AI Deepfake Thriller: ఒకప్పుడు ఫొటోలో కనిపించేదే నిజమని, వీడియోలో చూసిందే వాస్తవమని నమ్మేవాళ్లం. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో అసలు జరగని సంఘటనలను కూడా జరిగినట్లుగా చూపించే డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించవచ్చు. అలాంటి ఒక ఫేక్ వీడియో ఎవరి జీవితాన్నైనా నాశనం చేయగలిగితే? ఆ వీడియోను నమ్మినవాళ్లు హింసకు దిగితే పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుంది? ఇలాంటి ఆలోచనలతో తెరకెక్కిన అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘అపోఫెనియాక్స్’ (Appofeniacs). క్రిస్ మార్స్ పిలియెరో దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. దీని కథ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.
ఈ సినిమా ఏఐ (AI) టెక్నాలజీ దుర్వినియోగం వల్ల జరిగే పరిణామాల చుట్టూ తిరిగే ఒక హారర్-థ్రిల్లర్. ఇందులో డ్యూక్ అనే యువకుడికి డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం ఒక సరదా వ్యాపకంలా మారుతుంది. తనకు నచ్చని వారిని ఇబ్బంది పెట్టడానికి, ఇతరుల జీవితాల్లో కల్లోలం సృష్టించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేస్తుంటాడు. అయితే తాను చేసే పనుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆలోచన అతనికి ఉండదు.
ఒక కాఫీ షాప్‌లో జరిగిన చిన్నపాటి గొడవతో మొదలైన అతని ఈ వికృత చేష్టలు, క్రమంగా చుట్టుపక్కల వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. ఆ వీడియోలను చూసినవారు వాటిని నిజమని నమ్మడంతో పలువురి జీవితాలు తలకిందులవుతాయి. చివరికి ఈ నకిలీ వీడియోల ప్రభావం రక్తపాతానికి, భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది.
ఇదిలా ఉంటే, ఈ కథలో డ్యూక్‌తో పాటు మరికొందరి జీవితాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడతాయి. పాపీ, క్లింటో బింటో, లాజ్జీ వంటి పాత్రలు ఈ పరిణామాల వల్ల ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటాయి? నిజం ఏదో, అబద్ధం ఏదో గుర్తించలేని పరిస్థితుల్లో మనుషులు ఎంతటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు? అనే అంశాలతో ఈ కథ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏఐ సృష్టించే అబద్ధాల కంటే, వాటిని నిజమని నమ్మే మనుషుల ప్రవర్తనే ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
క్రిస్ మార్స్ పిలిరో దర్శకత్వం వహించిన ఈ హారర్-థ్రిల్లర్ సినిమాలో ఆరోన్ హాలిడే (Aaron Holliday) ప్రధాన పాత్ర అయిన డ్యూక్‌గా నటించాడు. అతనితో పాటు సీన్ గన్ (Sean Gunn) (క్లింటో బింటో), జెర్మైన్ ఫౌలర్ (Jermaine Fowler) (సెడ్రిక్), సిమ్రాన్ జెహానీ (Simran Jehani) (పాపీ), పైజ్ సియర్సీ (Paige Searcy) (లాజ్జీ), మైఖేల్ అబాట్ జూనియర్, విల్ బ్రాండ్ట్ వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవగా, 2026 నవంబర్ 17నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం ఇది Amazon Prime Video, Apple TV లలో Rent/Buy పద్ధతిలో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంది, తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు.