Madraskaaran OTT.. మెగా డాటర్ నిహారిక (Niharika ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ అమ్మాయిలు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. మెగా డాటర్ నిహారిక మాత్రం కాస్త ధైర్యం చేసి యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత “ఒక మనసు” అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ ఈ సినిమా ఈమె కెరీర్ కు పునాది వేయలేకపోయింది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్న ఈమె, పెళ్లయిన కొన్నాళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి, ఒంటరి జీవితాన్ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే నిర్మాతగా మారిన ఈమె.. ” పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్” ను స్థాపించి ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా తీసి నిర్మాతగా సక్సెస్ అయ్యింది.
ఈ రోజు నుంచే తెలుగులో స్ట్రీమింగ్..
తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. సక్సెస్ కాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి మకాం మార్చింది. ఇక అలా అక్కడ ‘మద్రాస్ కారన్ ‘ అనే సినిమా చేసి పరవాలేదు అనిపించుకుంది నిహారిక . సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన తమిళ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. నిహారిక మునుపెన్నడూ లేని విధంగా నటించి అందరిని అబ్బురపరిచింది. షేన్ నిగమ్(Shen Nigam), నిహారిక ప్రధాన పాత్రల్లో వచ్చిన యాక్షన్ ఫిలిం ఇది. ఇప్పటికే ఆహా ఓటీటీ వేదికగా తమిళ్లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. బుధవారం (ఫిబ్రవరి 26) అనగా ఈరోజు నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక సోషల్ మీడియా వేదికగా సదరు సంస్థ ఈ వివరాలను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
మద్రాస్ కారన్ సినిమా స్టోరీ..
ఈ మద్రాస్ కారన్ మూవీ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇంజనీర్ అయినా సత్య మూర్తి (షేన్ నిగమ్) కొన్ని అనుకోని కారణాలవల్ల రైతుగా మారతాడు. తండ్రి, భార్య మీరా (నిహారిక) తో కలిసి గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా కొంతమంది దుండగులు అతనిపై దాడి చేస్తారు. ఇక తన శత్రువు సింగమ్ ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడని సత్యా భావిస్తాడు. మరి ఆ సింగమ్ ఎవరు ? సింగమ్ కి సత్యాకి మధ్య విభేదాలు ఏంటి? శత్రువు నుంచి తన కుటుంబాన్ని సత్య ఎలా కాపాడుకున్నాడు? తదితర అంశాలతో ఈ సినిమాను చాలా అద్భుతంగా రూపొందించారు. ఇక ఇందులో నిహారిక తన అద్భుతమైన నటనతో తన మార్క్ చూపించింది. అవకాశం వస్తే తన టాలెంట్ను నిరూపించుకోవడానికి సిద్ధమని చెబుతున్న నిహారిక.. అందుకు తగ్గట్టుగానే తనను తాను ప్రూవ్ చేసుకుందని చెప్పవచ్చు. అటు షేన్ నిగమ్ కూడా సత్య క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయారు. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ కూడా తెరపై బాగా పండింది. దీంతో అటు కోలీవుడ్ లో కూడా ఈ జంటకు భారీ పాపులారిటీ ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తానికైతే తమిళ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లిన నిహారికకి కాస్త వరకు ఉపశమనం కలిగిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.