Romantic Drama OTT : ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన తర్వాత లైఫ్ మొత్తం మారిపోయినట్టు అనిపించవచ్చు. కానీ కలిసి కన్న కలలు, పంచుకున్న ఆనందాలు, జీవితాంతం తోడుగా ఉండాలనే ఆశలు… ఒక్కసారిగా కూలిపోతే ఆ బాధ నుంచి బయటపడటం అంత సులభం కాదు. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన తర్వాత మళ్లీ కొత్తగా జీవించడం, మరోసారి ప్రేమకు అవకాశం ఇవ్వడం సాధ్యమేనా ? గతం తాలూకు జ్ఞాపకాలను మోస్తూనే ముందుకు సాగేందుకు ప్రయత్నించే ఓ యువతి భావోద్వేగ ప్రయాణమే ‘లవ్ ఆఫ్ యువర్ లైఫ్’ (Love of Your Life). మరి ఈ ఫీల్ గుడ్ డ్రామాను ఎక్కడ చూడవచ్చు ? స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? అంటే…
మాయా బోస్టన్ లో నర్సుగా పని చేసే యువతి. అనుకోకుండా చార్లీ అనే వ్యక్తిని కలుసుకున్న ఆమెకు, ఆ పరిచయం క్రమంగా గాఢమైన ప్రేమగా మారుతుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం వారి జీవితాలకు కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఒకరితో ఒకరు గడుపుతూ, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. చివరకు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇక తమకు అంతా సంతోషంగానే ఉంటుందని మాయా భావిస్తున్న సమయంలో ఊహించని విషాదం వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. చార్లీని కోల్పోయిన తర్వాత మాయా తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది. తనతో జీవితాంతం ఉంటాడనుకున్న వ్యక్తి ఇక లేడనే నిజాన్ని అంగీకరించలేకపోతుంది. అతనితో ముడిపడిన జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతుంటాయి.
గతంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చిన విషయాలే ఇప్పుడు బాధను గుర్తుచేస్తాయి. ఆ పరిస్థితిలోనే మాయా తనకు పరిచయమైన ప్రపంచం నుంచి దూరంగా వెళ్లి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అలా బోస్టన్ను విడిచిపెట్టి పోర్చుగల్కు చేరుకున్న మాయా, డిజిటల్ నర్సుగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషుల మధ్య తనను తాను తిరిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఫెలిక్స్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి వస్తాడు. అతనితో ఏర్పడిన పరిచయం మాయాలో మళ్లీ ప్రేమించగలననే ఆశను కలిగిస్తుంది. అయితే కొత్త బంధాన్ని అంగీకరించడం అంటే పాత ప్రేమను మర్చిపోవడం కాదు. చార్లీతో గడిపిన జీవితం తనలో ఎప్పటికీ ఒక భాగంగానే ఉంటుందని ఆమెకు తెలుసు.
మరి గతాన్ని గౌరవిస్తూనే కొత్త జీవితాన్ని ఎలా స్వీకరించాలి ? మరో వ్యక్తికి మనసులో చోటివ్వడం పాత ప్రేమకు ద్రోహం చేసినట్టేనా ? చార్లీని కోల్పోయిన బాధ నుంచి మాయా బయటపడగలదా? ఫెలిక్స్తో కొత్త బంధానికి మనస్ఫూర్తిగా అవకాశం ఇవ్వగలదా? జీవితంలో ఒక్కరే నిజమైన ప్రేమగా మిగిలిపోతారా, లేక మరో ప్రేమ కూడా మనకు కొత్త అర్థాన్ని ఇవ్వగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా.
Also Read : లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్
‘లవ్ ఆఫ్ యువర్ లైఫ్’ అక్టోబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో ప్రధానంగా ఇంగ్లీష్ లో ఉంది. మార్గరెట్ క్వాలీ (Margaret Qualley) మాయా పాత్రలో, గాబ్రియేల్ బాసో (Gabriel Basso) చార్లీగా, ఆరోన్ పియర్ (Aaron Pierre) ఫెలిక్స్గా నటించారు. పాట్రిక్ స్క్వార్జెనెగర్, క్యాథరిన్ కీనర్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. రాచెల్ మోరిసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జూలియా కాక్స్ కథ అందించారు. కరోనా మహమ్మారి కాలంలో చోటుచేసుకునే విషాదం కూడా కథలో ముఖ్యమైన మలుపుగా నిలుస్తుంది. అయితే ఇది కేవలం ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన కథ మాత్రమే కాదు. దుఃఖాన్ని ఎదుర్కొంటూ, తన గుర్తింపును తిరిగి వెతుక్కుంటూ, జీవితంలో మరోసారి ప్రేమకు చోటివ్వడానికి ప్రయత్నించే మహిళ కథ.