Psychological Thriller OTT: సైకలాజికల్ థ్రిల్లర్స్, మైండ్ గేమ్ సినిమాలకు హాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఊహకందని ట్విస్టులు, ఒకే గదిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే భీకరమైన మాటల యుద్ధంతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టడం హాలీవుడ్ మేకర్స్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఆ కోవలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ థ్రిల్లర్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఇంటెన్స్ మిస్టరీ మూవీ ‘ఎ టాలెంట్ ఫర్ మర్డర్’ (A Talent for Murder). ఆస్కార్ విజేత హెలెన్ మిర్రెన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో, ఒక కొత్త నవల రాయించాలని వచ్చిన యువ ఎడిటర్‌కు, ఆ క్రైమ్ రచయిత్రి విసిరే సవాలు ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ చుట్టూ సాగే ఈ కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ఈ సినిమాలో ట్విస్ట్ లు కూడా వస్తూనే ఉంటాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ కు మస్త్ మజా ఇస్తుంది ఈ మూవీ.
1995లో స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో ఈ కథ మొదలవుతుంది. ప్రముఖ అమెరికన్ క్రైమ్ రచయిత్రి ప్యాట్రిసియా హైస్మిత్ వయసు మీదపడటంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, జనాలకు దూరంగా ఒంటరిగా జీవిస్తుంటుంది. తన పుస్తకాలు, పిల్లులు, పాత ఆయుధాల మధ్య కాలం గడుపుతుంటుంది. ఆమె రాసిన ‘టామ్ రిప్లే’ నవలల సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంటుంది. ఈ సిరీస్‌లో మరో చివరి నవల రాయిస్తే భారీగా లాభాలు వస్తాయని భావించిన న్యూయార్క్ ప్రచురణ సంస్థ, ఎడ్వర్డ్ రిడ్జ్‌వే అనే యువ ఎడిటర్‌ను ఆమె దగ్గరకు పంపిస్తుంది.
అయితే ఎడ్వర్డ్ ఎంత ప్రయత్నించినా ప్యాట్రిసియా కొత్త నవల రాయడానికి ఒప్పుకోదు. పైగా అతని పట్టుదలను చూసి ఒక వింత షరతు పెడుతుంది. తనతో కలిసి ఒక పర్ఫెక్ట్ హత్యను ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తేనే కొత్త పుస్తకం గురించి మాట్లాడతానని చెబుతుంది. మొదట ఈ ప్రతిపాదనను ఒక రచయిత్రి చేసే సరదా ప్రయోగంలా భావించిన ఎడ్వర్డ్, క్రమంగా ఆ మైండ్ గేమ్‌లోకి లాగబడతాడు.
అక్కడి నుంచి రచయిత్రి కల్పనకు, ఎడ్వర్డ్ వాస్తవ జీవితానికి మధ్య ఉన్న గీత చెరిగిపోవడం మొదలవుతుంది. ప్యాట్రిసియా నిజంగానే అతన్ని భయపెట్టడానికి కథలు చెబుతోందా? లేక ఆమె ఆలోచనల వెనుక మరేదైనా ప్రమాదకరమైన ఉద్దేశం ఉందా? ఎడ్వర్డ్‌లోనూ దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? ఒక రచయిత్రి, ఒక ఎడిటర్ మధ్య మొదలైన ఈ వింత ఆట చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశం. మాటలతోనే ఒకరినొకరు మానసికంగా పరీక్షించుకునే ఈ ఇద్దరి మధ్య సాగే పోటీ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది.
‘ఎ టాలెంట్ ఫర్ మర్డర్’ (A Talent for Murder)లో హెలెన్ మిర్రెన్ ప్యాట్రిసియా హైస్మిత్‌గా, ఆల్డెన్ ఎహ్రెన్‌రీచ్ ఎడ్వర్డ్ రిడ్జ్‌వేగా నటించారు. ఒలివియా కుక్, జూలియట్ స్టీవెన్సన్, జేమ్స్ ఫాల్క్‌నర్, బ్రిడ్ బ్రెన్నన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఆంటోన్ కార్బిన్ దర్శకత్వం వహించిన 106 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంగ్లీష్ థ్రిల్లర్ 2026 సెప్టెంబర్‌లో టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయింది. అక్టోబర్ 23న అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 17 నుంచి Amazon Prime Video, Apple TVలలో రెంట్ లేదా కొనుగోలు ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉంది. హత్యల వెనుక ఉన్న మైండ్ గేమ్స్, ఊహించని మలుపులతో సాగే థ్రిల్లర్లు ఇష్టపడేవారు ఈ సినిమాను ప్రయత్నించవచ్చు.