Hyderabad Japan Festival 2026: జపాన్ వెళ్లకుండానే ఆ దేశ కల్చర్, ఫుడ్, కళలు, టెక్నాలజీని దగ్గరగా చూసే అవకాశం హైదరాబాద్ వాసులకు రాబోతోంది. హైటెక్ సిటీలో జరగనున్న హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ జపాన్ సంప్రదాయాలతో పాటు లేటెస్ట్ పాప్ కల్చర్ ను కూడా అందించబోతోంది. జపనీస్ ఫుడ్ నుంచి అనిమే, కాస్ప్లే, మార్షల్ ఆర్ట్స్, రోబో టిక్స్ వరకు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఈ వేడుకలో ఆకట్టుకోనున్నాయి.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ గార్డెన్స్ లో అక్టోబర్ 11న ఈ ఫెస్టివల్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బోలెడు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ నిర్వాహకులు ఎలాంటి ఎంట్రీ ఫీజ్ పెట్టలేదు. ఈ నేపథ్యంలో జపాన్ సంస్కృతిపై ఆసక్తి ఉన్నవాళ్లు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశం ఉంది.
ఫెస్టివల్‌లో జపాన్‌కు చెందిన పురాతన కళలు, చేతివృత్తులను సందర్శకులకు పరిచయం చేయనున్నారు. నింగ్యో అనే జపనీస్ బొమ్మల తయారీ కళతో పాటు సుమి-ఇ అనే సిరా చిత్రలేఖనాన్ని ప్రదర్శించనున్నారు. అలాగే ప్రకృతి సౌందర్యాన్ని పూలతో అందంగా చూపించే ఇకెబానా, చిన్న చెట్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దే బోన్సాయ్ కళను కూడా చూడొచ్చు. జపనీస్ సిరామిక్ సంప్రదాయాలను పరిచయం చేసే కుండల ప్రదర్శన కూడా ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
జపాన్ సంస్కృతి అనగానే అక్కడి ఫుడ్ గుర్తుకు వస్తుంది. ఈ ఫెస్టివల్‌లో సందర్శకులకు జపనీస్ రుచులను పరిచయం చేసే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మచ్చాతో పాటు జపనీస్ సంప్రదాయ మిఠాయిలైన వాగాషి అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు, జపనీస్ టీ వేడుక సాడో ద్వారా టీ తయారీ, వడ్డింపు వెనుక ఉన్న క్రమశిక్షణ, ఆతిథ్య సంస్కృతిని పరిచయం చేయనున్నారు. జపనీస్ సంస్కృతిలోని ఒమోటెనాషి అనే ఆతిథ్య భావన గురించి కూడా సందర్శకులు తెలుసుకోవచ్చు.
జపాన్ పాప్ కల్చర్‌ను ఇష్టపడే యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనిమే, కాస్ప్లే, అనిమే క్విజ్ లాంటి ఈవెంట్లు ఫెస్టివల్‌లో సందడి చేయనున్నాయి. తమకు ఇష్టమైన అనిమే పాత్రల వేషధారణలో అభిమానులు పాల్గొనడం ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. జపనీస్ సంస్కృతిలోని సంప్రదాయ అంశాలతో పాటు ఆధునిక యువతను ఆకట్టుకునే పాప్ కల్చర్ ను కూడా నిర్వాహకులు ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు.
జపాన్ అంటే టెక్నాలజీ గుర్తుకు వస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఫెస్టివల్‌లో ఇన్నోవేషన్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఇన్నోవేషన్ హ్యాకథాన్ ప్రదర్శన, అవార్డుల కార్యక్రమంతో పాటు రోబోటిక్స్ ప్రదర్శన కూడా జరగనుంది. దీంతో పిల్లలు, విద్యార్థులు, టెక్నాలజీపై ఆసక్తి ఉన్న యువతకు కూడా ఈ ఫెస్టివల్ ఆసక్తికరంగా మారనుంది. అటు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, తోలుబొమ్మల కార్యక్రమాలు, జపనీస్ నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు. జపాన్ ను సంస్కృతిని ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకునే వారు అక్టోబర్ 11న హైటెక్ సిటీలో జరిగే ఈ ఫెస్టివల్ కు హ్యాపీగా వెళ్లండి.
Read Also: చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!