Korean Romantic Drama: పదేళ్లుగా కలిసి ఉన్న ప్రేమికులు… పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న సమయంలోనే తనకు గతంలోలా ప్రేమ భావన కలగడం లేదని ప్రియుడు చెప్తాడు. అదే సమయంలో ఇద్దరి జీవితాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే… పాత ప్రేమను వదిలేసి కొత్త జీవితాన్ని ఎంచుకోగలరా ? లేక పదేళ్ల జ్ఞాపకాలు మళ్లీ వాళ్లను ఒక్కటి చేస్తాయా ? ప్రేమలోని మరో కోణాన్ని చూపించే రొమాంటిక్ మెలో డ్రామానే ‘ఎ లవ్ అదర్ దాన్ యువర్స్’ (A Love Other Than Yours). మరి కొరియన్ మూవీ లవర్స్ ఈ సిరీస్ ను తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం.
నమ్‌గుంగ్ హో, లీ మి-డో చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో గత పదేళ్లుగా ఇద్దరూ కలిసి ఉంటారు. హో కార్పొరేట్ ఉద్యోగిగా పని చేస్తుంటే… మి-డో ఫిలిం డైరెక్టర్ గా తన కెరీర్‌ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కారణంగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసు. కానీ కాలం గడిచేకొద్దీ ఈ బంధంలో ఓ మార్పు మొదలవుతుంది. మొదట్లో ఉన్న ఉత్సాహం, ఆకర్షణ క్రమంగా తగ్గిపోయి, ఒకరిని ఒకరు ప్రేమించడం కంటే కలిసి ఉండటం అలవాటుగా మారుతున్నట్టు అనిపిస్తుంది. అయినా హో మాత్రం ఈ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు.
మి-డో మాత్రం తన కెరీర్ లో ఎదురవుతున్న సమస్యలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో హో తన స్నేహితులతో మాట్లాడిన ఓ వీడియో మి-డో కంటపడుతుంది. తనను చూసినప్పుడు గతంలోలా ప్రేమతో గుండెల్లో సీతాకోకచిలుకలు ఎగరడం లేదని హో చెప్పిన మాటలు ఆమెను తీవ్రంగా బాధిస్తాయి. ఇన్నేళ్ల బంధానికి అసలు అర్థమేంటనే ప్రశ్న ఆమెను వెంటాడుతుంది. మరీ ముఖ్యంగా హో తనకు ప్రపోజ్ చేయబోయే రోజే మి-డో అతడికి బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
విడిపోయిన తర్వాత కూడా వీరి జీవితాలు ప్రశాంతంగా సాగవు. హాన్ తే-సంగ్ అనే లాయర్ మి-డో జీవితంలోకి వస్తాడు. మరోవైపు హో పని చేసే చోట అతని జూనియర్ పార్క్ సు-ఆతో అతడికి కొత్త పరిచయం ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే అనుబంధం, ఆకర్షణ ఒకవైపు ఉంటే… మరోవైపు పదేళ్లుగా కలిసి పంచుకున్న జ్ఞాపకాలు వీరిద్దరినీ వెంటాడుతూనే ఉంటాయి. మరి పదేళ్ల ప్రేమ నిజంగా ముగిసిపోయిందా ? కొత్త సంబంధాలు ఈ ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయా ? హో, మి-డో తమ విడిపోవడంపై తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటారా ? లేక గతాన్ని పక్కనపెట్టి కొత్త వ్యక్తులతో కొత్త జీవితాన్ని మొదలుపెడతారా ? అసలు ప్రేమ అంటే ఎప్పటికీ మారని భావనా… లేక కాలంతో పాటు దాని అర్థం కూడా మారుతుందా ? అనేది తెలియాలంటే సిరీస్ ను డోంట్ మిస్.
‘ఎ లవ్ అదర్ దాన్ యువర్స్’లో సియో కాంగ్-జూన్, అన్ యున్-జిన్, లీ జూ-ఆన్, జో ఆరామ్ కీలక పాత్రల్లో నటించారు. మొత్తం 14 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ కొరియన్ రొమాంటిక్ మెలోడ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం కొరియన్ ఒరిజినల్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు. పదేళ్ల ప్రేమ తర్వాత వచ్చే భావోద్వేగ మార్పులు, బ్రేకప్, కొత్త ఆకర్షణలు, రిలేషన్‌షిప్‌లోని వాస్తవిక సమస్యలు వంటివి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఈ సిరీస్ మీకోసమే.
Read Also: లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది