The Social Reckoning on OTT: మనం రోజూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ పట్టుకుని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అయితే ఆ సోషల్ మీడియా వెనుక ఉండే బడా కంపెనీలు కేవలం తమ లాభాల కోసం సామాన్య ప్రజల మెదళ్లతో ఎలా ఆడుకుంటాయో, యువత జీవితాలను ఎలా ప్రమాదంలోకి నెడుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించే సంచలన సినిమా ‘ది సోషల్ రెకనింగ్’ (The Social Reckoning) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. 2010లో వచ్చి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ది సోషల్ నెట్‌వర్క్’ సినిమాకు Spiritual Sequelగా ఆస్కార్ విజేత ఆరోన్ సోర్కిన్ స్వయంగా రాసి డైరెక్ట్ చేసిన చిత్రమిది. ఇందులో ఆస్కార్ విజేత మైకీ మాడిసన్ ‘ది బేర్’ ఫేమ్ జెరెమీ అలెన్ వైట్, మార్క్ జుకర్‌బర్గ్ పాత్రలో జెరెమీ స్ట్రాంగ్ మెయిన్ రోల్స్ చేశారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఫేస్‌బుక్ ఫైల్స్’ లీక్ రియల్ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా, అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజై ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేస్తోంది. ఒక మాజీ ఉద్యోగిని ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీని ఎలా వణికించిందో ఇప్పుడు చూద్దాం.
ఫేస్‌బుక్ సంస్థలో సివిక్ ఇంటిగ్రిటీ టీమ్‌లో పనిచేసే ఫ్రాన్సిస్ హౌగెన్ అనే ఒక యంగ్ డేటా ఇంజనీర్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, జనాల మానసిక ఆరోగ్యం, భద్రత కంటే యాజమాన్యం కేవలం డబ్బులకు, అల్గారిథమ్ ఎంగేజ్‌మెంట్‌కే విలువ ఇస్తోందనే చేదు నిజం ఫ్రాన్సిస్‌కు అర్థమవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కంపెనీ పెద్దలు పట్టించుకోకపోవడంతో, లోపల జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ఆ సంస్థకు చెందిన వేలాది ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ను సీక్రెట్‌గా కాపీ చేసి ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది.
ఆ తర్వాత ఆ రహస్య పత్రాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ జెఫ్ హోర్విట్జ్ సాయం తీసుకుంటుంది. ఒకవైపు ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజం నుంచి ఎదురయ్యే లీగల్ కేసులు, మరోవైపు తమ ప్రాణాలకు ఉన్న రిస్క్‌ను కూడా లెక్కచేయకుండా వీళ్లిద్దరూ కలిసి సాగించిన ఆ సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగింది? ‘ఫేస్‌బుక్ ఫైల్స్’ పేరుతో బయటపడ్డ ఆ కథనాలు అమెరికా పార్లమెంట్ వరకు వెళ్లి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయి? అనేది ఊపిరి బిగబట్టి చూసేలా తీశారు.
‘ది సోషల్ రెకనింగ్’ (The Social Reckoning) లీగల్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ప్రైమ్ వీడియో స్టోర్‌లో రెంటల్ , పర్చేజ్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 52 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. రియల్ సంఘటనల ఆధారంగా వచ్చే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను ఇష్టపడే వాళ్లకు ఇదొక మస్ట్-వాచ్ మూవీ.
Read Also: మనుషులతో వికృత ప్రయోగాలు… ఓటీటీలోకి వచ్చేసిన ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్