Psychological Horror Thriller on OTT : చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో వింతగా అనిపించే ఓ ఒంటరి కుర్రాడు… ఓ రోజు ఓ అమ్మాయి పరిచయంతో ఓ విచిత్రమైన టీవీ షో చూడటం మొదలు పెడతాడు. కానీ ఆ టీవీ షో ఓ ప్రోగ్రామ్ మాత్రమే కాదు… తన అసలు జీవితానికి సంబంధించిన రహస్యాన్ని దాచుకున్న ప్రపంచమైతే ? తనకు తెలిసిన జీవితం మొత్తం ఓ అబద్ధమని తెలిస్తే ? అసలు తాను మనిషేనా ? లేక మరేదైనా ప్రపంచంలో బందీగా ఉన్నాడా ? ఇదే మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్ డ్రామా ‘ఐ సా ది టీవీ గ్లో’ కథ. మరి ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
1996లో అమెరికాలోని ఓ ప్రాంతంలో ఓవెన్ అనే ఇంట్రో వర్ట్ హైస్కూల్ విద్యార్థి జీవిస్తుంటాడు. స్కూల్‌లో పెద్దగా స్నేహితులు లేని ఓవెన్‌కు మ్యాడీ అనే సీనియర్ అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె ద్వారానే అతనికి ‘ది పింక్ ఒపాక్’ అనే లేట్-నైట్ హారర్ టీవీ షో పరిచయం అవుతుంది. ఆ షోలో ఇసాబెల్, తారా అనే ఇద్దరు అమ్మాయిలు అతీంద్రియ శక్తులతో రాక్షసులతో పోరాడుతుంటారు. మొదట సరదాగా చూసిన ఓవెన్, మ్యాడీ ఇద్దరికీ ఆ షో క్రమంగా ఓ వ్యసనంలా మారుతుంది. వీడియో టేపులు మార్చుకుంటూ, ఇంట్లో వాళ్లకు తెలియకుండా షోను చూస్తూ ఉంటారు.
కానీ మ్యాడీకి మాత్రం ఆ షోపై ఓ విచిత్రమైన నమ్మకం ఏర్పడుతుంది. తాము బతుకుతున్న ప్రపంచం కంటే, ‘ది పింక్ ఒపాక్’లో కనిపించే ప్రపంచమే నిజమైనదని భావించడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే ఒకరోజు మ్యాడీ అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. ఆమె గుర్తుగా మిగిలేది కాలిపోతున్న ఓ టీవీ సెట్ మాత్రమే. అదే సమయంలో ఆ టీవీ షో కూడా ఆగిపోతుంది. ఓవెన్ జీవితంలో మాత్రం ఆ సంఘటన ఓ చెరిగిపోని మిస్టరీగా మిగిలిపోతుంది.
కొన్నేళ్ల తర్వాత ఓవెన్ పెద్దవాడైపోతాడు. చూడడానికి సాధారణ జీవితమే గడుపుతున్నట్టు కనిపించినా, లోపల మాత్రం ఏదో శూన్యత వెంటాడుతూనే ఉంటుంది. ఇంతలో మ్యాడీ మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది. అప్పుడు ఆమె చెప్పే మాటలు ఓవెన్ ప్రపంచాన్నే తలకిందులు చేస్తాయి. తామిద్దరూ ఈ ప్రపంచానికి చెందిన సాధారణ మనుషులు కాదని, తాము నిజానికి ‘ది పింక్ ఒపాక్’లోని ఇసాబెల్, తారాలేనని మ్యాడీ చెబుతుంది. ఒక దుష్ట శక్తి తమను అసలు ప్రపంచం నుంచి వేరు చేసి, ఈ నకిలీ జీవితంలో బంధించిందని వివరిస్తుంది.
అసలు మ్యాడీ ఎలా ఈ ప్రపంచం నుంచి బయట పడింది ? ఓవెన్ కూడా ఆమె చెప్పిన నిజాన్ని నమ్మాడా ? ఈ నకిలీ జీవితాన్ని వదిలి తన అసలు ప్రపంచంలోకి వెళ్లడానికి అతను సిద్ధమయ్యాడా ? లేక భయంతో అదే జీవితంలో ఉండిపోయాడా ? అనేదే తెరపై చూసి తెలుసుకోవలసిన కథ.
Also Read : పాడుబడిన స్కూల్ లో పారానార్మల్ సీన్స్… సైకాలజిస్ట్‌కు ఎదురైన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ నిజం
జస్టిస్ స్మిత్, బ్రిగెట్ లుండి-పైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఐ సా ది టీవీ గ్లో’ మూవీని జేన్ స్కోన్‌బ్రూన్ తెరకెక్కించారు. 90ల నాటి టీవీ నోస్టాల్జియాను, సైకలాజికల్ హారర్‌ను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం భారతదేశంలో Apple TV Storeలో Rentకి అందుబాటులో ఉంది. తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, ఇంగ్లీష్ ఆడియో ఆప్షన్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో Netflix, Prime Videoలోనూ అందుబాటులో ఉంది. వింతైన కాన్సెప్ట్‌లు, మైండ్-బెండింగ్ కథలు, సైకలాజికల్ హారర్ ఇష్టపడేవారికి ఈ మూవీ మరిచిపోలేని ఎక్స్‌పీరియన్స్ అని చెప్పవచ్చు.