Korean Romantic Comedy Drama: ఒక చిన్న స్కాండల్ కారణంగా తన కెరీర్ తో పాటు ప్రేమను కూడా కోల్పోతే ? అందరినీ దూరం పెట్టి ఓ చిన్న ఊరికి వెళ్లిన అమ్మాయి జీవితంలోకి ఊహించని వ్యక్తి వస్తే ? ఆమె మనసులో మళ్లీ ప్రేమ చిగురిస్తే ? కానీ ఆమె గతానికి సంబంధించిన ఓ రహస్యం బయట పడితే పరిస్థితులు ఎలా మారతాయి ? తనకు ఎదురైన బాధను మర్చిపోయి ఆమె మళ్లీ సంతోషంగా జీవించగలిగిందా ? ఈ ప్రశ్నలకు ప్రేమ, భావోద్వేగాలతో సమాధానం చెబుతున్న కొరియన్ రొమాంటిక్ కామెడీ హీలింగ్ డ్రామానే Spring Fever. మరి కొరియన్ మూవీ లవర్స్ ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
సియోల్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో ఎథిక్స్ టీచర్ గా పని చేస్తుంటుంది యాన్ బోమ్. తన పనిలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె జీవితంలో ఓ తప్పుడు స్కాండల్ ఊహించని విషాదాన్ని తీసుకొస్తుంది. ఆ అపనింద కారణంగా కెరీర్ దెబ్బతినడంతో పాటు, మానసికంగా కూడా పూర్తిగా కుంగిపోతుంది. చివరికి సియోల్ ను వదిలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటుంది. అలా సిన్సు అనే చిన్న తీరప్రాంత పట్టణంలోని స్కూల్ కు ఎక్స్ఛేంజ్ టీచర్ గా వస్తుంది. కానీ ఊరు మారినా ఆమె మనసులోని బాధ మాత్రం మారదు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా, నవ్వకుండా తన చుట్టూ ఓ గోడ కట్టుకుని జీవిస్తుంటుంది.
అక్కడే ఆమె జీవితంలోకి సియోన్ జే-గ్యు వస్తాడు. స్థానిక కంపెనీకి సీఈఓగా ఉండే జే-గ్యు బయటికి కాస్త రఫ్ గా కనిపించినా, మనసు మాత్రం చాలా మంచిది. స్కూల్‌లో చదివే అతని మేనల్లుడు సియోన్ హాన్-గ్యోల్ కారణంగా యాన్ బోమ్ తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. యాన్ బోమ్ తనలో దాచుకున్న బాధను జే-గ్యు త్వరగానే గుర్తిస్తాడు. ఆమెను మార్చాలని ప్రయత్నించకుండా… తన ప్రేమ, ఆప్యాయతతో నెమ్మదిగా ఆమె మనసులోని మంచును కరిగిస్తాడు.
అయితే గతాన్ని పూర్తిగా దాచిపెట్టలేం కదా. యాన్ బోమ్ కు సంబంధించిన పాత విషయాలు జే-గ్యుకు తెలుసని ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య అపోహలు మొదలవుతాయి. అయినా ఆ సమస్యలను దాటుకుంటూ వీరి బంధం మరింత బలపడుతుంది. గతం ఇచ్చిన గాయాల నుంచి యాన్ బోమ్ ఎలా బయటపడింది ? జే-గ్యు ప్రేమ ఆమె జీవితాన్ని ఎలా మార్చింది ? చివరికి వీరిద్దరి ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుంది ? ఇదే ‘స్ప్రింగ్ ఫీవర్’లోని ఎమోషనల్ జర్నీ.
‘స్ప్రింగ్ ఫీవర్’ 2026లో వచ్చిన కొరియన్ రొమాంటిక్ కామెడీ హీలింగ్ డ్రామా. బేక్ మిన్-అ వెబ్ నవెల్ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ కు పార్క్ వోన్-గుక్ దర్శకత్వం వహించారు. అన్ బో-హ్యున్, లీ జూ-బిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ సిరీస్ Amazon Prime Videoలో కొరియన్ ఒరిజినల్ ఆడియోతో పాటు హిందీ డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో ప్రస్తుతం అందుబాటులో లేదు. కాబట్టి తెలుగు ప్రేక్షకులు హిందీ ఆడియోతో లేదా కొరియన్ ఆడియోను ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. సాఫ్ట్ రొమాన్స్, ఎమోషనల్ హీలింగ్, ఫీల్‌గుడ్ కామెడీ కలిసిన కొరియన్ డ్రామాలు చూడాలనుకుంటే ఈ సిరీస్ సూపర్ ఆప్షన్.