OTT Movie : ఒకప్పుడు అమ్మాయిల వయసు పది దాటగానే పెళ్లిళ్లు చేసేవారు. వాళ్ల జీవితాలు సమాజంలో చాలా కఠినంగా ఉండేవి. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీ ఇజ్రాయిల్ కంట్రీ ఏర్పడేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధ వాతావరణంలో, ఒక అమ్మాయి చదువుకోడానికి చేసే ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హిస్టారికల్ మూవీ పేరు’ఫర్హా, (Farha). 2021 లో వచ్చిన ఈ మూవీకి దరిన్ జె. సల్లామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 1948లో నక్బా సమయంలో, ఒక పాలస్తీనియన్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. నక్బా అనేది 1948లో ఇజ్రాయెల్ స్థాపన సమయంలో పాలస్తీనియన్లు తమ స్వదేశం నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన సంఘటనను సూచిస్తుంది. ఈ కథ దర్శకురాలు తన చిన్నతనంలో పెద్దలు చెప్పిన, ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
1948లో పాలస్తీనాలోని ఒక చిన్న గ్రామంలో ఈ స్టోరీ ప్రారంభమవుతుంది. 14 ఏళ్ల ఫర్హా అనే అమ్మాయి తన స్నేహితురాలు ఫరీదా లాగా, నగరంలో చదువుకోవాలని కలలు కంటుంది. ఆ సమయంలో ఆ గ్రామంలోని అమ్మాయిలు సాంప్రదాయకంగా పెళ్లి చేసుకోవడం లేదా నిశ్చితార్థం చేసుకోవడం సాధారణంగా జరుగుతూ ఉండేవి. కానీ ఫర్హాకు చదువు మీద ఆసక్తి ఉంటుంది. ఆమె తన తండ్రి అబూ ఫర్హా నుండి చదువుకోవడానికి, అనుమతి కోసం పట్టుబడుతుంది. కానీ అతను ఆమెకు పెళ్లి చేయాలని కోరుకుంటాడు. ఫర్హా మామ అబూ వాలిద్, ఆమె తండ్రిని చదువుకోవడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఒక రోజు ఆమె స్నేహితురాలి పెళ్లి వేడుక సమయంలో, అబూ ఫర్హా ఆమెకు నగరంలో చదువుకునే అవకాశం ఇస్తానని చెప్పి సంతోషపరుస్తాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవదు. అదే సమయంలో జియోనిస్ట్ సైనిక దళాలు గ్రామంపై దాడి చేస్తాయి. గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి పారిపోవాలని ఆదేశాలు వస్తాయి. అబూ ఫర్హా తన కుమార్తె ఫర్హా, ఫరీదాను కారులో ఎక్కించి గ్రామం నుండి తప్పించాలని అబూ ఫరీదాకు అప్పగిస్తాడు. ఫర్హా తన తండ్రిని వదిలి పోలేక,అతనితోనే ఉండాలని నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వస్తుంది.
ఆ ప్రాంతంలో దాడులు తీవ్రమవుతున్న సమయంలో, ఆమె భద్రత కోసం అబూ ఫర్హా ఆమెను ఇంట్లోని ఒక చిన్న గదిలో బంధించి తాళం వేస్తాడు. పరిస్తితి అదుపులో ఉన్నప్పుడు, తిరిగి వస్తానని చెప్పి బయటకు వెళ్తాడు. ఫర్హా ఆ గదిలో చిక్కుకుని, బయట జరుగుతున్న యుద్ధ శబ్దాలను వింటూ ఉంటుంది. ఒక చిన్న రంధ్రం ద్వారా బయటి ప్రపంచాన్ని చూస్తూ రోజుల తరబడి గడుపుతుంది. ఒక రోజు ఒక పాలస్తీనియన్ కుటుంబం ఆమె ఇంటి ఆవరణలోకి రాగా, అక్కడ ఉమ్ మొహమ్మద్ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అయితే జియోనిస్ట్ సైనికులు వచ్చి ఆ కుటుంబాన్ని కిరాతకంగా చంపేస్తారు. ఆ దృశ్యాన్ని ఫర్హా ఆ రంధ్రం ద్వారా చూస్తుంది.చివరకు ఫర్హా ఆ గదిలో నుంచి బయటపడుతుందా ? తన కళలు నెరవేర్చుకుంటుందా ? ఆమె తండ్రి తిరిగి వస్తాడా? ఈ విధయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.