Bengali Fantasy Comedy on OTT: ఇటీవల ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్టులతో ఫాంటసీ కామెడీ సినిమాలు వస్తున్నాయి. వీటికి ఆడియన్స్ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ప్రేమ, కుటుంబ అనుబంధాలకు కాస్త ఫాంటసీని జోడించి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. అమ్మాయిల మనసులో ఏమనుకుంటున్నారో వినగలిగే శక్తి ఓ యువకుడికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. ప్రేక్షకులు ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఈ బెంగాలీ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘నారి చరిత్రో బెజాయ్ జోటిల్’ (Nari Choritro Bejay Jotil). అంకుష్ హజ్రా, ఒయింద్రిలా సేన్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించగా, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ మూవీ కథేంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు? తెలుసుకుందాం పదండి.
ఝోంటు (అంకుష్ హజ్రా) ఓ ఈవెంట్ ప్లానర్. తన చుట్టూ ఉండే మహిళల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అతడికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా తల్లి, చెల్లి, నానమ్మతో పాటు తనకు ఇష్టమైన అమ్మాయి ఆంఖి (ఒయింద్రిలా సేన్) మనసులో ఏముందో తెలుసుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. ఆడవాళ్ల ఆలోచనలను అర్థం చేసుకోవడం తన వల్ల కాదని అనుకునే ఝోంటు జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంటుంది. ఓ పండుగ సందర్భంగా అనుకోకుండా అతడికి మహిళల మనసులోని ఆలోచనలను వినగలిగే వింత శక్తి వస్తుంది. మొదట్లో ఈ శక్తి తనకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తాడు. తనకు నచ్చిన అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవచ్చని, చుట్టూ ఉన్న మహిళలతో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సంబరపడతాడు. కానీ కొద్దిరోజులకే అసలు సమస్య మొదలవుతుంది.
తన చుట్టూ ఉన్న మహిళలు బయటకు చెప్పని బాధలు, కోరికలు, భావోద్వేగాలు అతడికి వినిపించడం మొదలవుతుంది. దీంతో ఇప్పటివరకు వారిని అర్థం చేసుకోకుండా తాను చేసిన పొరపాట్లు అతడికి తెలుస్తాయి. ఈ శక్తిని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనుకున్న ఝోంటుకు ఒక్కో సందర్భంలో ఊహించని చిక్కులు ఎదురవుతాయి. మరి ఈ వింత శక్తిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? ఆంఖితో తన ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? మహిళల మనసును చదవడం కంటే వారి భావాలను అర్థం చేసుకోవడమే ముఖ్యమని అతడు ఎలా తెలుసుకున్నాడు? అనేదే మిగతా కథ. నవ్వులతో పాటు మంచి సందేశాన్ని అందించే ఫాంటసీ కామెడీగా ఈ సినిమా రూపొందింది.
‘నారి చరిత్రో బెజాయ్ జోటిల్’ సినిమాలో ఝోంటుగా అంకుష్ హజ్రా, ఆంఖిగా ఒయింద్రిలా సేన్ నటించారు. సోహిని సేన్‌గుప్తా, సోహాగ్ సేన్, ఇప్సితా ముఖర్జీ, దేవరాజ్ భట్టాచార్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సుమీత్ గొరాడియా, సాహిల్ గొరాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. జూలై 10 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఒరిజినల్ బెంగాలీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు.
Read Also: బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్