Hollywood Action Drama: ఎప్పుడూ పేదల కోసం పోరాడే హీరోగానే మనం చూసిన రాబిన్ హుడ్… నిజానికి అతని జీవితంలో చేసిన పాపాలన్నింటి నుంచి తప్పించుకోలేకపోతే ? వయసు మీద పడిన తర్వాత ఒంటరిగా అడవుల్లో బతుకుతున్న అతనికి, ఒక యుద్ధం ప్రాణాల మీదకు తెస్తే ? చావు అంచుల నుంచి బయటపడిన తర్వాత జీవితంలో తొలిసారి ప్రశాంతత దొరికిందనుకునే సమయంలో… అతని గతమే తిరిగి వచ్చి తలుపు తడితే ? తనను కాపాడిన వాళ్ల కోసం మరోసారి ఆయుధం పట్టాల్సి వస్తే ? ఇదే ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ డ్రామా ‘ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్’ (The Death of Robin Hood). మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఏ ఓటీటీలో తెలుగులో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
ఈ కథలో రాబిన్ హుడ్ (హ్యూ జాక్‌మన్) మనం ఇప్పటివరకు చూసిన ధైర్యవంతుడైన యువ హీరో కాదు. వయసు మీద పడిపోయిన వ్యక్తి. జీవితంలో ఎక్కువ భాగాన్ని దొంగతనాలు, హింస, హత్యలతో గడిపాడు. తాను చేసిన పనులు అప్పట్లో ఎంత అవసరమైనవైనా… ఇప్పుడు మాత్రం ఆ జ్ఞాపకాలు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక భయంకరమైన యుద్ధంలో రాబిన్ తీవ్రంగా గాయపడతాడు. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న అతన్ని అతని పాత స్నేహితుడు లిటిల్ జాన్ (బిల్ స్కార్స్‌గార్డ్) గుర్తించి రక్షిస్తాడు. చికిత్స కోసం అతన్ని ఓ పురాతన క్రైస్తవ ఆశ్రమానికి తీసుకెళ్తాడు.
అక్కడ రాబిన్ జీవితమే మారిపోయే పరిచయం జరుగుతుంది. సిస్టర్ బ్రిజిడ్ (జోడి కోమర్) అనే నన్ అతనికి చికిత్స చేస్తుంది. ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లల మధ్య కొంతకాలం గడపడంతో రాబిన్‌లో ఎన్నో ఏళ్ల తర్వాత మానవత్వం మళ్లీ మేల్కొంటుంది. ఇప్పటి వరకు తనకు తెలియని ప్రశాంతతను అతను అనుభవిస్తాడు. తాను చేసిన పాపాలకు ఇదే చివరి అవకాశం కావచ్చని రాబిన్ భావిస్తాడు. ఇక మిగిలిన జీవితాన్ని హింసకు దూరంగా గడపాలని అనుకుంటాడు. కానీ మనిషి గతం అంత సులభంగా వదిలిపెట్టదు.
రాబిన్ గతంలో చేసిన నేరాలకు సంబంధించిన ప్రతీకారాలు అతని దగ్గరకు చేరడం మొదలవుతుంది. అతను చంపిన వాళ్ల కుటుంబాలు, అతనిపై కోపంతో ఉన్న వ్యక్తులు అతని కోసం వెతుకుతుంటారు. అదే సమయంలో ఆర్థర్ (నోవా జూప్) అనే గాయపడిన యువకుడు ఆశ్రమానికి రావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది.
ఇప్పటికే వృద్ధుడైన రాబిన్ మళ్లీ పోరాడే శక్తి తనలో లేదని అనుకుంటాడు. కానీ తనను కాపాడిన సిస్టర్ బ్రిజిడ్, అమాయకమైన పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిసినప్పుడు వెనక్కి తగ్గలేడు. ఒకప్పుడు తన కోసం మాత్రమే కత్తి పట్టిన రాబిన్… ఇప్పుడు ఇతరుల ప్రాణాల కోసం చివరిసారి పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ చివరి పోరాటంలో అతను తన శత్రువులతోనే కాదు… తన గతంతో కూడా తలపడతాడు. తాను చేసిన తప్పులకు నిజంగా విముక్తి దొరుకుతుందా? జీవితాంతం హింసలో గడిపిన మనిషికి చివరి క్షణాల్లోనైనా మారే అవకాశం ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా ముగుస్తుంది.
‘ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్’ ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కూడా చూడొచ్చు. దాదాపు 2 గంటల 2 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ చిత్రానికి A Quiet Place Day One ఫేమ్ మైఖేల్ సార్నోస్కీ దర్శకత్వం వహించారు.
Read Also: 30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్