Stick Season 2 OTT: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ డ్రామాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. ఆటతో పాటు నవ్వులు, భావోద్వేగాలు, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను కలిపి చూపించే కథలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ‘టెడ్ లాస్సో’ తరహాలో స్పోర్ట్స్ ప్రపంచంలోని సరదా సంఘటనలతో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్‌ను అందించిన సిరీస్ ‘స్టిక్’ (Stick). హాలీవుడ్ స్టార్ ఓవెన్ విల్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ రెండో సీజన్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నవంబర్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం పది ఎపిసోడ్లతో రూపొందిన ఈ సీజన్‌లో మొదటి రోజు రెండు ఎపిసోడ్లు విడుదల కాగా, ఆ తర్వాత ప్రతి బుధవారం ఒక్కో ఎపిసోడ్ అందుబాటులోకి వస్తోంది. వీకెండ్‌లో ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక మంచి ఫీల్-గుడ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ చూడాలనుకునే వాళ్ళు ‘స్టిక్ సీజన్ 2’ సిరీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి.
ప్రైస్ కాహిల్ ఒకప్పుడు గోల్ఫ్ ప్రపంచంలో మంచి పేరు సంపాదించిన ప్రొఫెషనల్ ప్లేయర్. కానీ కెరీర్‌లో ఎదురైన ఎదురుదెబ్బలు, వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో ఆటకు దూరమవుతాడు. భార్యతో విడిపోవడం, ఉద్యోగం కోల్పోవడం వంటి పరిణామాలతో జీవితంలో పూర్తిగా వెనుకబడిపోతాడు. అలాంటి సమయంలో 17 ఏళ్ల పీటర్ అనే యువ గోల్ఫ్ ప్రతిభావంతుడిని కలుస్తాడు. అతడిలోని అసాధారణ నైపుణ్యాన్ని గుర్తించి, ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా ఎదిగేందుకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
మొదటి సీజన్‌లో ప్రైస్, పీటర్ మధ్య గురుశిష్యుల బంధం ఏర్పడితే.. రెండో సీజన్‌లో పీటర్ తన ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్రయాణంలో తదుపరి అడుగు వేస్తాడు. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన విజయం సులభంగా రాదని, అంచనాలు పెరిగేకొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతుందని తెలుసుకుంటాడు. మరోవైపు తన శిష్యుడు ఎదుగుతున్న కొద్దీ ప్రైస్ కూడా తన జీవితాన్ని మరోసారి పరిశీలించుకుంటాడు.
తన మాజీ ప్రత్యర్థి క్లార్క్ రాస్ ప్రోత్సాహంతో ప్రైస్ మళ్లీ గోల్ఫ్ బరిలోకి దిగాలని నిర్ణయించుకుంటాడు. ఒక ప్రధాన టోర్నమెంట్‌ను గెలిచి అత్యధిక వయసులో విజేతగా నిలవాలనే లక్ష్యంతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో కొత్త కోచ్ అమండా తన నమ్మకమైన సహాయకుడు మిట్స్ అతడికి అండగా నిలుస్తారు. అటు పీటర్ తన కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఇటు ప్రైస్ తనలోని పాత ఛాంపియన్‌ను మళ్లీ బయటకు తీసుకొచ్చేందుకు పడే కష్టాలే ఈ సీజన్‌లో హైలెట్ గా ఉంటాయి.
జేసన్ కెల్లర్ రూపొందించిన ‘Stick Season 2’స్పోర్ట్స్ కామెడీ సిరీస్‌లో ఓవెన్ విల్సన్, పీటర్ డాగర్, మార్క్ మారన్, మరియానా ట్రెవినో, లిల్లీ కే, జూడీ గ్రీర్, తిమోతి ఒలిఫెంట్ కీలక పాత్రల్లో నటించారు. రెండో సీజన్‌లో రియా సీహార్న్, జాన్ హిగ్గిన్స్, బిల్లీ జేన్, రెక్స్ లిన్, సాషా అలెగ్జాండర్, మిస్సీ పైల్ తదితరులు కొత్తగా చేరారు. పది ఎపిసోడ్లతో రూపొందిన ‘స్టిక్’ సీజన్ 2 నవంబర్ 4 నుంచి Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి బుధవారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతుంది. డిసెంబర్ 30న సీజన్ ముగియనుంది.