Telugu family Drama: మూఢనమ్మకాలు, జాతకాలు, మంచి ముహూర్తాలు… ఇవన్నీ నమ్మడం తప్పు కాదు. కానీ అదే నమ్మకం మనిషి ప్రాణాల కంటే ఎక్కువైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? అలాంటి ఆసక్తికరమైన అంశాన్ని కుటుంబ కథతో కలిపి తెరకెక్కిన చిత్రమే ‘జాతిరత్నం (Jathi Rathnam)’. సీనియర్ నటి రాశి, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, సతీష్ వేగేశ్న పర్యవేక్షణలో రూపొందుతున్న ‘కథాసుధ’ ఆంథాలజీ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? ఎందుకు ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
విక్రమ్‌కు జాతకాలు, శకునాలు, రాహుకాలం, మంచి ముహూర్తాలంటే విపరీతమైన నమ్మకం. ఇంట్లో ఏ చిన్న పని చేయాలన్నా పంచాంగం చూసే వరకు అతను ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. అతని ఈ అలవాటు మొదట్లో కుటుంబ సభ్యులకు నవ్వు తెప్పించినా, తర్వాత పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఒకరోజు అతని భార్య తీవ్ర అస్వస్థతకు గురవుతుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినా, విక్రమ్ మాత్రం మంచి ముహూర్తం కోసం వేచి ఉండాలని పట్టుబడతాడు.
ప్రాణాల కంటే ముహూర్తమే ముఖ్యమని భావిస్తూ కాలయాపన చేస్తాడు. ఇదంతా చూసిన అత్తగారు తీవ్ర ఆవేదనకు గురవుతుంది. తన కూతురు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా కూడా అల్లుడు మూఢనమ్మకాల నుంచి బయటకు రాకపోవడంతో అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అక్కడి నుంచి ఆ కుటుంబంలో జరిగే సంఘటనలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. విక్రమ్ తన తప్పును గుర్తిస్తాడా ? అతని మూఢనమ్మకాలు కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టాయి ? చివరికి భార్యను కాపాడగలుగుతాడా ? అత్త అతనిలో మార్పు తీసుకురాగలిగిందా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ఈ సినిమాలో కామెడీతో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాన్ని ఎక్కడా ఉపన్యాసంలా కాకుండా, సహజమైన సంఘటనల ద్వారా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. చివర్లో వచ్చే సందేశం ప్రతి కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచించేలా చేస్తుంది.
‘జాతిరత్నం’ సినిమాలో రాశి, శశాంక్, అన్విష, రవి బయ్యావరపు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వార ముళ్ళపూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ETV Win ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘కథాసుధ’ ఆంథాలజీ సిరీస్‌లో భాగంగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకుల కోసం రూపొందిన ఈ చిత్రం పూర్తిగా తెలుగులోనే అందుబాటులో ఉంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ సందేశాత్మక సినిమా కోసం వెతుకుతున్నవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన. నవ్వులు పంచుతూనే, మూఢనమ్మకాల కంటే మనిషి ప్రాణమే ముఖ్యమనే విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు ఇందులో. ఇంకా చూడకపోతే ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడే ఒక లుక్కేయండి.
Read Also: ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్