Supernatural Horror Movie OTT : ఇంట్లో వేలాడుతున్న ఓ పాత అద్దం… చూడటానికి నార్మల్ గానే ఉంటుంది. కానీ దాని చుట్టూ జరిగిన మరణాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే అది ఉన్న ఇంట్లో ఘోరమైన మరణాలు సంభవించినట్టు తెలుస్తుంది. ఆ అద్దంలో ఏదో అతీంద్రియ శక్తి ఉందని నమ్మిన ఓ యువతి, దాన్ని ప్రయోగం ద్వారా నిరూపించాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ ప్రయోగం మొదలైన తర్వాత నిజం ఏది, భ్రమ ఏది అనే తేడానే కనిపించకుండా పోతుంది. మైండ్‌ను గందరగోళానికి గురిచేసే సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘ఆక్యులస్’ (Oculus). మరి ఈ భయంకరమైన మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
టిమ్ రస్సెల్ తన తల్లిదండ్రుల మరణాలకు తానే కారణమయ్యానని బాధ పడుతుంటాడు. అయితే మానసిక సమస్యల కారణంగా మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటాడు. చాలా సంవత్సరాల తర్వాత అతను బయటకు వస్తాడు. అయితే అతని అక్క కైలీ మాత్రం ఆ సంఘటనను పూర్తిగా వేరే కోణంలో చూస్తుంది. వాళ్ల తండ్రి అలన్ ఒకప్పుడు ఇంటి కోసం ఓ పురాతన అద్దాన్ని కొనుగోలు చేస్తాడు. దాని పేరు లాసర్ గ్లాస్. ఆ అద్దం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంలో వింత సంఘటనలు మొదలవుతాయి. అలన్, మేరీ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. వాళ్లు చూసేది నిజమా, భ్రమా అనే విషయం కూడా వాళ్లకే అర్థం కాని పరిస్థితి వస్తుంది.
పదకొండేళ్ల తర్వాత కైలీ ఆ అద్దాన్ని మళ్లీ తెచ్చుకుంటుంది. తన తల్లిదండ్రుల మరణానికి అసలు కారణం అదే అద్దమని ఆమె బలంగా నమ్ముతుంది. టిమ్ మాత్రం ఈ నమ్మకాన్ని అంగీకరించడు. తన తండ్రి చేసిన హత్య, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు మానసిక కారణాలే ఉన్నాయని అతను భావిస్తాడు. కైలీ మాత్రం ముందుగానే భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇంట్లో కెమెరాలు పెడుతుంది. అద్దం దగ్గర ఉష్ణోగ్రత మార్పులను గుర్తించేందుకు పరికరాలు ఏర్పాటు చేస్తుంది. వాళ్లు తినడం, నీళ్లు తాగడం మర్చిపోకుండా అలారాలు పెడుతుంది. అద్దాన్ని ధ్వంసం చేసేందుకు ప్రత్యేకమైన కిల్ స్విచ్ కూడా ఏర్పాటు చేస్తుంది.
కానీ ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే వాళ్లకు కనిపించే దృశ్యాలు గందరగోళాన్ని పెంచుతాయి. అద్దం వాళ్ల జ్ఞాపకాలను, భయాలను ప్రభావితం చేస్తుందా ? లేక చిన్ననాటి ట్రామా వల్ల వాళ్లే భ్రమలకు గురవుతున్నారా ? కైలీ నిజంగా అద్దం రహస్యాన్ని బయట పెట్టగలదా ? టిమ్ తన చిన్ననాటి జ్ఞాపకాల్లోని నిజాన్ని అంగీకరించగలడా ? లాసర్ గ్లాస్ వెనుక ఉన్న శక్తి నిజంగానే ఉందా… లేక మనుషుల మనసే దానికి బలవుతోందా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘ఆక్యులస్’పై ఒక లుక్కేయండి.
Also Read : పగటిపూట ప్రెసిడెంట్… రాత్రి వేళ సీక్రెట్ వేట… మెంటలెక్కించే హర్రర్ థ్రిల్లర్
2013లో వచ్చిన ‘ఆక్యులస్’ మైక్ ఫ్లానగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ హారర్ మూవీ. కరెన్ గిల్లన్, బ్రెంటన్ త్వైట్స్, కేటీ సాక్‌హాఫ్ తదితరులు నటించారు. Netflixలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. హారర్ మూవీ లవర్స్ ఇంగ్షీషులోనే చూడాల్సి ఉంటుంది.