True Crime Series: కొన్ని నిజ జీవిత ఘటనలను ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రపంచం మర్చిపోదు. అలాంటి ఘటనల్లో 1988లో జరిగిన పాన్ యామ్ ఫ్లైట్ 103 బాంబు పేలుడు ఒకటి. గాల్లో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా పేలిపోవడం, క్షణాల్లో 270 మంది ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే విషాద ఘటనను ఆధారంగా తీసుకుని రూపొందిన లిమిటెడ్ సిరీస్ ‘ది బాంబింగ్ ఆఫ్ పాన్ యామ్ 103’ (The Bombing of Pan Am 103). బీబీసీ, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అప్పటి సంఘటనలను చాలా సహజంగా, భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేసింది. ఇది కేవలం ఒక ఉగ్రదాడి కథ మాత్రమే కాదు… ఆ ఘటన వెనుక నిజాన్ని వెలికి తీసేందుకు దశాబ్దాల పాటు సాగిన పోరాటం కూడా. మరి ఈ రియల్ స్టోరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1988 డిసెంబర్ 21. లండన్ హీథ్రో విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన పాన్ యామ్ ఫ్లైట్ 103లో వందలాది మంది ప్రయాణిస్తున్నారు. అందరూ తమ గమ్యస్థానానికి చేరుకుంటామని అనుకుంటుండగానే, గాల్లోనే విమానంలో భారీ పేలుడు సంభవిస్తుంది. క్షణాల్లో విమానం ముక్కలై స్కాట్లాండ్‌లోని లాకర్బీ ప్రాంతంపై కూలిపోతుంది. విమానంలో ఉన్న 259 మంది ప్రయాణికులతో పాటు భూమిపై ఉన్న మరో 11 మంది కూడా ప్రాణాలు కోల్పోతారు. ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తుంది.
ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? అది ప్రమాదవశాత్తూ జరిగిందా ? లేక ముందే ప్లాన్ చేసిన ఉగ్రదాడా ? అనే అనుమానాలతో దర్యాప్తు ప్రారంభమవుతుంది. స్కాట్లాండ్ పోలీసులు, అమెరికా ఎఫ్‌బీఐ కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్టిగేషన్‌లలో ఒకదాన్ని మొదలు పెడతారు. శిథిలాల మధ్య దొరికిన చిన్న చిన్న ఆధారాలు, దుస్తుల ముక్కలు, పేలుడు పదార్థాల ఆనవాళ్లు… ఒక్కో క్లూను కలుపుకుంటూ నిజానికి దగ్గరవుతుంటారు.
అయితే కేసు ముందుకు సాగేకొద్దీ ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. అంతర్జాతీయ రాజకీయాలు, ఉగ్రవాద సంస్థల అనుమానాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు దర్యాప్తును మరింత క్లిష్టంగా మారుస్తాయి. ఒకవైపు తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ, మరోవైపు నిజాన్ని బయట పెట్టాలనే దర్యాప్తు అధికారుల పట్టుదల కథను మరింత భావోద్వేగంగా మారుస్తాయి.
చివరికి ఆ బాంబు దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు ? ఇన్ని సంవత్సరాల తర్వాత నిజాన్ని ఎలా వెలికితీశారు ? బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందా ? ప్రపంచాన్ని కుదిపేసిన ఈ కేసు ఎలా ముగిసింది ? అనే విషయాలను మాత్రం సిరీస్ చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచారు.
‘ది బాంబింగ్ ఆఫ్ పాన్ యామ్ 103’ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ లిమిటెడ్ సిరీస్‌లో ప్యాట్రిక్ జె. ఆడమ్స్, కానర్ స్విండెల్స్, మెరిట్ వీవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వాస్తవ సంఘటనలను డాక్యుమెంటరీ తరహా నరేషన్‌తో చూపిస్తూ, ఇన్వెస్టిగేషన్‌తో పాటు బాధిత కుటుంబాల భావోద్వేగాలను కూడా సమానంగా ప్రాధాన్యం ఇచ్చారు.
నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు, ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టమైతే ఇది మస్ట్ వాచ్ సిరీస్. ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కథ కాదు… దశాబ్దాల పాటు సాగిన నిజాన్వేషణ, బాధిత కుటుంబాల పోరాటం, అంతర్జాతీయ దర్యాప్తు వెనుక ఉన్న కఠిన వాస్తవాలను చూపించే శక్తివంతమైన కథనం. ఈ వీక్ ఆలోచింపజేసే ఒక గ్రిప్పింగ్ ట్రూ-ఈవెంట్ సిరీస్ చూడాలనుకుంటే, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు. అయితే ఈ సిరీస్ ఓటీటీలో తెలుగులో లేదు.
Read Also: గతం మర్చిపోయిన ఫైటర్… నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే యాక్షన్ సిరీస్