఉన్నాడనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో అతడి కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటారు.
ఈ ఘటనతో లూసీ ప్రపంచమే తలకిందులవుతుంది. తనకు ఇన్నాళ్లూ ఎంతో మంచివాడిగా కనిపించిన భర్తపై ఇలాంటి ఆరోపణలు రావడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఫిలిప్ మాత్రం తన తప్పేమీ లేదని, తాను ఓ డాక్యుమెంటరీ కోసం పరిశోధన చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ అతడి మాటలను పూర్తిగా నమ్మలేని పరిస్థితి లూసీది. ఒకవైపు భర్త నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలనే ఆరాటం.. మరోవైపు తన చిన్న కొడుకు భద్రతపై భయం.. ఈ రెండింటి మధ్య ఆమె మానసికంగా కుంగిపోతుంది. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఫిలిప్ గురించి కొత్త విషయాలు బయటపడతాయి. అసలు తన భర్త ఎవరు? అతడిపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? తన బిడ్డను ఎలా కాపాడుకోవాలి? అనే సంఘర్షణే ఈ సినిమా ప్రధాన కథాంశం.
‘జెంటిల్ మాన్‌స్టర్’ (Gentle Monster) సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ లో లూసీగా లియా సెడౌక్స్, ఆమె భర్త ఫిలిప్‌గా లారెన్స్ రూప్ నటించారు. పోలీస్ డిటెక్టివ్ ఎల్సా పాత్రలో జెల్లా హాస్, లూసీ తల్లిగా కేథరిన్ డెనీవ్, జానీగా మాలో బ్లాంచెట్ కనిపించారు. మేరీ క్రూట్‌జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు 1 గంట 55 నిమిషాల నిడివితో 2026 మే 15న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 18 నుంచి Netflixలో ఈ సినిమా జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు.