Crime Investigation Thriller: ఎమ్మెల్యే మిస్సింగ్… పోలీసులు 48 గంటలు వెతికినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ చివరకు ఈ కేసును సాల్వ్ చేయడానికి పోలీసులు ఆశ్రయించింది పోలీస్ ఆఫీసర్‌ను కాదు… ఓ కేబుల్ ఆపరేటర్‌ను. కాలనీలోని ఏ ఇంట్లోకైనా అనుమానం రాకుండా వెళ్లగలిగే అతని వింత టాలెంటే ఇప్పుడు ఈ మిస్టరీని ఛేదించే ఆయుధంగా మారుతుంది. అయితే అతను ఒక్కో ఇంటి రహస్యాన్ని బయటకు తీస్తున్న కొద్దీ… ఎమ్మెల్యే కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కుట్ర మరింత భయంకరంగా బయట పడుతుంది. మరి ఆ కేబుల్ ఆపరేటర్ ఎవరు? అతనికి అంత సమాచారం ఎలా తెలుసు? ఎమ్మెల్యేను ఎవరు కిడ్నాప్ చేశారు? అనే ఆసక్తికరమైన కథతో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘జంపర్’ (Johnny Jumper 2026). మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కథ మొదట్లోనే మంచి రాజకీయ పలుకుబడి ఉన్న ఓ ఎమ్మెల్యే అనూహ్యంగా కిడ్నాప్‌కు గురవుతాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. కిడ్నాపర్లను పట్టుకోవడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ గంటలు గడుస్తున్నా ఒక్క ఆధారం కూడా దొరకదు. చివరకు 48 గంటలు పూర్తయినా కేసు ఎక్కడ మొదలైందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలాంటి సమయంలో పోలీసులకు గుర్తొచ్చేది జోని. అందరూ అతన్ని జంపర్ అని పిలుస్తుంటారు. అతను ఒక కేబుల్ ఆపరేటర్. కానీ అతని పని కారణంగా కాలనీలోని దాదాపు ప్రతి ఇంట్లోకి సులభంగా వెళ్లగలడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లలోకి ప్రవేశించడం, అక్కడ జరిగే విషయాలను గమనించడం, మనుషుల గురించి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం అతనికి అలవాటు.
పోలీసులు జంపర్‌ను తమ ఇన్ఫార్మర్‌గా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటారు. అప్పటి నుంచి అసలు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. కాలనీలోని ప్రతి ఇంటిని, అక్కడి మనుషులను, వారి రహస్య సంబంధాలను జంపర్ తనదైన పద్ధతిలో పరిశీలిస్తుంటాడు. మొదట చిన్న చిన్న క్లూలుగా కనిపించిన విషయాలు క్రమంగా ఎమ్మెల్యే కిడ్నాప్ కేసుతో లింక్ అవుతున్నాయని అతనికి అర్థమవుతుంది.
అయితే ఇది కిడ్నాప్ మాత్రమే కాదని జంపర్ గుర్తించే కొద్దీ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత రహస్యాలు, ద్రోహాలు, కనిపించని వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. పోలీసులు అధికారికంగా దర్యాప్తు చేస్తుంటే… జంపర్ మాత్రం ఎవరికీ తెలియకుండా మరో కోణంలో అసలు నేరస్థుడి కోసం వేట మొదలుపెడతాడు. చివరకు పోలీసులు కూడా గుర్తించలేని కిడ్నాపర్‌ను జంపర్ ఎలా పట్టుకున్నాడు? అతని సీక్రెట్ టాలెంట్ ఈ కేసులో ఎంత కీలకంగా మారింది? అనేదే మిగిలిన కథ.
విజయ్ రాజ్, తనుజ్ విర్వాణి, జకీర్ హుస్సేన్, ఖనక్ బుధిరాజా, బ్రిజేంద్ర కాలా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సౌరభ్ వర్మ దర్శకత్వం వహించారు. కేవలం 1 గంట 44 నిమిషాల రన్‌టైమ్‌తో సాగే ఈ సినిమాను JioHotstarలో హిందీతో పాటు తెలుగు డబ్బింగ్‌లోనూ చూడవచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌కు భిన్నంగా ఓ కేబుల్ ఆపరేటర్‌కు ఉన్న పరిచయాలు, పరిశీలనా శక్తితో క్రైమ్‌ను ఛేదించే కాన్సెప్ట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. క్రైమ్ మిస్టరీలు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు.
Read Also: పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ