Japanese Mystery Drama: ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వింతగా ప్రవర్తిస్తుంటే.. దానికి కారణం టీచరేనని తల్లి అనుమానిస్తే.. ఆ స్కూల్‌లో అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నమే ‘Monster’ (2023) సినిమా. కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ గెలుచుకుని, గ్లోబల్ వైడ్‌గా క్లాసిక్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ జపనీస్ మిస్టరీ డ్రామాను చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. పేరెంట్స్ మాత్రం ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు. ప్రముఖ దర్శకుడు హిరోకాజు కొరే-ఎడా తెరకెక్కించిన ఈ సినిమాలో అంతగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి? ఏ ఓటీటీలో చూడచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సావోరి అనే ఒక తల్లి తన కొడుకు మినాటోతో కలిసి జీవిస్తుంటుంది. భర్త చనిపోయిన తర్వాత కొడుకే లోకంగా బతుకుతున్న ఆమెకు.. మినాటో ప్రవర్తనలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తాయి. అతను సరిగ్గా మాట్లాడకపోవడం, వింతగా ప్రవర్తించడం, శరీరంపై గాయాలతో ఇంటికి రావడం చూసి ఏమైందని ఆరా తీస్తుంది. అప్పుడు తన స్కూల్‌లోని టీచర్ హోరి తనను ఇబ్బంది పెడుతున్నాడని మినాటో చెప్పడంతో సావోరి ఆగ్రహానికి గురవుతుంది. వెంటనే స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీస్తుంది. తన కొడుకుకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అయితే స్కూల్ యాజమాన్యం స్పందిస్తున్న తీరు, టీచర్ హోరి చెప్పే విషయాలు సావోరికి మరింత అనుమానాలను కలిగిస్తాయి. ఇక్కడి నుంచే కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో దర్శకుడు ఒకే సంఘటనను మూడు విభిన్న కోణాల్లో చూపిస్తాడు. మొదట తల్లి సావోరి చూసిన ప్రపంచం, ఆ తర్వాత టీచర్ హోరి అనుభవం, చివరగా పిల్లలు మినాటో, యోరి దృష్టిలో జరిగిన విషయాలను ఒక్కొక్కటిగా బయటపెడతాడు.
ప్రతి కోణంలోనూ మనకు కొత్త విషయాలు తెలుస్తుంటాయి. మొదట తప్పు చేశాడనుకున్న వ్యక్తి గురించి మన అభిప్రాయం మారుతుంది. ఒకరిపై మరొకరు చేసుకునే ఆరోపణలు, పిల్లల మనసుల్లో దాగి ఉన్న భావాలు, పెద్దలు అర్థం చేసుకోలేని పరిస్థితులు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. చివరికి అసలు మాన్స్టర్ ఎవరు? అనే ప్రశ్నకు సినిమా ఇచ్చే సమాధానం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ముఖ్యంగా చిన్నారుల మనస్తత్వాన్ని, సమాజం వారిని అర్థం చేసుకోవడంలో చేసే పొరపాట్లను దర్శకుడు ఎంతో సున్నితంగా చూపించాడు. ఇది కేవలం మిస్టరీ మూవీ మాత్రమే కాదు.. పిల్లలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే హృదయానికి హత్తుకునే చిత్రం.
ఈ సినిమాలో సావోరి పాత్రలో సకురా ఆండో, టీచర్ హోరి పాత్రలో ఈటా నాగయామా, మినాటోగా సోయా కురోకావా, యోరిగా హినాటా హిరాగి నటించారు. 2023 జూన్ 2న జపాన్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నిడివి 126 నిమిషాలు. ప్రస్తుతం Amazon Prime Videoలో జపనీస్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఇది అందుబాటులో ఉంది.
Read Also: 70s మైసూర్ వైబ్స్… అటు ట్రెడిషన్స్ ఇటు లవ్… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ