Sci-Fi Adventure Movie OTT : ఒక చిన్న పిన్ ను తాకగానే కళ్లముందు కనిపించేది మన నగరం కాదు… మనం ఊహించని భవిష్యత్ ప్రపంచం. ఆ అద్భుతమైన నగరంలోకి అడుగు పెట్టాలనే ఆసక్తి ఓ టీనేజ్ అమ్మాయిని ప్రమాదకరమైన ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. ఒకప్పుడు మానవ మేధస్సు, విజ్ఞానం, ఆవిష్కరణలకు నిలయంగా ఉన్న ఆ ప్రపంచం ఇప్పుడు నాశనం అంచున ఉండటంతో అసలు మిస్టరీ మొదలవుతుంది. భవిష్యత్తును మార్చేందుకు ఓ అమ్మాయి చేసే సాహసమే ‘టుమారోల్యాండ్’ (Tomorrowland). మరి ఈ సై-ఫై థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
కేసీ న్యూటన్ విజ్ఞానం, కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్న టీనేజ్ అమ్మాయి. ఆమె తండ్రి నాసాలో పని చేస్తుంటాడు. నాసా ప్రాజెక్ట్ కి సంబంధించిన సమస్యల కారణంగా అతని ఉద్యోగం ప్రమాదంలో పడటంతో కేసీ ఆ సమస్యను పరిష్కరించేందుకు తనదైన ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ఆమె చేతికి ఓ విచిత్రమైన పిన్ వస్తుంది. దానిపై ‘T’ గుర్తు ఉంటుంది. దాన్ని తాకగానే కేసీకి తన చుట్టూ ఉన్న ప్రపంచం కనిపించకుండా మరో అద్భుతమైన నగరం కనిపిస్తుంది. ఎత్తైన భవనాలు, ఆధునిక టెక్నాలజీ, ఎగిరే వాహనాలతో నిండిన ఆ నగరం సాధారణ భవిష్యత్ ఊహలా ఉండదు.
ఆ ప్రపంచమే టుమారోల్యాండ్. అయితే దానికి చేరుకోవడం అంత సులభం కాదు. పిన్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో కేసీని కొందరు వ్యక్తులు వెంబడిస్తారు. ఆమెకు సహాయం చేసేందుకు అథీనా అనే మిస్టీరియస్ అమ్మాయి వస్తుంది. ఆమె సహాయంతో కేసీ తనకు కనిపించిన ప్రపంచం గురించి మరింత తెలుసుకుంటుంది. ఆ తర్వాత కేసీ ఫ్రాంక్ వాకర్ ను కలుస్తుంది. చిన్నతనంలోనే టుమారోల్యాండ్ తో పరిచయం ఏర్పడిన ఫ్రాంక్ ఇప్పుడు ఆ ప్రపంచానికి దూరంగా ఉంటాడు. ఒకప్పుడు భవిష్యత్తుపై ఎంతో నమ్మకం ఉన్న అతను ఇప్పుడు మాత్రం భూమి ఎదుర్కోబోయే ప్రమాదాన్ని చూసి నిరాశకు గురయ్యాడు.
కేసీ మాత్రం అతని ఆలోచనలను మార్చుతుంది. భవిష్యత్తు ముందే నిర్ణయించబడలేదని ఆమె నమ్ముతుంది. మనుషులు తమ ఆలోచనలు, నిర్ణయాలతో దాన్ని మార్చగలరని భావిస్తుంది. ఈ నమ్మకమే ఆమెను ఫ్రాంక్‌తో కలిసి టుమారోల్యాండ్ కి వెళ్లేలా చేస్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత అసలు సమస్య బయటపడుతుంది. ఒకప్పుడు మానవ కలలకు ప్రతీకగా ఉన్న ఆ ప్రపంచం ఇప్పుడు క్షీణిస్తోంది. భూమి నాశనం అవుతుందని ప్రజలు నమ్మడం.. అదే ఆలోచన భవిష్యత్తును మరింత చీకటిగా మార్చడం వంటి ఓ విచిత్రమైన చక్రం ఏర్పడుతుంది. కేసీ చేతికి ఆ పిన్ ఎందుకు వచ్చింది ? ఫ్రాంక్ టుమారోల్యాండ్ కు ఎందుకు దూరమయ్యాడు ? భూమి భవిష్యత్తును నిజంగానే మార్చగలరా ? ఒక టీనేజ్ అమ్మాయి నమ్మకం మొత్తం ప్రపంచ భవిష్యత్తును మార్చేంత శక్తిగా మారుతుందా ? ఈ మిస్టరీకి సమాధానమే ‘టుమారోల్యాండ్’లోని అసలు అడ్వెంచర్.
Also Read : ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్
‘టుమారోల్యాండ్’ 2015లో విడుదలైన ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ. జార్జ్ క్లూనీ (George Clooney), బ్రిట్ రాబర్ట్సన్ (Britt Robertson), రఫీ క్యాసిడీ (Raffey Cassidy), హ్యూ లారీ (Hugh Laurie) నటించారు. బ్రాడ్ బర్డ్ (Brad Bird) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అందుబాటులో లేదు.