OTT Movie : ‘కొఠానోడి’ మూవీ నాలుగు తల్లులు తమ అంతర్గత భయాలతో పోరాడే కథల సమూహం అని చెప్పవచ్చు. ఈ మూవీలో సాంప్రదాయ జానపద కథలను, ముఖ్యంగా స్త్రీ పాత్రలను కొత్త కోణంలో చూపించారు. దీనిని అస్సాం గ్రామీణ జీవనశైలి, సంస్కృతి, మూఢనమ్మకాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఈ కథలను కూడా అస్సామీ సాహిత్య దిగ్గజం లక్ష్మీనాథ్ బెజ్బరోవా సేకరించారు. ఈ సినిమా నాలుగు కథ లతో తేజిమోలా (Tejimola), చంపావతి (Champawati), ఓఉ కువోరి (Ou Kuwori – The Outenga Maiden), తావోయిర్ సాధు (Tawoir Xadhu) అనే నలుగురు తల్లుల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ అస్సామీ మూవీ పేరు ‘కొఠానోడి’ (Kothanodi). ఇది భాస్కర్ హజారికా దర్శకత్వంలో 2015లో విడుదలైంది. ఈ సినిమా అస్సాం జానపద కథ “బుర్హి ఆయిర్ సాధు” (Burhi Aair Sadhu) ను ఆధారంగా చేసుకుని నిర్మించారు. ఈ మూవీకి దర్శకుడిగా భాస్కర్ హజారికా వ్యవహరించారు. ఇందులో సీమా బిస్వాస్, అదిల్ హుస్సేన్, జరీఫా వాహిద్, ఉర్మిలా మహంత, కొపిల్ బోరా, ఆశా బోర్డోలోయ్ నటించారు. సంగీతం అమర్‌నాథ్ హజారికా అందించారు. ఇది 2015లో ఆసియన్ సినిమా ఫండ్ పోస్ట్-ప్రొడక్షన్ అవార్డు గెలుచుకుంది. ఈ మూవీ 20వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అంతే కాకుండా 2016 లో 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అస్సామీ భాషలో ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా పొందింది. ఈ సినిమాను సోనీ లివ్ (SonyLIV) ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.
స్టోరీలోకి వెళితే
తేజిమోలా కథ: సెనెహి అనే స్త్రీ తన సవతి కూతురు తేజిమోలా పట్ల తీవ్రమైన ద్వేషాన్ని కలిగి ఉంటుంది. తేజిమోలా తండ్రి దేవీనాథ్ వ్యాపారం కోసం బయటకు వెళ్ళినప్పుడు, సెనెహి ఆమెను చంపేందుకు కుట్ర పన్నుతుంది. ఈ కథలో సవతి తల్లి క్రూరత్వం, తేజిమోలా నిస్సహాయ స్థితి ప్రధానంగా చూపిస్తారు.
ఓఉ కువోరి కథ : దేవీనాథ్ తన ప్రయాణంలో కేతకి అనే స్త్రీని కలుస్తాడు. కేతకి ఒక ఔటెంగా అనే పండుకు జన్మనిస్తుంది, ఇది ఆమె వెంట తిరుగుతూ ఉంటుంది. ఈ వింత ఘటన రహస్యాన్ని వెలికితీసేందుకు దేవీనాథ్ ప్రయత్నిస్తాడు. ఈ కథలో ప్రకృతి, అతీంద్రియ శక్తుల మధ్య సంబంధం చూపబడుతుంది.
చంపావతి కథ: ధోనేశ్వరి అనే సంపన్న స్త్రీ, తన కూతురు బోన్లోటికా ను ఒక పెద్ద కొండ చిలువ పాముకు ఇచ్చి వివాహం చేస్తుంది.శోభనం గదిలోకి కూడా పామును పంపిస్తుంది. ఆమె ఈ వివాహం ద్వారా సంపదను సంపాదించాలని ఆశిస్తుంది. కానీ ఈ నిర్ణయం భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ కథ దురాశ, మూఢనమ్మకాల ఫలితాలను హైలైట్ చేస్తుంది.
తావోయిర్ సాధు: మాలతి తన భర్త పూనై, అతని మామ ఆదేశాల మేరకు తన ముగ్గురు పిల్లలను బలి ఇచ్చింది. నాలుగో శిశువును రక్షించాలని నిశ్చయించుకున్న ఆమె, ఈ ప్రక్రియలో ఒక దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని తెలుసుకుంటుంది. ఈ కథలో త్యాగం, భయం, తల్లి పడే సంఘర్షణ చూపించారు. ఈ నాలుగు స్టోరీలతో ఈ మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.