Steelbird FEC-3 Helmet: ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టీల్ బర్డ్ భారత మార్కెట్లో కొత్త FEC-3 హెల్మెట్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.4,499గా నిర్ణయించింది. రైడర్ల భద్రతతో పాటు సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ కొత్త హెల్మెట్ ను రూపొందించింది. ఇందులో యాంటీ-ఫాగ్ వైజర్, ఇన్ బిల్ట్ సన్ షీల్డ్ లాంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి.
స్టీల్‌బర్డ్ FEC-3 హెల్మెట్‌లో ఎక్కువ ప్రమాద తీవ్రతను తట్టుకునేలా PC-ABS షెల్ ను ఉపయోగించారు. పాలికార్బోనేట్, ABS పదార్థాల మిశ్రమంతో తయారు చేసిన ఈ బయటి షెల్.. ప్రమాద సమయంలో ఇంపాక్ట్ ను తట్టుకునేలా రూపొందించారు. ఈ హెల్మెట్ యూరోపియన్ ECE 22.06, అమెరికన్ DOT FMVSS No. 218, భారతీయ BIS IS 4151:2015 భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఈ మూడు ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
FEC-3లో ప్రధాన ఆకర్షణ పిన్‌లాక్ 30 యాంటీ-ఫాగ్ లెన్స్. చలికాలంలో, వర్షం పడుతున్నప్పుడు లేదంటే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు హెల్మెట్ వైజర్‌పై పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోడ్డుపై స్పష్టంగా కనిపించక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యను తగ్గించేందుకు పిన్‌లాక్ 30 లెన్స్ ఉపయోగపడుతుంది. వైజర్‌పై పొగమంచు ఏర్పడటాన్ని తగ్గించి రైడర్‌కు మంచి విజిబిలిటీ అందించడంలో సాయపడుతుంది.
ఈ హెల్మెట్ లో ఇంటిగ్రేటెడ్ ఇన్నర్ సన్ షీల్డ్ ను కూడా అందించారు. స్లైడర్ మెకానిజం ద్వారా దీన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు కళ్లపై పడే లైట్ తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. తరచూ లైట్ మారే రహదారి పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో డబుల్ డీ రింగ్ రిటెన్షన్ సిస్టమ్‌ను అందించారు. నోస్ ప్రొటెక్టర్, విండ్ డిఫ్లెక్టర్, వైజర్ లాకింగ్ సిస్టమ్ లాంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. హెల్మెట్ కు షార్ప్ డిజైన్, ఏరోడైనమిక్ ప్రొఫైల్ తో స్పోర్టీ లుక్ ఇచ్చారు.
స్టీల్‌బర్డ్ FEC-3 హెల్మెట్ మీడియం, లార్జ్, XL అనే మూడు సైజుల్లో లభిస్తుంది. మీడియం సైజు 580 మిల్లీమీటర్లు, లార్జ్ సైజు 600 మిల్లీమీటర్లు, XL సైజు 620 మిల్లీమీటర్లుగా ఉన్నాయి. అయితే చిన్న సైజు అందుబాటులో లేకపోవడం కొందరు రైడర్లకు ఇబ్బందిగా మారవచ్చు. హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు ధర, ఫీచర్లతో పాటు సరైన సైజును ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. తలకు సరిగ్గా సరిపోయే హెల్మెట్‌నే ఉపయోగించాలి.
Read Also: విన్‌ఫాస్ట్ MPV 7 ధర భారీగా తగ్గింపు.. ఏకంగా రూ.4.10 లక్షలు కట్..