Yadagirigutta: స్వేచ్చ బ్యూరో: యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకాలు కాంగ్రెస్ పార్టీలో వివాదస్పదమయ్యాయి. బుధవారం ప్రకటించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ (యాదగిరిగుట్ట)నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇప్పుడు గాంధీభవన్ లో పాటు సోషల్ మీడియాలో నూ సర్క్యులేట్ అవుతుంది. తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా నియామకాలు చేపట్టారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకంగా టీపీసీసీతో పాటు న్యూఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఓ టీవీ ఛానల్ లైవ్ లోనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను సంప్రదించకుండా ప్రభుత్వం బోర్డు ఎలా వేస్తుంది? అంటూ ఆయన తప్పుపట్టారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై టీ పీసీసీ చీఫ్ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ బోర్డు నియామకాల్లో ప్రభుత్వం, పార్టీల మధ్య కనీస సమన్వయం లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నాయకులను కనీసం సంప్రదించకుండానే ప్రభుత్వం ఈ జాబితాను ఖరారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.దేవాలయాల వ్యవహారాలతో సంబంధం ఉండే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను సైతం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేదనే ప్రచారం జరుగుతుంది. స్వయంగా దేవాదయ శాఖ మంత్రిని భాగస్వామ్యం చేయలేనందునే ఈ వివాదం మరింత ముదిరిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.పైగా ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకటస్వామిని చేర్చడంపై కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇప్పటికే వారి కుటుంబంలో వివేక్ వెంకటస్వామికి కీలక పదవులు ఉండటం, ఆయన కొడుకు ఎంపీగా విజయం సాధించడం గమనార్హం. ఇలాంటి తరుణంలో మళ్లీ అదే కుటుంబానికి చెందిన వినోద్ వెంకటస్వామికి పవిత్రమైన యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించడం ఏంటని, పార్టీ కోసం కష్టపడిన ఇతర సీనియర్లను ఎందుకు విస్మరించారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also read: Function Zone: సామాన్యులకు గుడ్ న్యూస్.. 25 వేలకే నెక్లెస్ రోడ్డులో ఫంక్షన్ హల్..!
మరోవైపు ప్రముఖ నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖను బోర్డు మెంబర్‌గా నియమించడం రాజకీయంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌తో బలమైన సంబంధాలు ఉన్న ఆమెను తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయ బోర్డులో ఎలా నియమిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్థానికతను,తెలంగాణ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందంటూ కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు మాజీ బీఆర్ఎస్ ఎంపీ సోదరుడైన సత్యనారాయణ రెడ్డిని ఈ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన నాయకులను పక్కనబెట్టి, నిన్నగాక మొన్న పార్టీ మారిన వారికి, బీఆర్ఎస్ నేపథ్యం ఉన్నవారికి ఇలాంటి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏంటనే ఆవేదన పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. ఈ అంశంపై పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని సీనియర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Also read: Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు..!