Film industry:ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ను కూడా మోసం చేసిన దర్శకుడు కార్ల్ ఎరిక్ రించ్ కథ చివరికి విషాదంగానే ముగిసింది. ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సిరీస్ తీస్తానని చెప్పి నెట్‌ఫ్లిక్స్ నుండి కోట్ల రూపాయల బడ్జెట్ లాగిన ఈ దర్శకుడు.. ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, క్రిప్టోకరెన్సీ కొంటూ జల్సాలు చేశాడు. ఈ భారీ మోసంపై కోర్టుకు వెళ్లిన నెట్‌ఫ్లిక్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. తాజాగా న్యాయస్థానం ఈ దర్శకుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించడంతో హాలీవుడ్‌లో ఈ మ్యాటర్ తీవ్ర సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. 2013లో వచ్చిన ’47 రోనిన్’ అనే సూపర్ హిట్ చిత్రంతో హాలీవుడ్‌లో డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన క్రేజ్ చూసి ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ను నిర్మించేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముందుకొచ్చింది. అందుకోసం భారీ మొత్తంలో నిధులను కేటాయించింది. అయితే, సినిమా తీయాల్సిన దర్శకుడు మాత్రం రూట్ మార్చి ఆ డబ్బుతో సొంత వ్యాపారాలు, జల్సాలు చేయడం మొదలుపెట్టాడు.
కార్ల్ ఎరిక్ రిన్స్చ్ నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన బడ్జెట్ నుండి దాదాపు 11 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 90 కోట్లకు పైగా డబ్బును తన అవసరాల కోసం దారి మళ్లించాడు. ఇక ఆ డబ్బుతో ఖరీదైన లగ్జరీ కార్లు, విలాసవంతమైన వస్తువులు కొనడమే కాకుండా, పెద్ద మొత్తంలో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. ఎంతకాలం ఎదురుచూసినా సిరీస్ పనులు ముందుకు సాగకపోవడంతో అనుమానం వచ్చిన నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం లీగల్‌గా కోర్టును ఆశ్రయించింది.
నిధుల దుర్వినియోగం కేసులో కోర్టు తీర్పు వెలువడింది. దీర్ఘకాల విచారణ తర్వాత ఆ డైరెక్టర్ చేసిన మోసం రుజువై, జైలు శిక్ష ఖరారైంది. కేసులో అన్ని ఆధారాలు బలంగా ఉండటంతో ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో కార్ల్ ఎరిక్ కు రెండున్నర సంవత్సరాల (30 నెలలు) జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇక దీనితో పాటు అదనంగా 700 డాలర్ల జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
also read:జైలర్ 2 రిలీజ్ డేట్ లాక్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్ అదుర్స్!
సాధారణంగా సినిమాల బడ్జెట్ విషయంలో చిన్న చిన్న వివాదాలు రావడం కామనే కానీ, ఇలా ఒక టాప్ ఓటీటీ సంస్థను నమ్మించి కోట్లు నొక్కేసి జైలు పాలవ్వడం హాలీవుడ్‌లో అరుదుగా జరుగుతుంటుంది. ఇక ఈ తీర్పుతో నెట్‌ఫ్లిక్స్‌కు కాస్త ఊరట లభించినట్లయింది. నిర్మాణ సంస్థలు, ఇన్వెస్టర్లను మోసం చేసే ప్రయత్నాలు చేసే వారికి ఈ తీర్పు స్ట్రాంగ్ వార్నింగ్‌గా పనిచేస్తుందని సినీ నిపుణులు అంటున్నారు.
టాలెంట్ ఉండి మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోకుండా.. ఇలా అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కితే ఎంతటి వారైనా కటాకటాల పాలు కావాల్సిందేనని ఈ ఘటన నిరూపించింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌ను బురిడీ కొట్టించి లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకున్న డైరెక్టర్ కార్ల్ రిన్ష్ గేమ్ చివరకు జైలు శిక్షతో ముగిసింది. మరి ఈ జైలు జీవితం తర్వాత ఆయన కెరీర్ మళ్లీ పుంజుకుంటుందో లేదో చూడాలి.