Recover deleted phone photos: స్మార్ట్ ఫోన్‌లో తెలియక లేదా పొర పాటున మనకు ఇష్టమైన ఫోటోలు డిలీట్ అయి పోతే గుండె గుభిల్లుమంటుంది.ఆ ఫోటోలను ఎలా తిరిగి పొందాలో.. తెలియక చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అయితే.. మీరు డిలీట్ చేసిన ఫోటోలు వెంటనే ఎప్పటికీ కనుమరుగైపోవు. అవి మీ ఫోన్‌లోని రీసైకిల్ బిన్ లేదా ట్రాష్ ఫోల్డర్‌లో చాలా కాలం పాటు సేఫ్‌గా ఉంటాయి. తొలగించిన ఫోటోలు మీ ఫోన్‌లో ఎంతకాలం ఉంటాయి? వాటిని ఏ విధంగా తిరిగి పొందవచ్చనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది మన జ్ఞాపకాలను దాచుకునే ఒక డిజిటల్ ఆల్బమ్ లాంటిది. రోజూ ఎన్నో ఫోటోలు తీస్తుంటాము. అలాగే అవసరం లేని వాటిని డిలీట్ చేస్తుంటాము. అయితే.. కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన ఫోటోలు పొరపాటున డిలీట్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని తిరిగి ఎలా పొందాలో చాలా మందికి అవగాహన ఉండదు. ఫోన్‌లోని గ్యాలరీ నుంచి ఫోటో డిలీట్ చేసినంత మాత్రాన అది పూర్తిగా డిలీట్ అయిపోయినట్లు కాదు.
మీరు ఏదైనా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా గూగుల్ ఫోటోలు (Google Photos) ఉపయోగిస్తుంటే, డిలీట్ చేసిన ఫోటోలు నేరుగా ‘ట్రాష్’ (Trash) లేదా ‘బిన్’ (Bin) ఫోల్డర్‌లోకి వెళ్తాయి. ఆండ్రాయిడ్ డిఫాల్ట్ గ్యాలరీ లేదా గూగుల్ ఫోటోలలో డిలీట్ చేసిన ఫోటోలు సాధారణంగా 30 రోజుల పాటు భద్రంగా ఉంటాయి. ఈ 30 రోజుల వ్యవధిలో మీరు ఎప్పుడైనా ఆ ఫోటోలను ఓపెన్ చేసి ‘రీస్టోర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా తిరిగి మీ ఫోన్ గ్యాలరీలోకి తెచ్చుకోవచ్చు. ఒకవేళ 30 రోజులు దాటితే మాత్రం ఆ ఫోటోలు ఆటోమేటిక్‌గా శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. ఆ తర్వాత వాటిని రికవర్ చేయడం సాధ్యం కాదు.
యాపిల్ ఐఫోన్ వాడే వారికి కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. ఐఫోన్‌లోని ‘ఫోటోస్’ (Photos) యాప్‌లో ఏదైనా ఫోటోను డిలీట్ చేస్తే.. అది వెంటనే కనిపించకుండా పోదు. ఆ ఫోటోలు అల్బమ్స్ కింద ఉండే ‘Recently Deleted’ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ఈ ఫోటోలు సరిగ్గా 30 రోజుల పాటు అలాగే ఉంటాయి. ఈ ముప్పై రోజుల గడువులోపు మీరు ఆ ఫోల్డర్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన ఫోటోను సెలెక్ట్ చేసి ‘రికవర్’ చేసుకుంటే సరి పోతుంది. ఆపిల్ క్లౌడ్ సింక్ ఆన్ అయి ఉంటే అక్కడ కూడా ఈ అవకాశం ఉంటుంది.
Also Read: థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ
ఒకవేళ 30 రోజుల గడువు ముగిసిపోయి, ట్రాష్ లేదా రీసెంట్లీ డిలీటెడ్ ఫోల్డర్ నుంచి కూడా ఫోటోలు ఆటోమేటిక్‌గా.. డిలీట్ అయిపోతే.. వాటిని తిరిగి పొందడం సాధారణంగా కష్టం. అయితే.. కొన్ని సందర్భాల్లో గూగుల్ డ్రైవ్ లేదా క్లౌడ్ బ్యాకప్ ఆన్ చేసి ఉంటే అక్కడ చెక్ చేయొచ్చు. లేదా మార్కెట్లో లభించే.. కొన్ని నమ్మకమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ల సహాయంతో ప్రయత్నించవచ్చు. కానీ.. ఇవి నూటికి నూరు శాతం ఫలితాన్ని ఇస్తాయని చెప్పలేం. అందువల్ల ముఖ్యమైన ఫోటోల విషయంలో ఎప్పుడైనా సరే క్లౌడ్ బ్యాకప్ ఆన్ చేసుకొని ఉండటం చాలా ముఖ్యం.
పొరపాటున.. ఫోటోలు డిలీట్ అయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లోని రీసైకిల్ బిన్ లేదా ట్రాష్ ఫోల్డర్‌ను చెక్ చేయడం ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలో వాటిని తిరిగి పొందొచ్చు. ఈ 30 రోజుల గడువును గుర్తుంచుకోవడం ద్వారా మీ విలువైన జ్ఞాపకాలను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. మీరు కూడా ఈ ట్రిక్‌ను గుర్తుపెట్టుకొని మీ ఫోటోలను సేఫ్‌గా ఉంచుకోండి.