Aankh Micholi OTT: పెళ్లి చూపులు అనగానే అమ్మాయి, అబ్బాయి ఫ్యామిలీలు ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తమ ఇంట్లో ఉన్న మంచి విషయాలనే బయటపెడుతూ, చిన్నచిన్న లోపాలను కూడా కవర్ చేస్తుంటారు. కానీ ఒకే ఇంట్లో నలుగురికి నాలుగు రకాల సమస్యలు ఉంటే.. వచ్చిన పెళ్లి సంబంధం ముందు వాటన్నింటినీ దాచడం సాధ్యమేనా? ముఖ్యంగా అమ్మాయికి రాత్రిపూట కళ్ళు కనిపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన బాలీవుడ్ ఫ్యామిలీ కామెడీ మూవీనే ‘ఆంఖ్ మిచోలి’ (Aankh Micholi). మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, అభిమన్యు దస్సాని వంటి నటీనటులు కలిసి నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా హడావుడి చేయకపోయినా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరి ఈ మూవీ కథేంటి? ఇందులో మృణాల్ ఎలాంటి పాత్రలో కనిపించింది? దీనిని ఎక్కడ చూడచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో నవ్‌జ్యోత్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో విచిత్రమైన సమస్య ఉంటుంది. నవ్‌జ్యోత్‌కు మతిమరుపు ఎక్కువ. ముఖ్యంగా పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటాడు. ఆయన పెద్ద కొడుకు యువరాజ్ వినికిడి లోపంతో బాధపడుతుంటాడు. మరో కొడుకు హర్భజన్ కు నత్తి ఉంటుంది. ఇక కూతురు పరో (మృణాల్ ఠాకూర్)కు రేచీకటి సమస్య. అంటే పగటిపూట బాగానే కనిపించినా, సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రం ఆమెకు సరిగా కనిపించదు. ఇలా కుటుంబమంతా ఒక్కో సమస్యతో ఉన్నప్పటికీ వాళ్ల మధ్య అనుబంధం మాత్రం చాలా బలంగా ఉంటుంది. అయితే పరోకు పెళ్లి చేయాలని తండ్రి నవ్‌జ్యోత్ గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఉండే రోహిత్ పటేల్ అనే యువకుడి నుంచి మంచి సంబంధం వస్తుంది. అతను ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వ్యక్తి కావడంతో ఈ పెళ్లి ఎలాగైనా జరిపించాలని కుటుంబం భావిస్తుంది.
కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. తమ కుటుంబంలోని లోపాల గురించి పెళ్లి కొడుకు ఫ్యామిలీకి తెలిస్తే సంబంధం ఎక్కడ చెడిపోతుందోనని నవ్‌జ్యోత్ భయపడతాడు. ముఖ్యంగా పరోకు ఉన్న రేచీకటి సమస్యను ఎలాగైనా దాచిపెట్టాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ లోపాలను కవర్ చేసుకుంటూ నాటకాలు మొదలుపెడతారు. ఇంతకీ పరోకు ఉన్న సమస్య రోహిత్‌కు తెలుస్తుందా? ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందా? అసలు రోహిత్ దగ్గర కూడా దాచిన రహస్యం ఏదైనా ఉందా? అనే విషయాలు సినిమాలో ఆసక్తికరంగా సాగుతాయి. చివర్లో రెండు కుటుంబాల మధ్య జరిగే గందరగోళం కూడా మంచి కామెడీని పంచుతుంది.
ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాను Sony Pictures International Productions, Merry Go Round Studios నిర్మించాయి. 2023 నవంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం JioHotstarలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పరో పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించగా, రోహిత్ పటేల్‌గా అభిమన్యు దస్సాని కనిపిస్తాడు. నవ్‌జ్యోత్ సింగ్ పాత్రలో పరేష్ రావల్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటారు. యువరాజ్‌గా శర్మన్ జోషి, హర్భజన్‌గా అభిషేక్ బెనర్జీ నటించారు. మొత్తానికి ఒకే కుటుంబంలో ఇన్ని రకాల సమస్యలు, వాటిని బయటపడకుండా దాచేందుకు చేసే ప్రయత్నాలు, పెళ్లి చూపుల సమయంలో ఎదురయ్యే ఫన్నీ సిచువేషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒక కామెడీ సినిమా చూడాలనుకునేవారు ఈ మూవీని వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.
Read Also: రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ