E-Paper
Advertisement

రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిన సీఎం రేవంత్: కవిత ఎద్దేవా

రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిన సీఎం రేవంత్: కవిత ఎద్దేవా
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: డిండి రిజర్వాయర్ కు ఏదుల నుంచి నీళ్లు తెస్తామంటూ మహబూబ్ నగర్, నల్గొండ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసలు ఏదులకే 2 టీఎంసీల నీళ్లు తేవటం సాధ్యం కాదంటే..అక్కడ నుంచి డిండికి నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. డిండి రిజర్వాయర్ కు నీళ్లు తేవాలంటే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయటమే సరైన పరిష్కారమని చెప్పారు. దానికి సంబంధించిన టెక్నికల్ డీయిటెల్స్ ను వివరిస్తూ డిండి రిజర్వాయర్ వద్దే శనివారం ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిండి రిజర్వాయర్ కు ఏదులను సోర్స్ పాయింట్ గా చేసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు. ఏదుల నుంచి డిండికి నీళ్లు తేవటం అంత సులువు కాదని చెప్పారు. శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకే 2 టీఎంసీల నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఉంటే డిండికి నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. పైగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే లెవల్ 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెరిగిందని గుర్తు చేశారు.

రెండు జిల్లాల మధ్య రేవంత్ రెడ్డి పంచాయితీ..

Advertisement

ఎల్లూరు పంపుహౌస్ ను ఓపెన్ కట్ నుంచి అండర్ గ్రౌండ్ గా మార్చడంతోనే సమస్య వచ్చిందని చెప్పారు. అప్రోచ్ చానల్ 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిపోయిందని.. ఎల్లూరు పంపుహౌస్ కోసం చేపట్టిన బ్లాస్టింగ్స్ తో కల్వకుర్తి పంపు హౌస్ లో ఒక పంపు పేలిపోయిందన్నారు. ఏళ్లు గడిచినా దాన్ని రీస్టోర్ చేయకపోగా.. ఇప్పుడు మళ్లీ 0.6 టీఎంసీల కోసం ఇంకో సోర్స్ కోసం పంపు హౌస్ తవ్వితే కల్వకుర్తి, పాలమూరు పంపు హౌస్ లకు ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అన్ని అడ్డంకుల మధ్య ఏదుల నుంచి డిండికి లింక్ చేస్తామని చెప్పటం రెండు జిల్లాల ప్రజల మధ్య తగువులు పెట్టించటమేనన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీళ్లు తేవటం చేతగాకనే ముఖ్యమంత్రి రెండు జిల్లాల ప్రజల మధ్య పంచాయితీ పెడుతున్నారన్నారు.

ఏ ప్రతిపాదికన ఏదులను సోర్స్ పాయింట్ అంటున్నారు

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదులను డిండికి సోర్స్ పాయింట్ అని చెబుతున్నప్పటికీ దానికి ప్రతిపాదిక ఏంటనీ కవిత ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సార్లు సర్వేలు చేసి సోర్స్ పాయింట్ గుర్తించలేకపోయిందని, కాంగ్రెస్ ఏ విధంగా ఏదుల సోర్స్ పాయింట్ అని చెబుతుందో చెప్పాలన్నారు. సర్వే చేయకుండా, జీవో ఇవ్వకుండా నోటి మాటతో ఎలా చెబుతారని నిలదీశారు.  కృష్ణా నదిలో నీళ్లే లేకుండా డిండికి అక్కడ నుంచి ఉల్పరకు నీళ్లు ఎలా తెస్తారని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కు శ్రీశైలం  సోర్స్ పాయింట్ గా చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అసలు ఆ ప్రతిపాదనే తప్పన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుచేసిందన్నారు. ఆనాటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు క్షమించాలని కోరారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు చాలవన్నట్లుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు సాధ్యం కానీ ప్రతిపాదనలు చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే పరిష్కారం

ఉమ్మడి నల్గొండ నీటి సమస్యలకు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని కవిత చెప్పారు. ఎంతో మంది మేధావులు, ఇంజనీర్లతో గంటల తరబడి మేధో మదనం చేసిన తర్వాతే తాము ఈ విషయం చెబుతున్నామన్నారు. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో బస్వాపూర్ మీదుగా డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఇవ్వడమే శాశ్వత పరిష్కారమన్నారు. గోదావరి నీళ్లను కృష్ణాతో అనుసంధానం చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఇప్పటికే బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆ పనులు మొత్తం పూర్తి చేస్తే డిండికి నీళ్లు తేవటం సులువని చెప్పారు. శివన్న గూడెం, కిష్టరాయి పల్లి పూర్తి కాకపోయినప్పటికీ.. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చన్నారు. ఉల్పరకు కూడా బస్వాపూర్ నుంచి నీళ్లు తీసుకోవచ్చని చెప్పారు.

కవిత హెచ్చరికలు..

కొండపోచంపల్లి నుంచి షామిర్ పేట్ చెరువు ద్వారా కూడా శివన్నగూడెం కు గోదావరి నీళ్లను తీసుకురావచ్చని చెప్పారు. డిండికి నీళ్లను ఎత్తిపోసుకునేందుకు ఇప్పుడున్న మార్గం ఇదేనని.. గోదావరి నీళ్లు రాకపోతే డిండికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. మనకున్న గోదావరి, కృష్ణా నదుల్లో నీటిని పుష్కలంగా వాడుకోవాలంటే ఆ రెండు నదులను అనుసంధానం చేయాల్సిందేనని కవిత అన్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే పీవీ నర్సింహారావు గుర్తించారని.. ఎస్ఆర్ఎస్పీ ద్వారా నల్కొండ వరకు కూడా నీళ్లు ఇచ్చే విధంగా కెనాల్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. గోదావరి నది ద్వారా పూర్తిగా సిద్ధంగా ఉన్న వ్యవస్థను వాడుకోకుండా కృష్ణా నీళ్లను డిండికి తెస్తామని అన్యాయం చేస్తున్నారన్నారని విమర్శించారు. అటు గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని తుపాకుల గూడెం వద్దే జరిగేలా చూడాలని, ఆంధ్రా ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి పోలవరం వద్ద చేస్తామంటే ఊరుకోమని ఆమె హెచ్చరించారు.

ప్రశ్నిస్తూ పరిష్కారం చూపిస్తున్నాం

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేయటమే కాకుండా వాటి పరిష్కారాలకు కూడా తాము మార్గం చూపిస్తున్నామని కవిత అన్నారు. పాలమూరు- రంగారెడ్డి విషయంలో కూడా పరిష్కార మార్గాలు చూపామన్నారు. ఐతే రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీలు రారు, చూడరు, ఏమీ చేయరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలపై పోరాటం చేస్తూ పరిష్కారం కూడా చూపిస్తున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో ప్రాజెక్ట్ లు పూర్తి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసి రాష్ట్రానికి మేలు చేయాల్సినప్పటికీ ముఖ్యమంత్రి అలా చేయటం లేదన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులను పక్కన పెట్టి గంధమల్ల పనులు స్టార్ట్ చేయటం ఏంటనీ ప్రశ్నించారు. డబ్బుకోసమో, పేరు కోసమో ప్రజలకు అన్యాయం చేయవద్దని సూచించారు. ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని సూచించారు.  మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్ హౌస్ నడిపించి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న అది పక్కన పెట్టి తుమ్మడి హెట్టి కడతామని చెప్పటం ఏంటనీ నిలదీశారు. ఇప్పటికీ ఏటా గోదావరి నుంచి 3 వేల 5 వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తాము అధికారంలోకి వచ్చాక ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని అదే తమ విధానమని చెప్పారు.

నల్గొండ లో రిజర్వాయర్లు కడుతాం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు నెలల క్రితం మళ్లీ ఫ్లోరైడ్ కేసు నమోదవటం ఆందోళనకు గురిచేసిందని కవిత చెప్పారు. ఆ విషయం తెలిసిన నాటి నుంచే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మెదళ్లను కరిగించి మేధో మదనం చేశామన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయటం ద్వారా సమస్యను పరిష్కారించవచ్చన్నారు. ఫ్లోరైడ్ సమస్య పోవాలంటే 40 ఏళ్ల వరకు ఈ నేల నది జలాలతో తడవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ సాధించుకొని 13 ఏళ్లైనా దీనిపై దృష్టి పెట్టలేదని చెప్పారు. జూరాల నుంచి శ్రీశైలం వరకు 2 వందల కిలోమీటర్ల దూరం వరకు మనం ఒక్క ప్రాజెక్ట్ కట్టుకోకపోవటం అన్యాయమన్నారు. గతంలో కేసీఆర్ గారు ఒక ప్రాజెక్ట్ కడతామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నల్గొండ జిల్లాలో చిన్న చిన్న రిజర్వాయర్లు కడతామని చెప్పారు. ఈ జిల్లా నుంచే నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా డిండికి ఏదుల నుంచి నీళ్లు తేలేమని తెలుసున్నారు. కానీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అటు సన్నబియ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ రేట్లు పెరగటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానీ తనమేనని చెప్పారు. మిల్లర్ల అవినీతిలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా నల్గొండ జిల్లా కు చెందిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టాలని మంత్రికి సూచించారు.

ఈ ముఖ్యమంత్రి రేసు గుర్రం కాదు కీలు గుర్రం

రేసుగుర్రం లాగా రాష్ట్రాన్ని పరుగెత్తిస్తారని రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన కీలు గుర్రంగా మారిపోయాడని కవిత అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా అందరినీ మోసం చేేస్తున్నారని చెప్పారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటలు వేయవద్దని రైతులకు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఏం పరిహారం ఇస్తారో మాత్రం చెప్పటం లేదన్నారు. పంటలు వేయని రైతులందరికీ ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాన్ ఫర్ ఫార్మింగ్ అసెట్ గా మారిందన్నారు. ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు ఇప్పుడు రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను గ్రాడ్యుయేట్లు మంచి అవకాశంగా మలుచుకోవాలని కోరారు. ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ పరిష్కారం చూపించే దిశగా ప్రజల కోసం పనిచేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఆమె గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు.

Also Read: రైతులకు బంపర్ ఆఫర్! క్వింటాల్ వరి రూ.5,500? ఎలాగో తెలుసా?!

Tags

Related News

తెలంగాణ ఖైదీలకు.. కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్న జైళ్ల శాఖ!

రైతులకు బంపర్ ఆఫర్! క్వింటాల్ వరి రూ.5,500? ఎలాగో తెలుసా?!

కొడంగల్ అభివృద్ధి నిధులపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

విద్యుత్ సేవల్లో ఆలస్యమైందా.. అయితే వెంటనే పరిహారం పొందే అవకాశం.. ఎలానో తెలుసా..?

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, డ్రైవర్ అరెస్ట్

వరంగల్ జిల్లాలో దారుణం.. పాకాల సరస్సులో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య!

నేనే మీ ఓనర్‌ను.. కోటి రూపాయలు పంపించు! వాట్సాప్‌తో అకౌంటెంట్‌కు టోకరా

Big Stories

Advertisement
×