Inspirational Family Drama on OTT: చిన్నప్పుడు స్కూల్‌లో తోటి పిల్లలు ఆటపట్టిస్తుంటే, ఆ భయంతో వెనకడుగు వేసిన అనుభవం చాలామందికి ఉండే ఉంటుంది. అయితే ఆ భయాన్ని జయించి, మనల్ని చూసి ఆటపట్టించిన వాళ్లే ఆశ్చర్యపోయేలా నిలబడితే ఆ కిక్కే వేరు కదా! అలాంటి ఒక అద్భుతమైన, మనసును హత్తుకునే ఫ్యామిలీ అండ్ ఇన్‌స్పిరేషనల్ డ్రామా పిల్లలతో పాటు పెద్దలనూ విశేషంగా ఆకట్టుకుంటోంది. స్కూల్లో తోటి పిల్లల వేధింపులు తట్టుకోలేక భయంతో వణికిపోయే ఒక పిల్లాడికి, ఏకంగా ఒక నేవీ సీల్ కమాండో మామయ్యగా వచ్చి ట్రైనర్‌గా మారితే ఆ కుర్రాడి జీవితం ఎలా మారిపోతుందో ఇందులో చాలా ఇన్స్పిరేషన్ గా చూపించారు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ స్టార్ క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సరికొత్త ఫ్యామిలీ అండ్ ఇన్‌స్పిరేషనల్ డ్రామా ‘వే ఆఫ్ ది వారియర్ కిడ్’ (Way of the Warrior Kid) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ మామయ్య ఇచ్చిన ఆ సీక్రెట్ ట్రైనింగ్ ఒక పిల్లాడిని వారియర్ గా ఎలా మార్చిందో, ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐదో తరగతి చదువుతున్న మార్క్‌కు స్కూల్ అంటే ఒక పెద్ద పీడకల. చదువులో, ఆటల్లో అందరికంటే వెనుకబడి ఉండటమే కాకుండా, కనీసం ఈత కూడా రాకపోవడంతో అతను ఎప్పుడూ కుమిలిపోయేవాడు. దీనికి తోడు, స్కూల్‌లో కెన్నీ అనే అల్లరి కుర్రాడు మార్క్‌ను ప్రతిరోజూ ఆటపట్టిస్తూ, భయపెడుతూ నరకం చూపించేవాడు. ఎవరికీ చెప్పుకోలేక, తన బలహీనతలను మార్చుకోలేక మార్క్ లోలోపలే ఎంతో మథనపడుతూ ఉండేవాడు. స్కూల్ కి వెళ్లాలంటేనే చెమటలు పట్టేవి ఈ బుడ్డోడికి.
అలాంటి సమయంలో వేసవి సెలవులు రావడం మార్క్ జీవితంలో ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ సెలవుల్లో నేవీ సీల్ కమాండో అయిన అతని మామయ్య జేక్ వాళ్ల ఇంటికి వస్తాడు. మార్క్ కష్టాలను, భయాలను గమనించిన జేక్, ఆ మూడు నెలల్లో అతడిని ఒక నిజమైన యోధుడిలా మార్చాలని నిశ్చయించుకుంటాడు. ఆ మరుసటి రోజు నుంచే మార్క్ జీవితం పూర్తిగా మారిపోతుంది. రోజూ తెల్లవారుజామునే నిద్రలేవడం, ఒళ్లు హూనమయ్యేలా పుష్-అప్స్, పుల్-అప్స్ చేయడం, నీళ్లంటే ఉన్న భయాన్ని పోగొట్టుకుని ఈత నేర్చుకోవడం, ఆత్మరక్షణ కోసం కూడా కఠినమైన శిక్షణ మొదలవుతుంది.
మొదట్లో ఎంతో కష్టంగా అనిపించినా, అంకుల్ జేక్ ఇచ్చే ప్రోత్సాహంతో మార్క్ ఎక్కడా వెనకడుగు వేయడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, తన తప్పులకు తానే బాధ్యత వహించడం వంటి జీవిత సత్యాలను కూడా అంకుల్ దగ్గర నేర్చుకుంటాడు. సెలవులు ముగిసి తిరిగి స్కూల్ మొదలయ్యే సమయానికి, ఒక కొత్త మార్క్ స్కూల్ పిల్లల ముందు నిలబడతాడు. ఇక ఈ క్లైమాక్స్ సీన్ చూస్తే చాలా మంది పిల్లలు కాలర్ ఎగరేసుకునేటట్టే ఉంటుంది. ఆ ఒక్క వేసవిలో మామయ్య ఇచ్చిన ట్రైనింగ్‌తో మార్క్ తన భయాలను జయించి, స్కూల్లోని సమస్యలను ఎలా ధైర్యంగా ఎదుర్కొని హీరోగా నిలిచాడు అనేది ఇందులో ఎంతో ఇన్స్పిరేషన్ గా చూపించారు.
ఫ్యామిలీ అండ్ ఇన్‌స్పిరేషనల్ డ్రామా ‘వే ఆఫ్ ది వారియర్ కిడ్’ (Way of the Warrior Kid)కు మెక్‌జీ (McG) దర్శకత్వం వహించారు. ఇది యాపిల్ టీవీ (Apple TV) లో 2026 నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 46 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్ సదుపాయంతో అందుబాటులో ఉంది. వీకెండ్‌లో పిల్లలతో కలిసి చూసేందుకు ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
Read Also: తోడు కావాలంటూ బుట్ట బొమ్మ తో ప్రేమ పెళ్లి… ఇదెక్కడి విచిత్రమైన కథరా బాబూ