Zelenskyy Trump Call Putin| రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో అమెరికా మంత్రులు, అధికారులు మరియు ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 30 రోజుల సాధారణ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా, ఉక్రెయిన్ దానికి అంగీకరించింది. పుతిన్ కూడా సూత్రప్రాయంగా ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపారు. యుద్ధం ముగింపు విషయంపై మంగళవారం ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో చర్చలు జరిపారు.
ఈ చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. పుతిన్ ఏం చెప్పారనే విషయాన్ని తెలుసుకోవడానికి తాను ట్రంప్‌తోనే నేరుగా మాట్లాడుతానని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. “రష్యాతో చర్చల విషయంలో ఈ రోజు ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతాను. యుద్ధ నివారణకు తదుపరి చర్యల గురించి తెలుసుకుంటాను” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Also Read: గాజాలో 413 మంది మరణం.. ఇజ్రాయెల్ భీకర దాడి.. యద్ధం మళ్లీ మొదటికే
జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపిన ట్రంప్.. మరుసటి రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల అభ్యర్థనలను చర్చించారని ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని ఆయన తెలిపారు.
అంతకుముందు, పుతిన్‌తో జరిపిన చర్చల గురించి తెలుసుకోవడానికి జెలెన్‌స్కీ ట్రంప్‌తో మాట్లాడాలని కోరారు. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయాలని అమెరికా-రష్యా మధ్య అంగీకారం కుదిరినప్పటికీ, రష్యా సైన్యాలు ఉక్రెయిన్ భూభాగంపై డ్రోన్ దాడులు కొనసాగిస్తున్నాయని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ సందర్భంగానే ట్రంప్‌తో జెలెన్‌స్కీ ఫోన్‌లో మాట్లాడారు.
రష్యా దాడులు చేస్తూనే ఉంది: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు ఆపాలని యుఎస్ మరియు రష్యా మధ్య అంగీకారం కుదిరినప్పటికీ, ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమ భూభాగంలోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, “నిజంగా రష్యా ఏమి కోరుకుంటుందనేది ఈ దాడుల ద్వారా స్పష్టమవుతోంది. దాదాపు 40 డ్రోన్లు మా భూభాగాన్ని తాకాయి. పౌరుల మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. సుమీలోని ఆస్పత్రితో పాటు ఉక్రెయిన్, జటోమిర్, చెర్నిహివ్ తదితర ప్రాంతాల్లో ఈ డ్రోన్ దాడులు జరిగాయి. మా ఇంధన, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా అర్ధరాత్రి వేళ దాడులు చేయడం సరైనది కాదు. ఉక్రెయినియన్ల సాధారణ జీవితానికి ఇవి విఘాతం కలిగిస్తాయి. యుద్ధాన్ని పొడిగించేందుకు పుతిన్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రపంచ నాయకులు స్పందించాలి” అని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, “రష్యా శాంతిని కాంక్షిస్తుందని చెప్పుకుంటూ ఇలాంటి దాడులు చేస్తోంది కదా!” అని జెలెన్స్కీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ కూడా రష్యా దాడులపై స్పందించారు. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడంపై పుతిన్ ఆటలాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ తాజా దాడులపై ట్రంప్ కచ్చితంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన ఫోన్ చర్చల్లో ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు ఆపాలని ట్రంప్ సూచించగా, పుతిన్ దానికి అంగీకరించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పరస్పరం 175 మంది యుద్ధ ఖైదీలను బుధవారం అప్పగించుకునే విషయాన్ని పుతిన్ తెలిపారని క్రెమ్లిన్ వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన 23 మంది ఉక్రెయిన్ సైనికులను కూడా రష్యా అప్పగించనుందని తెలిపారు. అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని ఆపాలని పుతిన్ డిమాండ్ చేశారని క్రెమ్లిన్ తెలిపింది. ఈ చర్చలకు ఉక్రెయిన్ సమ్మతి ఉందా లేదా అనే విషయం స్పష్టం కాలేదు.