TRAI MyCall App: మొబైల్ వాడుతున్నప్పుడు తరచూ కాల్స్ కట్ అయిపోవడం, అవతలి వారి మాటలు వినపడకపోవడం వంటి సమస్యలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ (TRAI).. తన ‘మై కాల్ యాప్’ను సరికొత్త రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మొబైల్ వినియోగదారులు తమ వాయిస్ కాల్ నాణ్యత (Call Quality) ఎలా ఉందో రిపోర్ట్ చేయెుచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌ను మెరుగుపరుచుకుంటాయని ట్రాయ్ తెలిపింది.
ఈ అప్ గ్రేడ్ చేసిన యాప్‌లో ప్రతి కాల్ పూర్తయిన వెంటనే దాని నాణ్యతపై 1 నుండి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాల్ నాణ్యత బాగుందో లేదో యాప్ ఆటోమేటిక్‌గా యాప్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కొంటే.. అసలు ఏం జరిగిందనేది స్పష్టంగా ఫీడ్ బ్యాక్ రూపంలో నమోదు కూడా చేయవచ్చు.
ఉదాహరణకు.. కాల్ కట్ కావడం (Call Drops), వాయిస్ గజిబిజిగా వినపడటం, క్రాస్ కనెక్షన్లు, కాల్ కనెక్ట్ అవ్వడానికి చాలా సమయం తీసుకోవడం వంటి సమస్యలను నేరుగా ట్రాయ్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫీడ్‌బ్యాక్‌ను ట్రాయ్ సంబంధిత టెలికాం ఆపరేటర్లకు (జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్) అందజేస్తుంది. ఈ క్రమంలో యూజర్ల గుర్తింపును ట్రాయ్ పూర్తి గోప్యంగా ఉంచనుండటం గమనార్హం. మరోవైపు ట్రాయ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాలను టెలికాం కంపెనీలు సులభంగా గుర్తించి.. వెంటనే అక్కడ సేవలను సరిచేసే అవకాశం లభిస్తుంది.
కేవలం కాల్స్ రేటింగ్ ఇవ్వడమే కాకుండా, ఈ కొత్త మైకాల్ యాప్‌లో ‘కవరేజ్ టెస్ట్’ (Coverage Test) అనే ఫీచర్ ద్వారా మీ ప్రాంతంలో సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇప్పటివరకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఒక ఇంటరాక్టివ్ మ్యాప్ రూపంలో చూసుకునే వెసులుబాటును కూడా ట్రాయ్ కల్పిస్తోంది. యాప్ అప్ గ్రేడ్ సందర్భంగా.. ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటి మాట్లాడుతూ.. ప్రతి వినియోగదారుడి ఫీడ్‌బ్యాక్ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ అనుభవాన్ని పంచుకోవాలని కోరారు. ఇది దేశంలో మెరుగైన కాలింగ్ అనుభవాన్ని అందించడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!
అయితే ‘మై కాల్ యాప్’ అనేది వ్యక్తిగత సమస్యలను రిపోర్ట్ చేసే వేదిక కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. బిల్లింగ్ సమస్యలు, సిమ్ కార్డ్ లోపాలు, ఇతర వ్యక్తిగత సేవల సమస్యల కోసం వినియోగదారులు నేరుగా సంబంధిత టెలికాం ఆపరేటర్‌నే సంప్రదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ యాప్ కేవలం దేశవ్యాప్తంగా వాయిస్ కాల్ నాణ్యతను అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.
Also Read: చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!