Guarding Stars OTT: సాధారణంగా సినిమాల్లో హీరోలు హీరోయిన్లను ప్రమాదాల నుంచి కాపాడటం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కథ మొత్తం రివర్స్! ఓ హాలీవుడ్ యాక్షన్ స్టార్ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే, అతడిని కాపాడే బాధ్యత ఓ ధైర్యవంతురాలైన మహిళా బాడీగార్డ్‌కు అప్పగిస్తారు. అయితే ఆమె తన వృత్తిని పక్కనపెట్టి అతడి కుటుంబం ముందు గర్ల్‌ఫ్రెండ్‌గా నటించాల్సి వస్తుంది. అలా మొదలైన నకిలీ ప్రేమ ప్రయాణం నిజమైన బంధంగా మారితే? మధ్యలో ప్రాణాలకు ముప్పు, కుటుంబ సభ్యుల సందడి, క్రిస్మస్ వేడుకలు తోడైతే వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూపించే హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ‘గార్డింగ్ స్టార్స్’ (Guarding Stars) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. లెయిటన్ మీస్టర్, జారెడ్ పడలెక్కి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 18 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
హన్నా బ్రూక్స్ ఓ ప్రొఫెషనల్ బాడీగార్డ్. ఎంతటి క్లిష్టమైన పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆమెకు ఓ అనూహ్యమైన బాధ్యత అప్పగిస్తారు. హాలీవుడ్‌లో భారీ క్రేజ్ ఉన్న యాక్షన్ స్టార్ జాక్ స్టాపుల్టన్‌కు ఓ స్టాకర్ నుంచి ప్రాణహాని ఉంటుంది. దీంతో అతడికి రక్షణ కల్పించేందుకు హన్నాను నియమిస్తారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా జాక్ తన కుటుంబాన్ని కలవడానికి మోంటానాలోని వారి రాంచ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే తనకు ప్రమాదం ఉందనే విషయం తెలిస్తే తల్లి కంగారుపడుతుందని భావించి, హన్నాను తన బాడీగార్డ్‌గా కాకుండా గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తాడు.
దీంతో హన్నా కూడా తన అసలు గుర్తింపును దాచిపెట్టి జాక్ ప్రియురాలిగా నటించాల్సి వస్తుంది. ఒకవైపు అతడికి రక్షణ కల్పిస్తూనే, మరోవైపు కుటుంబ సభ్యుల ముందు ప్రేమికుల్లా ప్రవర్తించడం ఆమెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. జాక్ కుటుంబంతో కలిసిపోయే క్రమంలో ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. మొదట నటన కోసం మొదలైన ప్రేమ క్రమంగా నిజమైన అనుబంధంగా మారుతుంది. కానీ జాక్‌ను వెంటాడుతున్న ప్రమాదం మాత్రం ఇంకా తొలగిపోదు. అసలు ఆ స్టాకర్ ఎవరు? హన్నా అతడిని ఎలా కాపాడింది? నకిలీ ప్రేమ ఎప్పుడు నిజమైన ప్రేమగా మారింది? అనేదే ఈ సినిమా కథ.
హన్నా బ్రూక్స్ పాత్రలో లెయిటన్ మీస్టర్, జాక్ స్టాపుల్టన్‌గా జారెడ్ పడలెక్కి నటించారు. ఆండీ మెక్‌డోవెల్, నోహ్ లాలాండే, టోబీ శాండెమన్, వాకర్ హేస్, రాచెల్ అంచెరిల్, షాన్ జాన్స్టన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎలిజబెత్ అలెన్ రోసెన్‌బామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎరిన్ కార్డిల్లో, రిచర్డ్ కీత్, గినా మాథ్యూస్, గ్రాంట్ షార్బో కథా రచనలో భాగమయ్యారు. కేథరిన్ సెంటర్ రాసిన ‘ది బాడీగార్డ్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నవంబర్ 18, 2026న Netflixలో నేరుగా విడుదలైన ఈ సినిమా సుమారు గంటా 47 నిమిషాల నిడివితో ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.