Emotional Indie Drama: అమ్మకు క్యాన్సర్… మరోవైపు తన కాళ్లపై తాను నిలబడటం కూడా నేర్చుకోని కూతురు. తల్లి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుంటే… ఇక తన తర్వాత కూతురి పరిస్థితి ఏంటి అనే భయం మొదలైతే? ప్రపంచం వింతగా చూస్తున్న ఓ ఆటలోనే తనకు కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటే? ఎగతాళి చేసిన వాళ్ల ముందే తన ప్రతిభను నిరూపించుకోవాలని ఓ అమ్మాయి పట్టుదలగా నిలబడితే? కన్నీళ్లు తెప్పిస్తూనే, మనసును హత్తుకునే హార్ట్‌వార్మింగ్ ఇండీ డ్రామా ‘హార్స్‌గర్ల్స్’ (Horsegirls 2026). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చు? తెలుగులో ఉందా లేదా ? తెలుసుకుందాం పదండి.
మార్గరీటా (లిలియన్ క్యారియర్) 22 ఏళ్ల యువతి. ఆమెకు ఆటిజం ఉంటుంది. ప్రపంచాన్ని చూసే విధానం ఇతరులకంటే కాస్త భిన్నంగా ఉంటుంది. మనసులో ఉన్నది దాచుకోవడం ఆమెకు తెలియదు. ఏదైనా అనిపిస్తే అదే ముక్కుసూటిగా చెప్పేస్తుంది. తనదైన ఊహాలోకంలో, తనకు నచ్చిన విషయాల్లో మునిగిపోతూ ఉండే మార్గరీటా… తల్లి శాండీ (గ్రెట్చెన్ మోల్)తో కలిసి జీవిస్తుంటుంది.
మార్గరీటా జీవితంలో తల్లి పాత్ర చాలా పెద్దది. ఆమెకు ఏం కావాలో అర్థం చేసుకోవడం నుంచి… రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వరకు శాండీ ఎప్పుడూ కూతురికి అండగా ఉంటుంది. కానీ ఒకరోజు ఆ కుటుంబాన్ని కుదిపేసే వార్త వస్తుంది. శాండీకి క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. కీమోథెరపీ మొదలవుతుంది. తల్లి ఆరోగ్యం గురించి మార్గరీటా ఆందోళన పడుతుంది. కానీ శాండీ మనసులో మాత్రం మరో భయం మొదలవుతుంది. తాను లేకపోతే మార్గరీటా తన జీవితాన్ని తాను చూసుకోగలదా? ఒంటరిగా బయట ప్రపంచాన్ని ఎదుర్కోగలదా? అనే ఆలోచన ఆమెను వెంటాడుతుంది.
అందుకే మార్గరీటాను కాస్త స్వతంత్రంగా మార్చాలని శాండీ ప్రయత్నిస్తుంది. ఏదైనా ఉద్యోగం చేయాలని చెబుతుంది. తనకు నచ్చకపోయినా మార్గరీటా ఓ హాలోవీన్ స్టోర్‌లో ఉద్యోగంలో చేరుతుంది. కానీ అక్కడి వాతావరణం, మనుషులతో కలవడం, పని చేసే విధానం… అన్నీ ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తాయి. కొద్దిరోజులకే ఆ ఉద్యోగం ఆమెకు సరిపోదని అర్థమవుతుంది.
అప్పుడే మార్గరీటా జీవితంలోకి ఓ వింతైన ఆసక్తి వస్తుంది. అదే హాబీ-హార్సింగ్. నిజమైన గుర్రం లేకుండా… గుర్రం తలతో ఉన్న ఓ కర్ర బొమ్మను పట్టుకుని, దానితో పాటు పరుగెత్తుతూ, జంప్ చేస్తూ, గుర్రపు స్వారీలా ప్రదర్శన చేయడం ఈ క్రీడ ప్రత్యేకత. మొదటిసారి చూసినప్పుడు ఇది మార్గరీటాకు కూడా కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ క్రమంగా ఆ బొమ్మ గుర్రంతో ఆమెకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. మిగతా ప్రపంచం తనను అర్థం చేసుకోకపోయినా… ఈ ఆటలో మాత్రం తనను తాను పూర్తిగా వ్యక్తపరచుకోగలుగుతుంది.
చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఆమెను చూసి నవ్వుతారు. పెద్దవాళ్లు ఆడే ఆట కాదని ఎగతాళి చేస్తారు. కానీ మార్గరీటా మాత్రం వాటిని పట్టించుకోదు. తనకు నచ్చిన పని చేస్తున్నాననే ఆనందం ఆమెకు ఉంటుంది. అంతేకాదు… తాను కేవలం హాబీగా కాకుండా నిజమైన పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంటుంది. అక్కడి నుంచి ఆమె జీవితంలో కొత్త మార్పులు మొదలవుతాయి. ప్రాక్టీస్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇతరులతో కలిసి పని చేయడం… ఇవన్నీ మార్గరీటాకు నెమ్మదిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఒక కోచ్ కూడా ఆమె ప్రతిభను గుర్తించి శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తాడు.
ఇంతకాలం తల్లి తనను చూసుకోవాల్సి వచ్చిందనే భావనతో ఉన్న మార్గరీటా… ఇప్పుడు తానే ఏదో సాధించగలనని నమ్మడం మొదలుపెడుతుంది. తన తల్లికి కూడా తాను ఎప్పటికీ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని చూపించాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్రయాణం అంత సులభంగా సాగదు. ప్రాక్టీస్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, పోటీ ప్రపంచంలోని ఒత్తిడి, ఇతరుల మాటలు… ఒక్కోసారి ఆమెను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాయి. అయినా మార్గరీటా మాత్రం తన లక్ష్యాన్ని వదులుకోదు.
మరోవైపు శాండీ ఆరోగ్యం కూడా ఆమెను ఆందోళనకు గురిచేస్తూనే ఉంటుంది. తల్లి అనారోగ్యం, తన భవిష్యత్తు, పోటీలో గెలవాలనే కోరిక… ఇవన్నీ ఒకేసారి మార్గరీటా జీవితంలో భాగమవుతాయి. కానీ ఈ ప్రయాణంలో ఆమెకు ఓ విషయం అర్థమవుతుంది. స్వతంత్రంగా జీవించడం అంటే అన్నింటినీ ఒంటరిగా చేయడం కాదు… తనకు అండగా నిలిచే మనుషులను గుర్తించి, తన ప్రపంచాన్ని తానే నిర్మించుకోవడం కూడా.
చివరకు మార్గరీటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హాబీ-హార్సింగ్ పోటీకి సమయం వస్తుంది. ఇంతకాలం తనను వింతగా చూసిన వాళ్ల మధ్యే ఆమె తన ప్రతిభను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఒక్క ప్రదర్శన ఆమెకు కేవలం ఓ పోటీ కాదు… తన మీద తనకున్న నమ్మకాన్ని నిరూపించుకునే అవకాశం. మరి మార్గరీటా ఆ పోటీలో ఏం చేసింది? తన తల్లికి తాను ఒంటరిగానైనా జీవితాన్ని ఎదుర్కోగలనని నిరూపించగలిగిందా? శాండీ ఆరోగ్యం ఎలాంటి మలుపు తీసుకుంది? హాబీ-హార్సింగ్ మార్గరీటా జీవితాన్ని ఎంతవరకు మార్చింది? చివరకు ఆమెకు దొరికిన విజయం మెడల్ రూపంలో వచ్చిందా… లేక అంతకంటే విలువైన ఆత్మవిశ్వాసం రూపంలో వచ్చిందా? అనేదే ‘హార్స్‌గర్ల్స్’లో చూడాల్సిన అసలు స్టోరీ.
తల్లి అనారోగ్యం, ఆటిజంతో ఉన్న కూతురి స్వతంత్ర జీవితం, తనకు నచ్చిన ప్రపంచంలో ఓ అమ్మాయి సాధించిన ఆత్మవిశ్వాసం చుట్టూ సున్నితంగా సాగిపోయే ‘హార్స్‌గర్ల్స్’ మూవీలో లిలియన్ క్యారియర్ (Lillian Carrier), గ్రెట్చెన్ మోల్ (Gretchen Mol), జెరోడ్ హేన్స్ (Jerrod Haynes) తదితరులు నటించారు. హాబీ-హార్సింగ్ అనే ప్రత్యేకమైన క్రీడను కథలో ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లేదా తెలుగు సబ్‌టైటిల్స్ మాత్రం లేవు.
Read Also: అల్జీమర్స్‌తో బాధపడే వృద్ధుడు… అతన్ని చూసుకునే మహిళకు వచ్చిన కష్టం చూస్తే గుండె బరువెక్కాల్సిందే