Zombie Movie OTT : ఒక్కసారిగా ఫోన్ సిగ్నల్ కట్ అయిపోతే మీ ఫీలింగ్ ఏంటి? ఉదయం వరకు సైలెంట్‌గా కనిపించిన నగరం, కొన్ని గంటల్లోనే పూర్తిగా మారిపోతే మీకేం అనిపిస్తుంది ? అదే సమయంలో టీవీలు వర్క్ చేయడం ఆగిపోతాయి. ఫోన్ కాల్స్ రావు.. బయట నుంచి అరుపులు మాత్రమే వినిపిస్తాయి. కిటికీ తీయగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న మనుషులు కనిపిస్తారు. ఏం జరుగుతుందో అర్థం కాక ముందే మొత్తం నగరం గందరగోళంలో పడిపోతుంది. బయట అడుగు పెట్టడం కూడా ప్రమాదంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంట్ లో ఒంటరిగా చిక్కుకుపోయిన యువకుడి కథే అలైవ్ (Alive). మొదటి సీన్ నుంచే ఉత్కంఠను పెంచుతూ, చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే విధంగా ఈ సినిమా సాగుతుంది.
సినిమాను ఎందులో చూడాలి?
2020లో విడుదలైన ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి చో ఇల్ హ్యూంగ్ దర్శకత్వం వహించారు. యూ ఆహ్ ఇన్, పార్క్ షిన్ హ్యే ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద స్థాయి యాక్షన్ కంటే, ఒక మనిషి ఒంటరిగా చిక్కుకుపోయినప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా మారుతుందో చూపించడం ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు.
గూస్‌బంప్స్ స్టోరీ
ఒక యువకుడు ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సాధారణంగా తన రోజు గడుపుతుంటాడు. అదే సమయంలో బయట ఒక్కసారిగా విచిత్ర పరిస్థితులు మొదలవుతాయి. మనుషులు హింసాత్మకంగా మారి ఎదురుగా కనిపించిన వారిపై దాడి చేయడం ప్రారంభిస్తారు. కొద్దిసేపట్లోనే మొత్తం ప్రాంతం గందరగోళంగా మారిపోతుంది. ఈ పరిస్థితిలో అతను తన అపార్ట్మెంట్‌లోనే చిక్కుకుపోతాడు. బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఫోన్ నెట్ వర్క్ పనిచేయదు. ఇంటర్నెట్ కూడా నిలిచిపోతుంది. రోజులు గడిచేకొద్దీ ఇంట్లో ఆహారం, నీళ్లు తగ్గిపోతాయి. ఒంటరిగా ఉండటం వల్ల అతను మానసికంగా కుంగిపోవడం మొదలవుతుంది.
Also read : రాత్రైతే ఊరిని వల్లకాడు చేసే వింత పిశాచాలు… ఒంటరిగా చూడకూడని హర్రర్ సిరీస్
ఒక రోజు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో మరో యువతి కూడా భతికే ఉందని అతనికి తెలుస్తుంది. అక్కడి నుంచి కథలో కొత్త మలుపు వస్తుంది. ఇద్దరూ దూరం నుంచే ఒకరికి ఒకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. బయట పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్నా, బతకాలనే ఆశతో ముందుకు సాగుతారు. కానీ అపార్ట్మెంట్ చుట్టూ తిరిగే జాంబీలు క్రమంగా లోపలికి రావడం మొదల పెడతారు. ప్రతి క్షణం ప్రమాదంగా మారుతుంది. చివరికి అక్కడి నుంచి బయట పడటానికి వారు చేసే ప్రయత్నం కథను క్లైమాక్స్ కు తీసుకెళ్తుంది. సాధారణ కాన్సెప్ట్‌తో మొదలై, చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా నిలుస్తుంది.