The Institute Season 2 OTT: అతీంద్రియ శక్తులున్న పిల్లలు.. వారి శక్తులను తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనుకునే ఓ రహస్య సంస్థ.. ఆ సంస్థ నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడే చిన్నారులు.. ఇలాంటి ఉత్కంఠభరితమైన కథలతో వచ్చిన హారర్ థ్రిల్లర్ సిరీస్ ‘ది ఇన్స్టిట్యూట్’ (The Institute). ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ మొదటి సీజన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా వచ్చేసింది. దీని కథ ఏంటి ? ఏ ఓటీటీలో చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే..
‘ది ఇన్స్టిట్యూట్’ (The Institute) సీజన్ 2 కథ మొదటి సీజన్ ముగిసిన చోట నుండి, అంటే ల్యూక్ అతని స్నేహితులు డెన్నిసన్ ఫెసిలిటీ నుండి తప్పించుకున్న తర్వాత మొదలవుతుంది. బయటపడిన ఈ పిల్లలు మాజీ పోలీసు ఆఫీసర్ టిమ్, ఇంకా వెండి సాయంతో ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకుంటారు. అయితే ఇన్స్టిట్యూట్ సంస్థ వాళ్లను అంత సులభంగా వదిలిపెట్టదు. వాళ్లను మళ్లీ పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తుంటుంది. ఈ క్రమంలో ల్యూక్‌కు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు ముందే కనిపించే కొత్త శక్తులు వస్తాయి. దీని ఆధారంగా ఒకరి ప్రాణాలను కాపాడబోయి ల్యూక్ అండ్ గ్యాంగ్ అనుకోకుండా మరింత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు.
మరోవైపు ఇన్స్టిట్యూట్ సంస్థ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతుంది. డైరెక్టర్ తన సంస్థను బలోపేతం చేసుకోవడానికి నోలాన్ రీవ్స్ అనే ఒక టెక్ బిలియనీర్‌తో చేతులు కలుపుతాడు. పిల్లల మానసిక శక్తులకు తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని జోడించి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని వీరు ప్లాన్ చేస్తారు. ఇంకోవైపు, గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన జూలియా సిగ్స్బీ సంస్థ నుండి బయటికి వచ్చేసినా, మళ్లీ ఎలాగైనా అందులోకి అడుగుపెట్టాలని తనవంతు ప్రయత్నాలు చేస్తుంటుంది.
కథ ముందుకు సాగేకొద్దీ వీళ్లు దాక్కున్న సేఫ్హౌస్పై ఇన్స్టిట్యూట్ మనుషులు దాడి చేస్తారు. ఈ దాడిలో వెండి ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది. తన స్నేహితులను కాపాడుకోవడానికి, ఈ సంస్థ ఆట కట్టించడానికి ఇక వేరే దారి లేదని ల్యూక్ భావిస్తాడు. చివరికి ల్యూక్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, ఒంటరిగా వెళ్లి జూలియా సిగ్స్బీని నేరుగా ఎదుర్కోవడానికి సిద్ధపడటంతో ఈ సీజన్ కథ ఎంతో ఉత్కంఠభరితంగా మలుపు తిరుగుతుంది.
ది ఇన్స్టిట్యూట్’ (The Institute) సీజన్లో ల్యూక్ ఎల్లిస్గా జో ఫ్రీమాన్, టిమ్ జేమిసన్గా బెన్ బర్న్స్, జూలియా సిగ్స్బీగా మేరీ-లూయిజ్ పార్కర్ ప్రధాన పాత్రలు పోషించగా, కొత్తగా నోలాన్ రీవ్స్ అనే టెక్ బిలియనీర్ పాత్రలో ఆల్ఫీ అలెన్ చేరారు. వీరితో పాటు సిమోన్ మిల్లర్, ఫియోన్ లెయిర్డ్, హన్నా గాల్వే, అర్లెన్ సో, మరియు రాబర్ట్ జాయ్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. విడుదల విషయానికి వస్తే, అంతర్జాతీయంగా MGM+ లో నవంబర్ 8న మొదలైన ఈ సిరీస్, ఇండియాలో నవంబర్ 22, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలోని MGM+ యాడ్-ఆన్ ఛానల్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.
Read Also: కళ్ళముందు జరిగేదంతా నిజమా? లేక మెదడు ఆడుతున్న మైండ్ గేమా?… చూస్తే బుర్రపాడయ్యే సైకలాజికల్ థ్రిల్లర్