OTT Movie : కోటా నగరంలోని ఒక చీకటి వీధిలో, ఒక యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమె శరీరం భయంకరమైన స్థితిలో కనిపిస్తుంది. ఒక ధైర్యవంతురాలైన లేడీ పోలీస్ ఈ కేసును విచారిస్తుంది. కానీ అంతలోనే మరొక యువతి అదే విధంగా మిస్ అవుతుంది. ఈ హత్యల వెనుక ఉన్న సైకోపాథ్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఈ కిల్లర్ ఎవరు? అతని హత్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ పోలీసు అధికారి అతన్ని ఎలా ఆపగలదు? అనేది తెలియాలంటే మూవీ డీటైల్స్ పై ఓ లుక్కేయాల్సిందే.
కథలోకి వెళ్తే…
ఎస్పీ శివానీ శివాజీ రాయ్ (రాణి ముఖర్జీ) భయమన్నదే ఎరుగని పోలీసు ఆఫీసర్. కోటాలో యువతులపై జరుగుతున్న దాడులు, హత్యలను… వాటి వెనుక ఉన్న కిల్లర్ ను పట్టుకునే కేసును ఆమెకు అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ లో ఈ దారుణమైన హత్యల వెనుక సన్నీ (విశాల్ జెత్వా) అనే 21 ఏళ్ల సైకోపాథ్ ఉన్నాడని తెలుస్తుంది. అతను మహిళలపై తనకున్న విపరీతమైన ద్వేషాన్ని తాను చేసే హత్యలలో చూపిస్తాడు. అంటే అమ్మాయిలను అత్యంత దారుణంగా చంపుతాడు.
సన్నీ ఒకే ప్యాటర్న్ లో హత్యలు చేస్తూ పోతాడు. దాన్ని గమనించాక అతని గతంలోని ఒక బాధాకరమైన సంఘటనే సన్నిని ఇలా మార్చింది అని అర్థం అవుతుంది. అయితే శివానీ తన టీమ్‌లోని సహోద్యోగులు విక్రమ్ (తాహిర్ రాజ్ భాసిన్), ఇతరుల సహాయంతో సన్నీ తెలివైన, అనూహ్యమైన చర్యలను ఎదుర్కొంటూ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతని సైకోలాజికల్ గేమ్‌లు శివానీని కూడా డేంజర్ లో పడేస్తాయి. అసలే అమ్మాయిలంటే పడని ఆ సైకో ఆమె కుటుంబంపై దాడి చేసి, శివాని సహనాన్ని పరీక్షిస్తాడు.
ఇక ఓవైపు శివానీ తన వ్యక్తిగత జీవితంలోని ఒత్తిడులను, తన భర్త డాక్టర్ శివ్ (జిషు సేన్‌గుప్తా)తో ఉన్న సంబంధాన్ని బ్యాలెన్స్ చేస్తూ… మరోవైపు సన్నీ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ట్రై చేస్తుంది. ఈ కేసులో దొరికిన కొన్ని క్లూలతో అతని ఆటను కట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అతని ప్రతి హత్య ఒక సవాల్‌గా మారుతుంది. మరి చివరికి ఆ సైకోకు శివాని ఎలా ఫుల్ స్టాప్ పెట్టింది? అతని గతం ఏంటి? ఎందుకు అతనికి అమ్మాయిలంటే అంత ద్వేషం? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : అమ్మాయిల స్కామ్ లో ప్రియమణి భర్త … హీటెక్కించే కోర్ట్ రూమ్ డ్రామా
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఇదొక గ్రిప్పింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. ఈ మూవీ పేరు ‘Mardaani 2’. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. IMDbలో ఈ మూవీకి 7.3 రేటింగ్ ఉంది. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాణి ముఖర్జీ, విశాల్ జెత్వా, తాహిర్ రాజ్ భాసిన్, జిషు సేన్‌గుప్తా, శ్రుతి బప్నా ప్రధాన పాత్రల్లో నటించారు.