Sci-Fi Short Film OTT : మనుషులు తమ జీవితాల్లో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను పై నుంచి ఎవరో చూస్తూ, వాటిపై కామెంట్ చేస్తూ, కావాలంటే ఒక్క క్షణంలో వాటిని మార్చగలిగితే ? ఇక్కడ దేవుడు మనం ఊహించేలా కనిపించడు. ఓ ప్లాట్‌ఫామ్ పై చిన్న బొమ్మల్లా కనిపించే మనుషులు, జంతువుల జీవితాలను చూస్తూ తన బట్లర్ తో కలిసి సరదాగా మాట్లాడుతుంటాడు. మానవ జీవితం, దేవుడి అధికారం, క్రూరమైన హాస్యాన్ని కలిపి తెరకెక్కించిన విచిత్రమైన సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్ ‘గాడ్ సెరెంగెటి’ (God Serengeti). మరి ఈ సినిమాలో మనకు కనెక్ట్ అయ్యేలా ఏముంది ? ఇంతకీ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
ఈ కథలో మనం చూసే ప్రపంచం సాధారణ భూమిలా ఉంటుంది. కానీ దాన్ని చూస్తున్న వ్యక్తి మాత్రం సాధారణ మనిషి కాదు. దేవుడు, తన బట్లర్ తో కలిసి ఓ వింత ప్లాట్‌ఫామ్ ముందు కూర్చుంటాడు. ఆ ప్లాట్‌ఫామ్‌పై చిన్న చిన్న మనుషులు, జంతువులు కనిపిస్తుంటాయి. దేవుడు వాళ్లను చూస్తూ వాళ్ల ప్రవర్తన గురించి బట్లర్ తో మాట్లాడుతుంటాడు. మనుషుల జీవితాల్లో జరిగే విషయాలు అతనికి ఓ గేమ్ లా, వినోదంలా అనిపిస్తాయి. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారు, ప్రకృతిలో ఏం జరుగుతోంది వంటి విషయాలను పై నుంచి గమనిస్తుంటాడు.
అతని చేతిలో ఉన్న శక్తి అందరూ ఊహించేదే. తనకు నచ్చినట్టుగా ఆ చిన్న ప్రపంచంలోని పరిస్థితులను మార్చగలడు. మనుషులు తమ జీవితాలను స్వతంత్రంగా నడుపుతున్నామని అనుకుంటున్నా, పై నుంచి చూస్తున్న వ్యక్తికి వాళ్ల జీవితాలు కేవలం ఓ చిన్న ప్రయోగంలా కనిపిస్తాయి. ఈ షార్ట్‌లో కథ కంటే ఆ కాన్సెప్ట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దేవుడు–మనిషి సంబంధాన్ని చాలా డార్క్ హ్యూమర్ తో చూపిస్తుంది. మనుషులు తమ జీవితాల్లో ఎదుర్కొనే బాధలు, పోరాటాలు, భయాలు వారికి ఎంత పెద్దవిగా అనిపించినా… వాటిని బయటి నుంచి చూస్తున్న శక్తికి అవి ఎంత చిన్నవిగా కనిపించవచ్చో సెటైరికల్ గా చూపించారు.
ఇప్పటిదాకా మనం చూసిన దేవుడి కథలా కాకుండా, మనుషుల జీవితాలను ఓ బోర్డ్ గేమ్ లా చూస్తూ వాటితో ఆడుకునే దేవుడిని ఇందులో చూడవచ్చు. అతని బట్లర్ మాత్రం అప్పుడప్పుడు ప్రేక్షకుడి తరఫున స్పందించే వ్యక్తిలా కనిపిస్తాడు. ఈ దేవుడు నిజంగా మనుషుల జీవితాలను నియంత్రిస్తున్నాడా ? వాళ్లకు స్వేచ్ఛ ఉందా లేక అంతా ఎవరో రాసిన గేమ్ లో భాగమేనా ? మనుషుల బాధలను దేవుడు వినోదంగా చూస్తే దాని అర్థం ఏంటి ? అనేది తెలుసుకోవాలంటే ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ ను చూడాల్సిందే.
‘గాడ్ సెరెంగెటి’ నీల బ్లోమ్‌క్యాంప్ రూపొందించిన Oats Studios యాంథాలజీలోని షార్ట్ ఎపిసోడ్. 2017లో విడుదలైన ఈ ఎపిసోడ్‌లో షార్ల్టో కోప్లీ (Sharlto Copley) గాడ్‌గా, జేసన్ కోప్ (Jason Cope) బట్లర్‌గా నటించారు. ఇది 2017లో Netflixలో Oats Studios కంటెంట్ లో భాగంగా వచ్చింది. YouTubeలో కూడా అందుబాటులో ఉంది. అయితే దీన్ని ప్రత్యేక ఫీచర్ ఫిల్మ్ అనడం కంటే షార్ట్-ఫార్మ్ సైన్స్ ఫిక్షన్ ఎపిసోడ్‌గా చెప్పుకోవచ్చు. కానీ తెలుగులో మాత్రం లేదు.