Psychological Horror Thriller : వింత వింత స్టోరీలతో వచ్చే సైకలాజికల్ థ్రిల్లర్ అంటే పడిచచ్చే ఓటీటీ మూవీ లవర్స్ సంఖ్య భారీగానే ఉంటుంది. అందులోనూ హాలీవుడ్ నుంచి వచ్చే ఇలాంటి కథలంటే ఉండే క్రేజ్ వేరు. ఇక మన మూవీ సజెషన్ కూడా 2026లో విడుదలైన ‘హైవ్’ (Hive) అనే అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఫెలిప్ వర్గాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక విలాసవంతమైన నివాస ప్రాంతంలో పిల్లల వెనుక దాగి ఉన్న ఒక వింత, భయంకరమైన శక్తుల చుట్టూ తిరుగుతుంది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కాలిఫోర్నియాలోని ‘కోరల్ గ్రోవ్’ అనే అత్యంత సంపన్నమైన, చుట్టూ కాపలా ఉండే ఒక గేటెడ్ కమ్యూనిటీ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. సాషా కాలేజీ ఫీజు కోసం డబ్బు అవసరమై, ఇక్కడ బేబీసిట్టర్‌గా చేరుతుంది. సాషా అన్నయ్య మార్కో, అదే కాలనీలో తోటమాలిగా పని చేస్తాడు. సాషా ఆ కాలనీలోకి అడుగు పెట్టిన మొదటి రోజే అక్కడ వాతావరణం చాలా వింతగా, నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డ్, గతంలో ఇక్కడ పని చేసిన కొందరు బేబీసిట్టర్లు రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారని సాషాతో అంటాడు.
కానీ సాషా డబ్బు కోసం ఆ మాటలను పెద్దగా పట్టించుకోదు. ఆమె జాలీ అనే పాపని చూసుకోవడం ప్రారంభిస్తుంది. జాలీ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాలనీలోని మిగతా పిల్లలందరూ కూడా ఏడుపు, అల్లరి లేకుండా ఒక రోబోలలాగా నిశ్శబ్దంగా ఉంటారు. వారంతా ఒకే సమయంలో ఒకేలా ప్రవర్తించడం సాషా గమనిస్తుంది. ఈ క్రమంలోనే ఒకరోజు సాయంత్రం సాషా, జాలీని తీసుకుని కాలనీలోని ప్లేగ్రౌండ్ కి వెళ్తుంది. అక్కడ మిగతా పిల్లలంతా వింతగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడి ఉంటారు.
సాషా ఒక క్షణం పక్కకు తిరిగి చూసేలోపు జాలీ అకస్మాత్తుగా మాయమవుతుంది. కంగారుపడిన సాషా ప్లేగ్రౌండ్ అంతా వెతుకుతుంది. ఆ సమయంలో ప్లేగ్రౌండ్‌లోని ఒక పెద్ద స్లైడర్ కింద ఒక రహస్య భూగర్భ సొరంగ మార్గం ఆమెకు కనిపిస్తుంది. ధైర్యం చేసి సాషా లోపలికి వెళ్తుంది. అప్పుడే ఒక భయంకరమైన నిజం బయట పడుతుంది. ఆ సొరంగం లోపల అంతా జిగటగా, తేనెపట్టు లాంటి ఒక వింతైన పదార్థంతో నిండి ఉంటుంది. అక్కడ సాషాకు అసలు నిజం తెలుస్తుంది. ఆ భూగర్భంలో ఒక వింతైన అతీంద్రియ శక్తి నివసిస్తూ ఉంటుంది. అది ఒక ‘హైవ్ మైండ్’ లాంటిది.
అది ఆ కాలనీలోని పిల్లలందరినీ తన మైండ్ కంట్రోల్‌తో లొంగదీసుకుంది. ఆ పిల్లల శరీరాల్లో రక్తం స్థానంలో ఒక రకమైన పసుపు రంగు జిగట ద్రవాన్ని నింపుతుంది. గతంలో మాయమైన బేబీసిట్టర్లను, కొందరు పెద్దలను కూడా ఆ జీవి చంపేసి, తన ఆహారంగా మార్చుకుందని సాషా గ్రహిస్తుంది. జాలీ కూడా ఇప్పుడు ఆ శక్తి నియంత్రణలోనే ఉందని తెలుసుకుంటుంది. క్లైమాక్స్ లో హీరోయిన్ దాని పని పడుతుంది. మరి హీరోయిన్ ఆ సొరంగం నుంచి ఎలా బయట పడింది ? పిల్లలను దాని బారి నుంచి కాపాడగలిగిందా ? చివరికి ఆ శక్తిన ఎలా అంతమొందించింది ? అన్నది స్టోరీ. ఈ హారర్ థ్రిల్లర్ ఉచిత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Tubi TV లో అందుబాటులో ఉంది.
Read Also : హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 సినిమాలు… ఒక్కటి కూడా మిస్ కావొద్దు భయ్యా