The Traitors Telugu Season 1 :ఈ మధ్యకాలంలో రియాలిటీ షోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఒకవైపు బిగ్ బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రసారమవుతుంటే.. దీనికి పోటీగా మరో తెలుగు ఓటీటీ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ తొలి సీజన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 15వ తేదీన తేజ సజ్జ (Teja Sajja) హోస్ట్ గా మొత్తం 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో నిన్నటితో ముగిసింది. ఇన్నోసెంట్స్ వర్సెస్ ట్రైటర్స్ పోరులో విజేతలుగా ఎవరు నిలిచారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో మొదలైన ది ట్రైటర్స్ షోలో నమ్మకం, వ్యూహం, అనుమానం ప్రధానంగా.. ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేస్తూ.. అసలైన ట్రైటర్స్ ను గుర్తించడమే ఇన్నోసెంట్స్ లక్ష్యంగా ఈ షో ప్రారంభించారు. తమ గుర్తింపును దాచుకొని.. చివరి వరకు కొనసాగడమే ట్రైటర్స్ వ్యూహం. అలా ఈ సీజన్లో స్వీకర్ అగస్త్య (Sweekar Agasthi), శ్రావ్య వర్మ (Shravya varma) విజేతలుగా నిలిచారు. నవంబర్ 5వ తేదీన ప్రసారమైన గ్రాండ్ ఫినాలే తో ఈ సీజన్ ముగియగా తొలి సీజన్లో.. ఈ ఇద్దరు ట్రైటర్స్ విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే ఇక్కడ స్వీకర్, శ్రావ్య ఇద్దరూ కూడా ట్రైటర్స్ కావడంతో.. అమాయకులుగా ఆటలో కొనసాగిన ఇన్నోసెంట్స్ కి మాత్రం నిరాశే మిగిలింది.
ఇకపోతే ఈ సీజన్లో స్పీకర్ అగస్త్య తీసుకున్న నిర్ణయం ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రారంభంలో ఇన్నోసెంట్ గా కొనసాగిన శ్రావ్య వర్మ పలువురు ట్రైటర్స్ ను గుర్తించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఆషిక పదుకొనే పై అనుమానం వ్యక్తం చేసి, ఆమెను ఆట నుంచి బయటకు పంపించడంలో శ్రావ్య చూపిన ప్రతిభ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఆషిక ఎలిమినేషన్ తర్వాత స్వీకర్ ఒక్కరే ట్రైటర్ గా మిగిలారు. ఈ పరిస్థితుల్లో మరో ఆటగాడిని తన జట్టులోకి తీసుకునే అవకాశం రావడంతో ఆయన శ్రావ్యను ఎంచుకున్నారు. అప్పటివరకు ట్రైటర్స్ ను గుర్తించేందుకు ప్రయత్నించిన శ్రావ్య.. స్వయంగా ట్రైటర్ గా మారడం ఈ సీజన్లో కీలక మలుపు తీసుకుంది.
దీనికి తోడు శ్రావ్యకు అప్పటికే ఇన్నోసెంట్స్ లో నమ్మకం ఉండడంతో స్వీకర్ కి అనుకూలంగా మారింది. ఇతర కంటెస్టెంట్ల ఆలోచనలు , అనుమానాలు ఆమెకు తెలుసు. అదే సమయంలో కొత్త పాత్రలో తన ప్రవర్తన పై అనుమానం రాకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అలా ఇద్దరు కలిసి ఆటను ముందుకు తీసుకెళ్లడంతో.. ఇన్నోసెంట్స్ కి అసలైన ట్రైటర్స్ ను గుర్తించడం కష్టంగా మారింది. హర్షవర్ధన్ పై అనుమానాలు పెరగడం, ఆయన ఎలిమినేట్ కావడం వంటి పరిణామాలు కూడా ట్రైటర్స్ కు అనుకూలంగా మారాయి.
మొత్తం ఆరుగురిలో స్వీకర్, శ్రావ్యతో పాటు వర్ష డిసౌజా, ప్రణవ్, ధనుంజయ, మేఘనాథ్ నిలిచారు. వీరిలో ఇద్దరు ట్రైటర్స్ కాగా మిగిలిన వారు ఇన్నోసెంట్స్. ఫినాలే కి ముందు కూడా స్వీకర్, శ్రావ్య ల భాగస్వామ్యం ఎంతవరకు కొనసాగుతుందనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. పైగా ఇద్దరు ట్రైటర్స్ కావడంతో ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేస్తారా ? అనే ప్రశ్న కూడా ఆసక్తిని పెంచింది. చివరికి ఇద్దరు విజేతలుగా నిలిచి తమ వ్యూహాన్ని విజయవంతంగా నిరూపించారు . అలా వీరిద్దరూ మొదటి సీజన్ విజేతలుగా నిలిచి అందరిని ఆకట్టుకున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన ఈ షోని ఎస్ ఓ ఎల్ ప్రొడక్షన్స్ నిర్మించింది. తొలిసారి తేజా సజ్జ ఇలాంటి రియాలిటీ షో కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. పది ఎపిసోడ్లుగా సాగిన తొలి సీజన్లో ప్రతివారం రహస్య నిర్ణయాలు, ఎలిమినేషన్లు, అనూహ్య మలుపులతో పోటీ కొనసాగింది. చివరికి ఇన్నోసెంట్స్ ను అధిగమించిన శ్రావ్య, స్వీకర్ తొలి సీజన్ విజేతలుగా నిలిచారు.
ఈ షో మొత్తం ప్రైజ్ మనీ రూ.1 కోటి వరకు ప్రకటించినప్పటికీ.. చివరికి విజేతలుగా నిలిచిన శ్రావ్య వర్మ, స్పీకర్ అగస్త్య లకు రూ.42,77,000 నగదు బహుమతి లభించింది.