Emotional Spanish Drama: ఒక అమ్మాయి తన కన్నవారి గురించి తెలుసుకోవడానికి చేసిన చిన్న ప్రయాణం… చివరికి ఆమె జీవితంలో దాచిన ఎన్నో నిజాలను బయటకు తీస్తే? చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన యువతికి, వాళ్ల గతం గురించి అసలు ఏమీ తెలియకపోతే? తండ్రి మరణానికి సంబంధించిన ఓ పత్రం కోసం వెతుకుతూ వెళ్లిన ఆమెకు… కుటుంబం ఏళ్లుగా దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడితే? చివరికి తన గతాన్ని అంగీకరించి, తన భవిష్యత్తును తానే ఎంచుకోగలిగిందా? ఇదే భావోద్వేగాలతో సాగే స్పానిష్ ఆటోబయోగ్రాఫికల్ డ్రామా ‘రొమేరియా’ (Romería). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనేది తెలుసుకుందాం పదండి.
కథ 2004లో జరుగుతుంది. 18 ఏళ్ల మెరీనా చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, మరో కుటుంబం వద్ద పెరుగుతుంది. ఫిల్మ్ స్కూల్‌లో చదవాలన్నది ఆమె కల. అందుకోసం స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాల్సి వస్తుంది. కానీ అందుకు తన బయోలాజికల్ తండ్రి డెత్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. దీంతో తల్లి డైరీలో ఉన్న వివరాలను పట్టుకుని స్పెయిన్‌లోని విగోకు బయలుదేరుతుంది.
అక్కడికి వెళ్లిన మెరీనా తన తండ్రి కుటుంబ సభ్యులను మొదటిసారి కలుస్తుంది. తనకు తెలియని మేనత్తలు, బాబాయ్‌లు, కజిన్స్‌తో పరిచయం ఏర్పడుతుంది. కానీ తండ్రి మరణం గురించి ఆమె ప్రశ్నలు అడగగానే వాళ్ల ప్రవర్తన మారిపోతుంది. ఏదో విషయాన్ని కావాలనే దాచిపెడుతున్నారనే అనుమానం మెరీనాకు కలుగుతుంది.
డెత్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్లిపోవడం కంటే అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. కజిన్స్‌తో సన్నిహితంగా ఉంటూ పాత జ్ఞాపకాలు, ఫొటోలు, కుటుంబ కథలను తెలుసుకుంటుంది. అలా ఒక్కొక్క విషయం బయటపడుతుండగా, తన తల్లిదండ్రులు తాను ఊహించుకున్నంత సాధారణమైన జీవితం గడపలేదని ఆమెకు తెలుస్తుంది.
వాళ్లు డ్రగ్స్‌కు బానిసలై, చాలా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడిపారని మెరీనా తెలుసుకుంటుంది. చివరకు తండ్రి మరణం కూడా ఆ సమస్యలతో ముడిపడి ఉందని, కుటుంబం సమాజానికి భయపడి ఆ నిజాన్ని దాచిందని అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మెరీనా తీవ్రంగా కలత చెందుతుంది. తన కన్నవారి మీద కోపం వస్తుంది. ఇన్నాళ్లూ తనకు నిజం ఎందుకు చెప్పలేదని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తుంది.
కానీ గతాన్ని తవ్వుతున్న కొద్దీ వాళ్ల తప్పులతో పాటు వాళ్లు ఎదుర్కొన్న బాధలు కూడా ఆమెకు అర్థమవుతాయి. తన తల్లిదండ్రులు పరిపూర్ణమైన మనుషులు కాకపోయినా, వాళ్ల కథ తన జీవితంలో ఒక భాగమేనని మెరీనా అంగీకరించడం మొదలు పెడుతుంది. చివరికి తన తండ్రికి సంబంధించిన పత్రాలను సంపాదించడంతో పాటు, తన కుటుంబం దాచిన నిజాలను కూడా తెలుసుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది కథ.
‘రొమేరియా’లో లూసియా గార్సియా ప్రధాన పాత్రలో నటించగా, ప్రముఖ స్పానిష్ దర్శకురాలు కార్లా సిమోన్ (Carla Simón) దర్శకత్వం వహించారు. ఆమె స్వీయ జీవిత అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Prime Video)లో రెంట్ కి అందుబాటులో ఉంది. సినిమా స్పానిష్ ఆడియోలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది.
Read Also: అడవిలో ఫ్రెండ్స్‌తో పార్టీ… చివరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి… క్లైమాక్స్ ట్విస్ట్ కేక