Supernatural Horror Thriller: ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన కూతురు… అకస్మాత్తుగా వేల ఏళ్ల నాటి శవపేటికలో సజీవంగా కనిపిస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ? ఆమెను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శరీరంపై చర్మం ఊడిపోవడం మొదలై, వింత మంత్రాలు కనిపిస్తే ? అసలు ఇన్నేళ్లూ ఆమె ఎక్కడ ఉంది ? ఆమెలోకి ఏదైనా అతీంద్రియ శక్తి ప్రవేశించిందా ? ఇలాంటి భయంకరమైన ప్రశ్నలతో సాగే సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘లీ క్రోనిన్స్ ది మమ్మీ’ (Lee Cronin’s The Mummy). మరి ఇన్నాళ్ళూ థియేటర్లను గడగడలాడించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?…
కథ ఈజిప్ట్ లోని కైరోలో మొదలవుతుంది. చార్లీ కానన్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తుంటాడు. భార్య లారిస్సా, కూతురు కేటీ, కొడుకు సెబాస్టియన్ తో కలిసి జీవిస్తుంటాడు. ఓ రోజు కైరోను అకస్మాత్తుగా భారీ ఇసుక తుఫాను చుట్టుముడుతుంది. అదే సమయంలో ది మెజీషియన్ గా పిలిచే ఓ రహస్యమైన మహిళ కేటీని ఎత్తుకెళ్లడంతో కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోతుంది. కేటీ కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకదు. కాలం గడిచిపోతున్నా ఆమె తిరిగి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు ఆమె గదిని అలాగే ఉంచుతారు. ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత కుటుంబం అమెరికాలోని అల్బుకెర్కీకి మారుతుంది. అప్పటికే కేటీ తిరిగి వస్తుందనే ఆశ కూడా దాదాపుగా సన్నగిల్లిపోతుంది.
అయితే ఓ విమాన ప్రమాదం తర్వాత ఈ కుటుంబం జీవితంలో ఊహించని మలుపు వస్తుంది. దాదాపు 3,000 ఏళ్ల నాటి నల్లటి శవపేటికలో కేటీ సజీవంగా కనిపిస్తుంది. కానీ ఆమె పరిస్థితి చూసి తల్లిదండ్రులు షాక్ అవుతారు. శరీరమంతా గాయాలు, బంధనాల గుర్తులు… పైగా ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంటుంది. వైద్యులు కూడా ఆమె పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడంతో, తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లి చూసుకోవాలని నిర్ణయించుకుంటారు.
అక్కడి నుంచే అసలు భయానక కథ మొదలవుతుంది. కేటీ ప్రవర్తనలో ఊహించని మార్పులు కనిపిస్తాయి. ఆమె శరీరంపై చర్మం పొరలుగా ఊడిపోవడం మొదలవుతుంది. ఆ చర్మంపై కనిపించే పురాతన ఈజిప్షియన్ గుర్తులు కుటుంబాన్ని మరింత భయపెడతాయి. ఆమెకు సాధారణంగా అర్థంకాని శక్తులు రావడం, ఇంట్లో వింత సంఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పుతుంది.
ఇదే సమయంలో ఈజిప్ట్‌లో కేసును పరిశోధిస్తున్న డిటెక్టివ్ డాలియా జాకీకి కొన్ని కీలక ఆధారాలు దొరుకుతాయి. కేటీ అదృశ్యం వెనుక ఉన్న రహస్యం, పురాతన ఆచారాలు, నాస్మారేనియన్ అనే భయంకరమైన శక్తి గురించి ఆమెకు తెలుస్తుంది. ఆ శక్తి కుటుంబ సభ్యుల మధ్య భయం, హింసను పెంచుతూ… ఒకరిపై ఒకరు తిరగబడేలా చేస్తుందని తెలుస్తుంది. కేటీ శరీరంలో ఉన్నది అసలు ఎవరు ? ఆ పురాతన శక్తి నుంచి కుటుంబం బయటపడగలదా ? డాలియా కనిపెట్టిన రహస్యానికి కేటీ అదృశ్యమైన ఘటనకు ఉన్న సంబంధం ఏంటి ? చార్లీ తన కూతురిని కాపాడేందుకు ఎంత దూరం వెళ్తాడు ? ఈ ప్రశ్నలకు సమాధానాలే సినిమా చివరి భాగాన్ని మరింత భయానకంగా మారుస్తాయి.
‘లీ క్రోనిన్స్ ది మమ్మీ’ సెప్టెంబర్ 17 నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఈవిల్ డెడ్ రైజ్ (Evil Dead Rise)తో హారర్ జానర్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లీ క్రోనిన్ (Lee Cronin) తెరకెక్కించిన ఈ సినిమా… సాధారణ మమ్మీ కథల కంటే భిన్నంగా బాడీ హారర్, సైకలాజికల్ హారర్, ఫ్యామిలీ టెన్షన్‌ను కలిపి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. హారర్ సినిమాల్లో కొత్త తరహా కథలు చూడాలనుకునేవారికి ఇది ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.
Read Also: సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్