OTT Movies: ఓటీటీలో మలయాళీ మూవీలకు ఉండే క్రేజే వేరు. కథనం స్లోగానే ఉన్నా.. చిన్న సబ్జెక్టుతో వారు చేసే మ్యాజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మీరు చదవబోయే సినిమా కూడా అలాంటిదే. సినీ రంగంలో స్థిరపడి.. సక్సెస్ అవ్వాలనుకొనే ఇద్దరు స్నేహితుల కథ. అయితే వారిని కాలం ఎలా విడదీసింది, మళ్లీ ఎలా కలిపిందనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. మూవీ ఎండింగ్ వరకు మీ ముఖం మీద చిరునవ్వు చెరగదు. మరి, ఆ సినిమా కథేంటో చూసేద్దామా?
అది 1970వ సంవత్సరంలో. కేరళలోని ఒక చిన్న పట్టణంలో వేణు (ధ్యాన్ శ్రీనివాసన్), మురళి (ప్రణవ్ మోహన్‌లాల్) అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. వీరికి సినిమా అంటే చాలా పిచ్చి. అదే వారి స్నేహాన్ని బలోపేతం చేస్తుంది. వేణు ఒక రచయిత. దర్శకుడిగా మారి.. తన కథలతో సినిమాలు తియ్యాలని కలలుగంటాడు. మురళికి సంగీతం అంటే ప్రాణం. తన గిటార్‌తో పాటలతో సినీ రంగంలో మంచి సంగీత దర్శకుడిగా ఎదగాలనేది అతడి లక్ష్యం. ఆ కాలంలో మద్రాసు (ఇప్పుడు చెన్నై) దక్షిణాది సినీ రంగానికి కేంద్రంగా ఉండేది. దీంతో వారు తమ కలలను సాకారం చేసుకోడానికి కేరళ నుంచి మద్రాసు చేరుకుంటారు.
మద్రాసులో స్నేహితుల పాట్లు
చెన్నైలో అడుగుపెట్టిన వేణు, మురళి ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటూ.. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ సినిమాల్లో అవకాశాలు కోసం చాలా కష్టపడతారు. వేణు చిన్న చిన్న కథలు రాస్తూ, స్క్రిప్ట్‌లను నిర్మాతలకు చూపిస్తూ ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. మురళి తన సంగీతంతో అవకాశాల కోసం తిరుగుతాడు. కానీ, సినిమా రంగంలో ఛాన్సులు రావాలంటే అంత ఈజీ కాదు. ఒక రోజు మురళి ఒక నిర్మాతను కలుస్తాడు. వేణు రాసిన ఒక స్క్రిప్ట్ ఆ నిర్మాతకు నచ్చుతుంది. ఆ మూవీకి సంగీతం అందించే ఛాన్స్ కూడా మురళీకే దక్కుతుంది. అలా వేణు దర్శకుడిగా, మురళీ సంగీత దర్శకుడిగా మొదటి సినిమా రూపొందుతుంది. అయితే ఆ రోజుల్లో సినిమాలు తియ్యడం అంటే అంత ఈజీ కాదు. లో బడ్జెట్, రీల్స్.. ఇంకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. మొత్తానికి వారిద్దరూ అవన్నీ అధిగమించి సినిమాను పూర్తి చేస్తారు. వాళ్ల మూవీ విడుదల రోజు కోయంబత్తూరులోని ఒక థియేటర్‌లో తమ సినిమాను చూసేందుకు వెళతారు. ప్రేక్షకులు ఆ మూవీని ఎంజాయ్ చేస్తూ చూస్తుంటే.. వీరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. సంతోషంతో ఒకరినొకరు హత్తుకుంటారు.
స్నేహం.. అహం.. దూరం
సినిమా రంగం ఒక మాయా లోకం అంటారు. అక్కడ సక్సెస్‌ను తలకు ఎక్కించుకుంటే అహం ఏర్పడుతుంది. అదే వేణు, మురళిల స్నేహాబంధాన్ని విడదీస్తుంది. ఒకరి విజయం మరొకరికి ఈర్ష్యగా మారుతుంది. అప్పుడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. దశాబ్దాలు గడిచిపోతాయి. కథ ఆధునిక కాలంలోకి వస్తుంది.
అప్పుడే కథలోకి నితిన్ మోలీ (నివిన్ పౌలీ) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అతను కూడా సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలని కలలు కంటాడు. నితిన్ ఎంట్రీ నుంచి కథలో కూడా కాస్త రిలీఫ్‌గా సాగుతుంది. అతడి సెటైర్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. వేణు, మురళీలను దగ్గర చేసేందుకు నితిన్ ప్రయత్నిస్తుంటాడు. మరి ఆ విషయంలో నితిన్ సక్సెస్ అవుతాడా? వేణు.. మురళీ మళ్లీ కలుస్తారా అనేది తెరపైనే చూడాలి. అయితే, ఇందులో బాసిల్ జోసెఫ్, కళ్యాణి ప్రియదర్శీలు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే, వారి పాత్రలు ఏమిటనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
ఏ ఓటీటీలో ఉంది?
అన్నట్టు ఈ మూవీ పేరు ‘వర్షంగల్కు శేషం’. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఉంది. 2024లో విడుదలైన మలయాళ కామెడీ-డ్రామా చిత్రానికి వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.
Also Read: DNA Movie: థియేటర్లో రిలీజైన మరుసటి రోజే ఓటీటీకి వచ్చిన క్రైం థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే!