Investigative Crime Thriller: ఒక రాత్రి నైట్ పెట్రోలింగ్ కు వెళ్లిన ఇద్దరు పోలీసులకు ఓ జర్నలిస్ట్ శవం కనిపిస్తుంది. కానీ ఆ విషయాన్ని పై అధికారులకు చెప్పకుండా వాళ్లు దాచేస్తారు. అదే వాళ్ల జీవితాల్లోనే అతిపెద్ద సమస్యగా మారితే ? నిన్నటి వరకు డ్యూటీలో ఉన్న పోలీసులు… మరుసటి రోజే అదే హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా మారితే ? అసలు ఆ జర్నలిస్ట్‌ను చంపిందెవరు ? పోలీసులు చూసిన నిజం ఏంటి ? ఈ ప్రశ్నల చుట్టూ సాగే సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘పాతిరాత్రి’ (Paathirathri). మరి ఈ మలయాళం థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? అన్న విషయాన్ని తెలుసుకుందాం పదండి.
హరీష్ (సౌబిన్ షాహిర్), జాన్సీ కురియన్ (నవ్య నాయర్) ఇద్దరూ పోలీస్ అధికారులు. ఒకే డిపార్ట్‌మెంట్ లో పని చేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరికీ అస్సలు పడదు. చిన్నచిన్న విషయాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక రాత్రి వీరిద్దరూ కలిసి నైట్ పెట్రోలింగ్ కు బయలు దేరుతారు. అర్ధరాత్రి సమయంలో అన్సార్ అనే జర్నలిస్ట్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి ఉండటాన్ని వీళ్లు గమనిస్తారు. అక్కడ జరిగిన విషయంపై వారికి కొన్ని కీలకమైన అనుమానాలు వస్తాయి.
కానీ వ్యక్తిగత కారణాలు, డిపార్ట్‌మెంట్ కు సంబంధించిన సమస్యలతో ఆ సమయంలో ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయకుండా దాచేస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. మరుసటి రోజు అన్సార్ హత్య కేసు పెద్దదిగా మారుతుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసులు దాచిన విషయం బయటపడే పరిస్థితి వస్తుంది. చివరికి హరీష్, జాన్సీలే కేసులో ప్రధాన అనుమానితులుగా మారిపోతారు. ఇప్పుడు తమపై పడిన నిందను తొలగించుకోవడంతో పాటు అసలు హంతకుడిని కూడా వాళ్లే కనిపెట్టాల్సిన పరిస్థితి.
అన్సార్ హత్యకు యాస్మిన్ (ఆన్ అగస్టిన్)కు ఉన్న సంబంధం ఏంటి ? ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? ఇద్దరు పోలీసులు దాచిన రహస్యం ఎంత పెద్ద కుట్రకు దారి తీసింది ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కథ ముందుకు సాగుతుంది. తమ ఉద్యోగం, పరువు, చివరికి ప్రాణాలనే కాపాడుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్లే ఈ ఇద్దరు పోలీసులు ఎదుర్కొనే పరిణామాలు సినిమాకు ప్రధాన బలం. పోలీసులే అనుమానితులుగా మారిన నేపథ్యంలో అసలు నేరస్తుడిని పట్టుకునే దర్యాప్తు ఆసక్తిని పెంచుతుంది. మరి చివరికి హంతకుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు ? క్లైమాక్స్ ఏంటి ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
‘పాతిరాత్రి’ని ‘పుజు’ (Puzhu) ఫేమ్ దర్శకురాలు రతీనా పి.టి. తెరకెక్కించారు. కథను షాజీ మారద్ రాశారు. ఆయన నిజ జీవితంలో పోలీస్ ఆఫీసర్ కావడం ఈ చిత్రానికి మరింత ఆసక్తిని కలిగించే అంశం. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. సౌబిన్ షాహిర్, నవ్య నాయర్, సన్నీ వేన్, ఆన్ అగస్టిన్, అచ్యుత్ కుమార్, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ‘పాతిరాత్రి’ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో డబ్బింగ్ అందుబాటులో లేదు. ఒరిజినల్ మలయాళ ఆడియోకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, ట్విస్టులతో కూడిన క్రైమ్ థ్రిల్లర్స్ కోసం ఓటీటీలో వెతుకుతుంటే ఈ సినిమా మంచి ఆప్షన్.
Read Also: అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా