OTT Movie : హాలీవుడ్ సినిమాలు వింత వింత స్టోరీలతో తెరకెక్కుతుంటాయి. ఊహించడమే కష్టంగా ఉండే కథలతో ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంటారు ఈ ఇంగ్షీషు డైరెక్టర్స్. అందుకే హాలీవుడ్ సినిమాలంటే తెగ ఇష్టపడుతుంటారు కొంతమంది. అందులోనూ సైకో కిల్లర్ సినిమాలంటే చెవికోసుకునే వారి సంఖ్య గట్టిగానే ఉంది. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ చిత్రం ఐరిస్ (కెల్సీ ఆస్బిల్) అనే ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన చిన్న కొడుకు మాటియో ఒక హైకింగ్ ప్రమాదంలో మరణించడంతో తీవ్రమైన దు:ఖంలో మునిగి ఉంటుంది. కొడుకు చనిపోయిన స్థలంలో ఉన్న మెమోరియల్‌ను సందర్శించేందుకు కాలిఫోర్నియా స్టేట్ పార్క్‌కు వెళుతుంది. అక్కడ ఆమె ఆత్మహత్య గురించి ఆలోచిస్తుంది. చద్దామని కొండ అంచున నిలబడిన ఆమెను రిచర్డ్ (ఫిన్ విట్‌రాక్) అనే అపరిచితుడు కలుస్తాడు. అతను తనకు సంబంధించిన ఒక విషాదకరమైన గతం గురించి చెప్తాడు. తన స్నేహితురాలు క్లోయ్ ఒక కారు ప్రమాదంలో మరణించిన కథ చెప్పి, ఐరిస్ ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతాడు. ఐరిస్ అతని మాటలతో సూసైడ్ ఆలోచనను పక్కన పెట్టి, అతనితో కలిసి హైకింగ్ ట్రయిల్‌లో నడవడానికి అంగీకరిస్తుంది.
అయితే రిచర్డ్ ఒక సీరియల్ కిల్లర్ అని త్వరలోనే హీరోయిన్ తెలుసుకుంటుంది. అతను ఐరిస్‌ను టేసర్‌తో దాడి చేసి, ఆమె చేతులు, కాళ్లను జిప్ టైస్‌తో కట్టి, ఆమెకు 20 నిమిషాల్లో పూర్తి శరీర పక్షవాతం కలిగించే పారలిటిక్ డ్రగ్‌ను ఇంజెక్ట్ చేస్తాడు. ఈ డ్రగ్ ఆమె శరీరాన్ని క్రమంగా కదలకుండా చేస్తుంది. మొదట ఆమె వేళ్ల నుండి పక్షవాతం మొదలై, తర్వాత పూర్తిగా కదలలేని స్థితికి చేరుకుంటుంది. కేవలం కనురెప్పలు ఆడించగలుగుతుంది. ఈ భయంకరమైన పరిస్థితిలో ఐరిస్ తన ప్రాణాల కోసం పోరాడుతుంది. ఒకానొక సమయంలో ఐరిస్ అడవిలోకి పారిపోతుంది. కానీ డ్రగ్ ప్రభావంతో ఆమె కదలలేకపోతుంది. ఆమె ఒక నదిలోకి దూకి, కిందికి తేలుతూ వృద్ధుడు బిల్ (మొరే ట్రెడ్‌వెల్) ఇంటి సమీపంలో చేరుకుంటుంది. బిల్ ఆమెను కనుగొని, ఆమె కనురెప్పల ద్వారా కమ్యూనికేట్ చేస్తూ 911కి కాల్ చేస్తాడు. అయితే రిచర్డ్ అక్కడికి చేరుకుని, బిల్‌ను చంపి, ఇంటిని తగలబెడుతాడు.
ఐరిస్ తన శక్తిని ఉపయోగించి విండో బ్లైండ్స్‌ను లాగి, రిచర్డ్‌కు తన ఉనికిని తెలియజేస్తుంది. దీనితో అతను ఆమెను మళ్లీ పట్టుకుంటాడు. రిచర్డ్ ఐరిస్‌ను ఒక చిన్న బోట్‌లో ఒక సరస్సు మధ్యకు తీసుకెళ్లి, ఆమెను ముంచి చంపాలని ప్లాన్ చేస్తాడు. ఈ సమయంలో రిచర్డ్ తన గతం గురించి వెల్లడిస్తాడు. అసలు అతని గతం ఏంటి? ఆల్రెడీ చచ్చిపోదాం అని వెళ్ళిన అమ్మాయిని ఆపి, టార్చర్ చేసి ఎందుకు చంపుతున్నాడు? హీరోయిన్ చివరకు తప్పించుకుందా లేదా? అనే విషయాలను సినిమాను చూసే తెలుసుకోవాలి.
Read Also : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో 2024 అక్టోబర్ 25న విడుదలైన అమెరికన్ థ్రిల్లర్ చిత్రం’ Don’t Move’. ఆడమ్ షిండ్లర్, బ్రియాన్ నెట్టో దర్శకత్వంలో, సామ్ రైమీ నిర్మాణంలో రూపొందింది ఈ సినిమా. ఈ చిత్రంలో కెల్సీ ఆస్బిల్ (ఐరిస్), ఫిన్ విట్‌రాక్ (రిచర్డ్) ప్రధాన పాత్రల్లో నటించారు.