Kompally DE: విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ మున్సిపల్ అధికారి మద్యం మత్తులో దాబా వద్ద హంగామా సృష్టించిన ఘటనలో సస్పెన్షన్‌కు గురయ్యారు. కొంపల్లి సర్కిల్ శానిటేషన్ డిప్యూటీ ఇంజినీర్ (డీఈ) తిరుపతిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన సస్పెండ్ చేశారు.
గత నెల 27న అర్ధరాత్రి కొంపల్లిలోని ఫ్రెండ్లీ దాబాకు డీఈ తిరుపతితో పాటు పర్యావరణ విభాగానికి చెందిన మరో అధికారి వెళ్లారు. ఈ క్రమంలో ఆహారం విషయంలో తలెత్తిన వివాదం వాగ్వాదానికి దారితీసింది. దాబా నిర్వాహకుడి కుమారుడు జోక్యం చేసుకోగా, అతడిని దుర్భాషలాడటంతో పాటు దాబాను మూసివేయిస్తామంటూ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై అందిన ఫిర్యాదుల మేరకు సీఎంసీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. నివేదికను పరిశీలించిన కమిషనర్ జి.సృజన శుక్రవారం డీఈ తిరుపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ఈ ఘటన స్పష్టం చేసింది.
Also read: కటకటాల వెనుక అక్షర వెలుగులు.. ఖైదీల విద్యా హక్కుపై తెలంగాణ సంచలనం!