Matthew Perry Documentary: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తన కామెడీతో నవ్వించిన గ్రేట్ యాక్టర్ మాథ్యూ పెర్రీ (Matthew Perry). ‘ఫ్రెండ్స్’ (Friends) సిరీస్ లో ‘చాండ్లర్ బింగ్’ (Chandler Bing) పాత్రతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెరపై ఎప్పుడూ నవ్విస్తూ, అందరిపై సెటైర్లు పేల్చే ఆ నటుడి నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయి. ఆయన జీవితంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ తాజాగా ఓటీటీలో విడుదలైన మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ ‘ది వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ’ (The One About Matthew Perry). మరి మాథ్యూ పెర్రీ అభిమానులు ఆయన లైఫ్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
నిజానికి ఇది కల్పిత కథ కాదు. మాథ్యూ పెర్రీ జీవిత ప్రయాణం, నటుడిగా ఆయన ఎదుగుదల, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, వ్యసనం నుంచి బయట పడడానికి చేసిన సుదీర్ఘ పోరాటాన్ని… ఆయన సన్నిహితుల ద్వారా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. చిన్నతనంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్న మాథ్యూ, ‘ఫ్రెండ్స్’ సిరీస్ లో చాండ్లర్ బింగ్ పాత్ర దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. 1994 నుంచి 2004 వరకు ఆయన జీవితం గురించి సాగుతుంది ఈ సిరీస్.
అయితే కెరీర్‌లో ఎంతటి విజయాన్ని అందుకున్నా, నిజ జీవితంలో మాథ్యూ పెర్రీ మత్తు పదార్థాలకు బానిసయ్యారు. చికిత్స కోసం రీహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లడం, మళ్లీ అదే సమస్యల్లోకి వెళ్లిపోవడం వంటి అనుభవాలు ఆయన జీవితాన్ని చాలా ఎఫెక్ట్ చేశాయి. తెరపై నవ్వులు పంచిన వ్యక్తి వెనుక ఇంతటి పోరాటం ఉందనే విషయం ఈ డాక్యుమెంటరీలో చూశాక ప్రేక్షకులకు ఆశ్చర్యం కలగకమానదు. మాథ్యూ సోదరి మియా పెర్రీ బోవిక్ (Mia Perry Bowick), ఆయన సన్నిహిత మిత్రులు, ఆయనతో కలిసి పనిచేసిన వారి జ్ఞాపకాలు కూడా ఈ సిరీస్ లో చోటు చేసుకున్నాయి. మాథ్యూ వ్యక్తిత్వంలోని సరదా కోణంతో పాటు, ఆయన ఎదుర్కొన్న కష్టాలను కూడా ఈ అనుభవాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి.
ఇక ‘ఫ్రెండ్స్’ సిరీస్‌లో మాథ్యూతో కలిసి నటించిన జెన్నిఫర్ అనిస్టన్ (Jennifer Aniston), కోర్ట్నీ కాక్స్ (Courteney Cox), లిసా కుడ్రో (Lisa Kudrow), మాట్ లెబ్లాంక్ (Matt LeBlanc), డేవిడ్ ష్విమ్మర్ (David Schwimmer) కూడా తెరపై కనిపిస్తారు. మాథ్యూ కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఫొటోలు, గతంలో విడుదల కాని వీడియోలు కూడా ఈ సిరీస్‌లో భాగమయ్యాయి. 2023లో ఆయన మరణించిన తర్వాత మిగిలిన జ్ఞాపకాలు, ఆయన జీవిత ప్రయాణం ఈ సిరీస్‌లో ప్రధానంగా నిలుస్తాయి.
‘ది వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ’ మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్. దీనికి మేరీ రాబర్ట్‌సన్ (Mary Robertson) దర్శకత్వం వహించారు. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. మాథ్యూ పెర్రీ జీవితాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన డాక్యుమెంటరీ. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు.
Read Also: సిటీ డాక్టర్ పై మనసు పడే విలేజ్ కుర్రాడు… ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా